కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా ముస్లిం యునైటెడ్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మీరాలం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఈ ర్యాలీ ప్రారంభమైంది. హసన్‌నగర్, ఆరాంఘర్, మైలార్‌దేవ్‌పల్లి మీదుగా శాస్త్రిపురం వరకు ఇది కొనసాగనుంది. అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు ప్రసంగించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నేతలు ఎండగట్టనున్నారు.
ముస్లిం యువత, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై జాతీయ జెండాలతో ఈ ర్యాలీకి తరలి వచ్చారు. ఈ నిరసన ప్రదర్శనలో సుమారు 30వేల మంది పాల్గొన్నట్లు అంచనా. భారీ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ర్యాలీ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.