మంచిగా ఉన్న కుటుంబంపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. అంతే విచక్షణ మరచి భార్య కూతురిపై పెట్రోలు పోశాడు… తాను పోసుకున్నాడు… చక్కని కుటుంబం మంటల్లో ఆహుతైపోయింది. భర్త మరణించాడు. భార్య చావుబతుకుల్లో ఉంది. కూతురు కూడా మరణించింది.
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం అయ్యవారిపల్లి గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. భార్యపై అనుమానంతో కుటుంబ కలహాలు చెలరేగాయి. దాని పర్యవసానమే ఇది. అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన బడికల జయన్న వ్యవసాయం చేసుకుంటూ తన భార్య వరలక్ష్మి కూతురు గాయత్రి లతో కలిసి నివాసం ఉంటున్నాడు.
భార్య వరలక్ష్మి గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తుంది. కూతురు కొల్లాపూర్ పట్టణంలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతుంది. గత కొన్ని రోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్న జయన్న తరచూ గొడవలు పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో రాత్రి ఇంట్లో కూతురు, భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన జయన్న తాను కూడా నిప్పంటించుకున్నాడు.
తీవ్రంగా గాయపడిన ముగ్గురిని హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ తండ్రి బడికల జయన్న (40) కూతురు గాయత్రి (17)మృతి చెందారు. భార్య వరలక్ష్మి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుంది. ఘటపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.