40.2 C
Hyderabad
April 29, 2024 16: 38 PM
Slider ప్రత్యేకం

‘నవీన విద్యావిధానం’ విశ్వమంతటికీ దారిచూపాలి

#nalandauniversity

మానవాళికి మానసిక, శారీరక సౌభాగ్యాన్ని ప్రసాదించే శక్తివంతమైన యోగ మార్గం నాదోపాసన, యోగాభ్యాసం. అవి సామాజిక సామరస్యానికి కూడా గొప్ప ఉపకరణగా నిలుస్తాయి. అవి రెండూ వేరు కాదు, ఒక్కటే. ఎన్నో ఉద్వేగాలు, విద్వేషాల విష ప్రభావాలను మనం చూస్తూనే ఉన్నాం. సంయమనం కోల్పోయి, మానవత్వాన్ని వీడి, దానవ ప్రవృత్తితో జరుగుతున్న దమనకాండలు లోకాన్ని కుదిపేస్తున్నాయి.

ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. కట్టెదుటే పేగుబంధాలు తెగిపోతున్నాయి. రకరకాల ప్రభావాలు,ప్రవృత్తితో సాటిమనిషిని తోటిమనిషే చంపుకుంటున్నాడు. రణరంగం కాని చోటు భూమిపై ఎక్కడా కనిపించడం లేదు. ఈ దానవక్రీడలో కొందరిది స్వార్థం, కొందరిది ఆవేశం, కొందరిది అహంకారం, కొందరిది అవసరం, కొందరిది అజ్ఞానం. రోజురోజుకూ వేడెక్కిపోతున్న మానవ మనఃతాపాన్ని తగ్గించడంలో సంగీతం, యోగ ఎంతగానో ఉప’యోగ’పడతాయి. అందుకే ప్రపంచం యోగా దినోత్సవం,సంగీత ఉత్సవం కూడా జరుపుకుంటోంది.

ఐక్యరాజ్యసమితి మన ప్రధాని నరేంద్రమోదీ చేసిన సూచనలను ఎంతో గౌరవంగా స్వీకరించింది కూడా. మన భరత భూమి వేదభూమి, యోగభూమి. యోగసాధన ఒకప్పుడు మన విద్యావిధానంలో ప్రధానమైన భాగంగా ఉండేది. విద్యాధికులే కాక, సామాన్యులు కూడా వివిధ మార్గాల్లో యోగసాధన చేసేవారు, భక్తి మార్గంలో నడిచేవారు.

యోగాసనాలు, సూర్యనమస్కారాలు, ప్రాణాయామం,ధ్యానం నిత్య సాధనగా ఉండేవి. మేలుకున్నప్పటి నుంచి నిద్రించే వరకూ ‘పాట’ మన జీవనంలో భాగంగా ఉండేది. మేలుకొలుపు పాటలు, జోలపాటలు, జానపదాలు, భజనలు, కోలన్నలు, యక్షగానాలు, వీధిభాగోతాలు, చిందులు,తప్పెట్లు,తాళాలు పల్లెల్లో ఒకప్పుడు మార్మోగేవి.

“తల్లడిల్లే వేళ – తల్లిపాడే జోల పాల కన్నా తీపి పాపాయికి..” అని మన వేటూరి అన్నట్లు, మేలుకుంటే పాట, ఏలుకుంటే పాట అన్నట్లుగా ఉండేది. యోగ – సంగీతం సహజ సజలపాతాలుగా మన జీవనంలో ప్రవేశించి ప్రవహించి ప్రయాణిoచాయి. పుస్తకాన్ని మంచి స్నేహితుడితో ఎలా పోల్చేవారో,సంగీతం కూడా మనకు మంచి స్నేహితురాలు.

మన భావోద్వేగాలన్నింటిలో దానికి భాగస్వామ్యం ఉంటుంది. సంగీతం మనల్ని సేద తీరుస్తుంది, బాధలను మరిపింపజేస్తుంది. మనసు పడే ఒత్తిళ్లను తగ్గించి కర్తవ్యోముఖులను చేస్తుంది, అద్భుతమైన ఆరోగ్యాన్నిస్తుంది. సంగీతం ద్వారా వ్యాధులు నయమవుతాయని చెబుతారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గానం విని,కోమాలో ఉన్న ఎంజిఆర్ పైకి లేచి,ఆరోగ్యంతో జీవించారని మంగళంపల్లి స్వయంగా చెప్పగా మనం అనేకసార్లు విన్నాం.

సంగీతం ద్వారా రాళ్లు కరిగాయని, వర్షం కురిసిందని చదువుకున్నాం. రాళ్లంటే కేవలం రాళ్లు కాదు, రాళ్ల వంటి మనసులు కరిగి మనిషిగా మారడంగానూ అన్వయించుకోవచ్చు. యోగ సాధన ద్వారా అచంచలమైన ఏకాగ్రత,తద్వారా అమోఘమైన జ్ఞాపకశక్తి,అమూల్యమైన జ్ఞానం కలుగుతాయని పూర్వపురుషుల జీవితాలు చెబుతూనే ఉన్నాయి. వేదజ్ఞానం అలా సంపాయించుకున్నదే. సకల విద్యాసముపార్జన అలా జరిగిందే. ‘అవధానవిద్య’ అక్కడ నుంచి పుట్టిందే.

గురువు విద్యను బోధిస్తూ ఉంటే ఏకాగ్రతగా వినడం,విన్న దానిని మనసులో ధరించుకోవడం, ధరించుకున్న దానిని వల్లె వేసుకోవడం,మళ్ళీ తిరిగి అప్పజెప్పడం… అదే! ఒకప్పటి మన విద్యాభ్యాసం. రాసుకోవడం,చూసుకోవడం, చదువుకోవడం అనే ప్రసక్తే లేదు. మనసులోనే అన్నింటినీ నిక్షిప్తం చేసుకోవడమే అప్పటి మార్గం. అదే మానసిక యోగ సాధనం. అటువంటి అభ్యాసం వల్ల మనిషి మెదడు చాలా చురుకుగా ఉండేది,పాదరసంలా పనిచేసేది.

ముందుయుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలైన యువకులు పుట్టుకొచ్చేవారు. మరిప్పుడో!  “కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు” అన్న శ్రీశ్రీ కవితా పంక్తులు గుర్తుకు తెస్తున్నారు. జీవనశైలిని మార్చుకోండి –

ఆరోగ్యం బాగుపడుతుందని వైద్యులు నేడు ఘోషిస్తున్నారు. నేటికాలంలో వచ్చే చాలా వ్యాధులకు అనారోగ్యమైన జీవనవిధానమే ముఖ్య కారణమని మనం తరచూ వింటున్నాం. మన జీవనంలో యోగ,సంగీతాలను తప్పనిసరి భాగస్వామ్యులుగా చేర్చుకుంటే జీవితసర్వస్వం ఆరోగ్యంగా మారిపోతుందని గుర్తెరిగితే సరిపోతుంది. మంచి ఆలోచనలు కలిగినప్పుడు మంచి రసాయనాలు, ఎంజైమ్స్ ఊరుతాయని మానసిక శాస్త్రవేత్తలు, వైద్యశాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. సంగీతానికి భాష లేదు, అది విశ్వజనీనం. నాదయోగమే సంగీతం. మానసిక,భౌతిక సాధనే యోగాభ్యాసం.

సంగీతాన్ని దైవభాషగా చెబుతారు. సంగీతంతో భాషిస్తే దైవం మనిషికి దగ్గరావుతారని అంటారు. అందుకే మన వాగ్గేయకారులంతా సంగీత,సాహిత్యాలను సంయోగం చేశారు. సమలంకృతంగా, సమభూషితంగా వాక్కు,సంగీతాలను సమన్వయం చేసుకున్నారు. ‘ఓం’కార సాధన యోగాభ్యాసంలో భాగమే. సంగీతాన్ని అభ్యసించేవారు కూడా తమ సాధనను ‘ఓంకారం’తో శ్రీకారం చుడతారు. ఆరోగ్యకర జీవన విధానానికి ఉఛ్వాస,నిశ్వాసల వంటి సంగీతం – యోగ సాధనల అభ్యాసాన్ని పెంచుకుంటూ వెళ్ళడమే పరమపథ సోపానం.

ఈ రెండు విద్యలకు సంబంధించిన శిక్షణా కేంద్రాలను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. గురువుల కొరత చాలా ఉంది. ఈ మార్గాలను ప్రధాన వృత్తులుగా ఎంచుకునేవారి సంఖ్య పెరగాలి. రాశి,వాసి పెరగాలంటే ప్రోత్సాహం పెరగాలి. ఉద్యోగ,ఉపాధి అవకాశాలు పెరగాలి.

ఈ వృత్తిలో స్వయంసమృద్ధిగా జీవించే ఆర్ధికపటుత్వం పెరగాలి. ప్రభుత్వాలతో పాటు కార్పొరేట్ సంస్థలు,సంపన్నులు ఈ బాధ్యతను తలకెత్తుకోవాలి. భారత ప్రభుత్వం తాజాగా చేపట్టిన ‘నవీన విద్యావిధానం’లో యోగ,సంగీతవిద్యలకు సముచిత స్థానం దక్కుతుందని ఆశిద్దాం.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

బిజెపి లోకి సీనియర్ హీరోయిన్ జయసుధ.?

Bhavani

తగ్గుతున్న కరోనా విస్ఫోటనం జరిగేందుకు ఇది అవకాశం కాదా?

Satyam NEWS

జో బైడెన్ గెలుపును ఖరారు చేసిన అమెరికన్ కాంగ్రెస్

Satyam NEWS

Leave a Comment