ఈ నెల 31వ తేదీన నాగులచవితి పర్వదినం సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి తిరుమాడ వీధులలో పెద్దశేషవాహనంపై ఊరేగుతూ భక్తులను కనువిందు చేస్తారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్యపూజలందుకుంటున్నాడు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తాడు. అందుకే బ్రహ్మోత్సవ వాహనసేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఆ భగవంతుడు ప్రసాదించారు. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల నాలుగు మాడ వీధులలో రాత్రి 7 నుండి 9 గంటల నడుమ శ్రీ మలయప్పస్వామివారు తమ ఉభయదేవేరులతో కలిసి పెద్దశేష వాహనంపై ఊరేగనున్నారు.
previous post