ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన నిమ్మగడ్డ ప్రసాద్ (మ్యాట్రిక్స్ ప్రసాద్)ను సెర్బియా పోలీసులు అరెస్టు చేశారు. ఇది అటు రాజకీయ వర్గాలను ఇటు మీడియా యాజమాన్యాలను కూడా తీవ్రంగా కలవర పరుస్తున్నది. వాన్ పిక్ ఓడరేవు నకు సంబంధించిన వాటాల వ్యవహారంలో నిమ్మగడ్డ ప్రసాద్ పై రన్ అల్ ఖైమా కంపెనీ గతంలో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు పెండింగ్ లో ఉండగానే చాలా పరిణామాలు జరిగాయి. ఇటీవల రస్ అల్ ఖైమా కు కొత్త సిఇవో నియమితులయ్యారు. ఆయన పాత కేసును తిరగదోడటంతో ఇంటర్ పోల్ కు సమాచారం వెళ్లింది. ఇంటర్ పోల్ వద్ద కేసు పెండింగ్లో ఉన్న సమయంలో చేప గాలానికి చిక్కినట్లు నిమ్మగడ్డ ప్రసాద్ చిక్కారు.
విహార యాత్ర తెచ్చిన తంటా
ఇటీవల సెర్బియా దేశానికి నిమ్మగడ్డ విహారయాత్రకు వెళ్లారు. దీంతో నిమ్మగడ్డను పట్టుకోవడం సులభం అయిపోయింది. రస్ అల్ ఖైమాకు చెందిన ప్రతినిధుల ఫిర్యాదుతో బెల్ గ్రేడ్ లో నిమ్మగడ్డను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితమే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిమ్మగడ్డ ప్రసాద్ ను రేపటికల్లా దుబాయ్ జైలుకు తరలిస్తామని సెర్బియా అధికారులు చెబుతున్నారు. దుబాయ్ జైలుకు తరలిస్తే ఇక నిమ్మగడ్డ ఇక ఇండియా రావడం కష్టమే అవుతుంది. వాన్ పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ జైలు శిక్ష కూడా అనుభవించిన విషయం తెలిసిందే. నిమ్మగడ్డ ప్రసాద్ ని భారత్ కి రప్పించేందుకు వైసీపీ ఎంపీలు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కూడా వారు కోరుతున్నారు. సెర్బియాతో సంప్రదింపులు జరిపి.. నిమ్మగడ్డను సురక్షితంగా భారత్ కి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని విదేశాంగమంత్రి జైశంకర్ కు వైసీపీ ఎంపీలు లేఖ రాశారు. ఇప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి వివరాలు లేనందున భారత ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకునే అవకాశాలు కనిపించడం లేదు.