35.2 C
Hyderabad
April 27, 2024 14: 48 PM
Slider ప్రపంచం

పాంజ్ షీర్: ప్రపంచ ప్రజల ఆశీస్సులన్నీ వారికే

#panjsheer

తాలిబన్ ముష్కరముఠాను ఎదిరించి నిలిచిన  ‘మసౌద్’ (అదృష్టవంతుడు) పేరు నిలబడేనా? అని ప్రపంచ దేశాలన్నీ పాంజ్ షీర్ కేసి కళ్ళప్పగించి చూస్తున్నాయి. అప్పుడు తండ్రి,ఇప్పుడు కొడుకు అదే పోరాటపటిమను చూపిస్తున్నారు. పాంజ్ షీర్ ( ఐదు సింహాలు) ప్రావిన్స్ దుర్భేధ్యమైంది.

అఫ్ఘాన్ దేశమంతా ఆక్రమించినా,ఆ ప్రాంతాన్ని అంటుకోవడం ఇప్పటి వరకూ ఎవ్వరికీ సాధ్యమవ్వలేదు. నాడు సోవియట్ యూనియన్, తాలిబాన్ సైతం ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు తాలిబాన్ మూక మళ్ళీ ప్రయత్నాలు చేపట్టింది. అదే స్ఫూర్తితో ముందుకు దూకాలని అహ్మద్ మసౌద్  భీషణ ప్రతినబూనారు.

తాలిబాన్ తో యుద్ధానికి సిద్ధం

పాంజ్ షేర్ సైన్యం కూడా తాలిబన్ తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అఫ్ఘాన్ మాజీ ఉపాధ్యక్షుడు, తాలిబన్ ను ప్రతిఘటిస్తున్న అమ్రుల్లా సాలే కూడా వీరికి జత కలుస్తున్నారు. దివంగత అహ్మద్ షా మసౌద్ కుమారుడు అహ్మద్ మసౌద్, సాలే, అఫ్ఘాన్ సైన్యం కలిసి సాగిస్తున్న ఈ పోరు ఫలించేనా?

ఇదే జరిగితే, అదే స్ఫూర్తితో మిగిలివున్న ప్రాంతాలను కూడా కాపాడుకోడానికి వీరు సిద్ధమయ్యే అవకాశం ఉంది. పాంజ్ షీర్ యుద్ధక్షేత్రంలో తాలిబన్ – మసౌద్,సాలే బృందం మధ్య సాగేపోరు అత్యంత ఆసక్తిగా మారింది. ఈ ప్రాంతం దేశ రాజధాని కాబూల్ కు 150 కిలోమీటర్ల దూరంలో హిందుకుష్ పర్వత శ్రేణుల్లో ఉంది. ఈ ప్రాంతం ఇంకా తమ అధీనంలోకి రాకపోవడం తాలిబన్ ముఠాకు చికాకు తెప్పిస్తోంది. భారీస్థాయిలో ఆయుధ సామాగ్రితో ఫైటర్లు వందల సంఖ్యలో వాహనాల్లో బయలుదేరినట్లు తెలుస్తోంది.

పోరాట యోధులు పాంజ్ షీర్ ప్రజలు

పాంజ్ షీర్ ప్రజలు పోరాటయోధులు,అక్కడి భౌగోళిక పరిస్థితులు శతృవులకు ప్రతికూలంగా ఉంటాయి.అక్కడికి నదీ మార్గంలోనే చేరుకోవాల్సి వస్తుంది.ఇప్పటికే మసౌద్ నాయకత్వంలోని పోరాటయోధులు అక్కడి సలాంగ్ రహదారిని మూసివేశారు. పాంజ్ షీర్ కు సమీపంలో ఉన్న మూడు జిల్లాలు కూడా వీరి ఆక్రమణలోనే ఉన్నాయి.

ఇక్కడ మాజీ సైనికులు, ప్రైవేట్ యోధులు,ప్రతిఘటన శక్తులు కలిసి సుమారు ఆరువేలమంది ఉన్నట్లు సమాచారం. గతంలో సోవియట్ యూనియన్ వదిలివెళ్లిన హెలీకాప్టర్లు,సైనిక వాహనాలు కూడా వారికి అందుబాటులో ఉన్నాయి. అఫ్ఘాన్ మాజీ అధ్యక్షుడు అమ్రుల్లా సాలేకు తోడుగా మాజీ రక్షణ మంత్రి బిస్మిల్లా మొహమ్మదీ మొదలైనవారు ఉన్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో తాలిబన్ కు తలోగ్గేది లేదని వీరందరూ చాలా పట్టుదలగా ఉన్నారు.

తాలిబాన్లకు కంట్లో నలుసులు….

అక్కడ 1,50,000 మంది ప్రజలు కూడా ఉన్నారు. వారంతా తజిక్ తెగవారు. వారికి తాలిబన్ తో అస్సలు పొసగదు. ఈ పోరాటంలో ప్రతిఘటన యోధులకు ప్రజలు కూడా ఏకమైతే? తాలిబన్ మూక ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం చాలా కష్టం. తండ్రి బాటలో నిలిచి తాలిబన్ ను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని,తమ బలగాలకు ఆయుధాలను అందజేయాల్సిందని అమెరికాను ఇటీవల మసౌద్ కోరారు.

అధ్యక్షుడు జో బైడెన్ స్పందించి, మసౌద్ బృందాలకు తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తే, పాంజ్ షీర్ లో తాలిబన్ మూక తోకముడవక తప్పదు. సైన్యం ఉపసంహరణకు ఆగష్టు 31 వరకే సమయం ఇస్తున్నామని, అది దాటితే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయని, అమెరికాను తాలిబన్ తాజాగా హెచ్చరించారు.

అమెరికా తోకముడుస్తుందా? సాయం చేస్తుందా?

వీటన్నింటి నేపథ్యంలో,అమెరికా ఎలా స్పందిస్తున్నది కీలకం. అఫ్ఘానిస్థాన్ విషయంలో ఇప్పటికే అమెరికా.. ప్రపంచ దేశాల ముందు చెడ్డపేరు మూటగట్టుకుంది. మసౌద్ అభ్యర్థనను తిరస్కరిస్తే, చెడ్డపేరు మరింత పెరుగుతుందని భావించాలి. ఉగ్రవాద ఉన్మాదంతో పెట్రేగిపోతున్న తాలిబన్ ను కట్టడి చేయడం,చేతనైతే సమూలంగా నిర్మూలన చేయడం ప్రపంచ శాంతికి అత్యంత అవసరమని రాజనీతిజ్ఞులు దేశాధినేతలకు సూచిస్తున్నారు.

తాలిబాన్ ముష్కరుల కట్టడికి పాంజ్ షేర్ నుంచే శ్రీకారం చుట్టాలి. అహ్మద్ మసౌద్ తండ్రి తాలిబన్ ను ఎదిరించి,కట్టడి చేసిన తీరు చారిత్రాత్మకం. అఫ్ఘాన్ అధ్యక్షుడు ఘనీ దేశం వీడి పారిపోయినా, ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలే ప్రజలవైపు ధైర్యంగా నిలుచున్న వైనం అభినందనీయం.ఘనీ స్థానంలో తానే అధ్యక్షుడనని ఇప్పటికే సాలే ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ పోరులో ఎవరు గెలుస్తారో వేచిచూడాల్సిందే.

మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

రక్తదానం చేసి ఒక తల్లిని కాపాడిన జర్నలిస్టు

Satyam NEWS

రక్షణ మంత్రి రాజ్ నాథ్ తో రాష్ట్ర మంత్రి కేటీఆర్ భేటీ

Satyam NEWS

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఆకస్మిక తనిఖీ

Satyam NEWS

Leave a Comment