Slider సంపాదకీయం

కొత్త చట్టానికి రాష్ట్రాల స్పీడ్ బ్రేకర్

traffic

వాహనదారులకు నిద్రలేని రాత్రులు తీసుకువచ్చిన నూతన మోటారు వాహన చట్టం-2019 ని అమలు చేసేందుకు చాలా రాష్ట్రాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. చిన్న చిన్న ట్రాఫిక్ నేరాలకు కూడా అతి భారీ అపరాధ రుసుం వసూలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ చట్టం పలు విమర్శలకు తావిచ్చింది. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు తాము అంగీకరించేది లేదని ముందుగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. అదే బాటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నది. కొత్త చట్టాన్ని తెలంగాణ లో అమలు చేసేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న అసెంబ్లీలో ప్రకటించారు.

జార్ఖండ్ రాష్ట్రం ఈ చట్టం అమలు చేసేందుకు మూడు నెలలు వెసులుబాటు తెచ్చుకున్నది. అయితే బిజెపి పాలిత రాష్ట్ర మైన కర్నాటక ఈ చట్టాన్ని అమలు చేస్తున్నది. అదే బాటలో మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు కూడా ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయి. దేశంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చింది. ఇది వాహనదారుల్లో గుబులురేపుతోంది. వేలాది రూపాయల జరిమానాలు చెల్లించలేక వాహనదారులు లబోదిబోమంటున్నారు. అయితే చట్టం అమలుపై కేంద్రం మంకుపట్టు పట్టి కూర్చున్నది.

ఈ చట్టం అమలు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి చట్ట సవరణకు లేదా వెసులుబాటు కల్పించడానికి ససేమిరా అంటున్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరికైనా జరిమానా తప్పదని ఆయన అంటున్నారు. ప్రమాదాల నివారణ కోసమే మోటారు వాహనాల సవరణల చట్టం తీసుకొచ్చామని, ఇది తమ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమని కూడా ఆయన అంటున్నారు. నిజానికి ఈ బిల్లు 2016లోనే రూపొందించారు.

అయితే ప్రతిపక్షాలు అడ్డం తిరగడంతో ఈ బిల్లును  రాజ్యసభ ఆమోదించలేదు. ఇంతలో 16వ లోక్‌సభ ముగియడంతో బిల్లు ల్యాప్స్ అయింది. ఇప్పుడు బిజెపికి లోక్ సభలోనే కాకుండా రాజ్యసభలో కూడా మెజారిటీ (మిత్రులు ఇతర భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిపి) ఉన్నందున ఈ బిల్లు చట్ట రూపంలోకి వచ్చేసింది. ఈ చట్టం ప్రకారం లైసెన్స్ లేకుండా వాహనం డ్రైవ్ చేస్తే ప్రస్తుతం రూ.500 జరిమానా ఉంది. కొత్త నిబంధనల ప్రకారం రూ.5,000 చెల్లించాలి. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే ప్రస్తుతం రూ.1,000 ఉన్న జరిమానా రూ.5,000 కానుంది. డ్రంకెన్ డ్రైవ్‌కు రూ.10,000 జరిమానా చెల్లించాల్సి రావొచ్చు.

అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోయినా రూ.10,000 జరిమానా చెల్లించాలి. ఇలా జరిమానాలు భారీగా పెంచడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించే వారికి చట్టం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని నితిన్ గడ్కరి చెబుతున్నారు. కరెక్టే. చట్టం పాటించేందుకు సౌకర్యాలు కూడా కల్పించాలి కదా? ఉదాహరణకు అంబులెన్సుకు దారి ఇవ్వడం చూద్దాం. హైదరాబాద్ ట్రాఫిక్ లో అంబులెన్సుకు దారి ఇచ్చే వీలు ఉందా? అసలు ఆ సౌకర్యం ఉందా? ఆ వెసులుబాటు ఉందా?

మరి హైదరాబాద్ పోలీసులు అంబులెన్సుకు దారి ఇవ్వలేదు అనే నేరం మోపితే మనం ఏం చేయాలి? అలానే ఎక్కువ స్పీడ్ పోవడం అనేది కూడా చూద్దాం. చాలా నగరాలలో యావరేజ్ స్పీడ్ 25 కిలోమీటర్లు దాటడం లేదు. నగరాలలోని రద్దీ ప్రాంతాలలో వేగం గంటకు 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటున్నది. హైవేలు ఇతర రహదారుల విషయానికి వస్తే వాహనాలు స్పీడ్ గా వెళ్లేందుకే అధునాతన రహదారులు నిర్మించుకుంటున్నాం. చాలా దేశాలలో స్పీడింగ్ వెహికల్స్ కు ప్రత్యేక దారి ఉంటుంది. అలా మన జాతీయ రహదారులలో సౌకర్యం ఉన్నదా?

రోడ్డుపై అడ్డంగా ఒక గీత గీయడం మినహా జాతీయ రహదారులపై అడ్డంగా పశువులు రాకుండా లేదా మలుపులు ఉండకుండా జాతీయ రహదారులు నిర్మించారా? మలుపుల్లో రోడ్డు మలుపు తిరిగే వైపునకు వాలుగా ఉండాలి. ఎన్ని చోట్ల ఆ విధమైన శాస్త్రీయ రోడ్లు ఉన్నాయి? జాతీయ రహదారులకు అటు ఇటు బ్యారికేడ్లు ఉండాలి ఎన్ని చోట్ల బ్యారికేడ్లు పెట్టారు. రోడ్డు మెయింటేనెన్సు సక్రమంగా జరుగుతున్నదా? అడ్డంగా టోల్ గేట్ ఫీజు వసూలు చేయడం తప్ప నిర్వహణ చేయని కంపెనీలపై ఇప్పటికి ఎన్ని సార్లు చర్యలు తీసుకున్నారు?

ఇలా ఒక్కటి కాదు ఎన్నో విషయాలు రోడ్డు ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి. నితిన్ గడ్కరీ మంత్రి కాకముందు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆయన అయిన తర్వాత కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆయన మంత్రిగా దిగిపోయిన తర్వాత కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. వాటిని అరికట్టడం సాధ్యం కాదు. అన్ని సౌకర్యాలు కల్పిస్తే అప్పుడు ఈ కొత్త చట్టం తీసుకువస్తే అప్పుడు కూడా రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చే కానీ నివారించలేము.

Related posts

Analysis: జీవాయుధాలు తయారు చేస్తున్న చైనా

Satyam NEWS

రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించిన విదేశాంగ మంత్రి

Satyam NEWS

డిఎస్పీ శంకర్ కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

Satyam NEWS

Leave a Comment