పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం జే.ఏ.సీ.ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో శాంతి ర్యాలీ, మానవహారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం జేఏసీ నాయకులు యస్ కె. జిలనిమాలిక్, అబ్దుల్ రజాఖ్, బి. సలీమ్, షేక్.బాబు, గఫర్ బేగ్, ఖాదర్, మస్తాన్ వలి, జి కె. మునాఫ్, అద్రుఫ్, రఫీ మౌలా, రఫీ బాసిత్, రియాజ్, మౌలాలి, సుబాని, కరీం, బాషా, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పౌరసత్వానికి విఘాతం కలిగిస్తున్న చట్టాలను వెంటనే రద్దు చేయాలని, ఎన్.ఆర్.సి, ఎన్.పి.ఆర్ లను రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షం వ్యతిరేకించాలని కోరారు. విభజించు – పాలించు అన్న కుటిల నీతితో భారత దేశాన్ని ఏలిన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్రం సంపాదించుకున్నాం. పౌరులంతా సమనులేనని రాజ్యాంగ రాసుకున్నాం.
ఇప్పడు దాన్ని ధ్వంసం చేసి భారత దేశాన్ని బలహీనపర్చేందుకు మోడీ, అమిత్ షా, ద్వయం నడుంకట్టుకున్నారని అన్నారు. ఈ ర్యాలీ లో ఎంఐఎం, సీపీఐ, సీపీఎం, జనసేన, టిడిపి, వైసీపీ, యస్.సి, యస్.టి, బి. సి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు వందలాది మంది పాల్గొన్నారు. దారి పొడవునా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు.
ఈ ర్యాలీ ముందుగా ఈద్గా గ్రౌండ్ షాదీ ఖానా నుండి ప్రకాష్ నగర్ మీదుగా బస్టాండ్ వద్ద ఉన్న ఓవర్ బ్రిడ్జి మీదుగా మల్లమ్మ సెంటర్ లలో మానవహారం నిర్వహించి అనంతరం గాంధీ చౌక్ మీదుగా గడియారం స్తంభం సెంటర్, మునిసిపల్ కార్యాలయం,ఆర్డీఓ కార్యాలయం మీదుగా ఏంజల్ టాకీస్ సెంటర్ ఓవర్ బ్రిడ్జ్ లోని షాది ఖాన ఈద్గా వరకు ర్యాలీ జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వన్ టౌన్ ఎస్ ఐ ఏ వి బ్రహ్మం పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.