ఈ నెల 8 వ తారీఖున దేశవ్యాప్త సమ్మెలో ఒప్పంద, తాత్కాలిక, పొరుగు సేవల ఉద్యోగస్థులు అందరూ పాల్గొనాలని శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గంగు వెంకటరమణ, గుండబాల మోహన్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలస గ్రామంలో వారు మీడియాతో మాట్లాడారు.
పనిచేసే మండల, జిల్లా కేంద్రంలో జరిగే ర్యాలీలు తదితర కార్యక్రమాలలో ఇతర ఉద్యోగులు ,కార్మికులతో కలిసి సమ్మెలో పాల్గొనాలని వారు కోరారు. తెల్ల రేషన్ కార్డులు కొనసాగించాలని, అమ్మఒడి తదితర పథకాలు తమకు అమలు చేయాలని, పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
అదే విధంగా సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న మొత్తం ఒప్పంద, తాత్కాలిక, పొరుగు సేవల ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, కరువు భత్యం, ఇతర అలవెన్సులు ఇవ్వాలని వారు కోరారు. తమకు ప్రావిడెంట్ ఫండ్, ఇ.ఎస్.ఐ అమలు చేయాలని, సమగ్ర శిక్ష కేజీబీవీ లో పనిచేస్తున్న మహిళా అధ్యాపకులకు ప్రసూతి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని వారు కోరారు.
కేజీబీవీ పాఠశాలలో, కళాశాలలో హాస్టల్ వార్డెన్స్ ను గౌరవ ప్రత్యేక అధ్యాపకులను ప్రత్యేకంగా నియమించాలని, సమగ్ర శిక్ష లో గత ఎనిమిది సంవత్సరాలుగా పని చేస్తున్న ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయుల ను తక్షణమే రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్లే కార్డులను తయారు చేసుకొని ప్రదర్శించాలని వారు సాటి ఉద్యోగులను కోరారు. ఇప్పటికే మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులకు, కలెక్టరుకు ముందుగా నోటీసులు ఇచ్చామని, ఇతర అధికారులకు సమాచారం నిమిత్తం వాటి కాపీలు అవసరమైతే ఇవ్వవచ్చునని గంగు వెంకటరమణ, గుండబాల మోహన్ అన్నారు.