నల్లమల్ల అడవుల్లో ఇటీవల సంచలనం సృష్టించిన మహిళ అత్యాచారం హత్య కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమల అడవిలో మూడు రోజుల క్రితం ముంబయి కి చెందిన మహిళ పై అత్యాచారం హత్య జరిగిన విషయం సత్యం న్యూస్ పాఠకులకు తెలుసు.
సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా మూడు రోజుల వ్యవధిలోనే పోలీసులు నిందితుడి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తమిళనాడుకు చెందిన రామకృష్ణా అనే సాధువు మహారాష్ట్ర లోని థాణేకు చెందిన మహిళ శ్రీశైలంలో కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆమెతో మాట కలిపిన రామకృష్ణను.. మహిళ నల్లమలలో చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయని అడిగింది.
దీంతో తనకు చాలా తెలిసిన ప్రదేశాలు ఉన్నాయని, తనతో వస్తే చూపిస్తానని చెప్పి ఆమెను నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన అక్కమాదేవి గుహలు మార్గంలోకి తీసుకెళ్లాడు. దట్టమైన నల్లమలలోకి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లాక రామకృష్ణ ఆమెపై అత్యాచారం చేసి దారుణంగా హత్యచేశాడు.
క్షుద్రపూజల నేపధ్యంలో నల్లమలలో ఈ హత్య జరిగిందని ప్రచారం జరగడంతో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతంగా కొనసాగించారు. శ్రీశైలంలో సీసీ పుటేజ్ పరిశీలించగా సాధువు రామకృష్ణ, హత్యకు గురైన మహిళ కలిసి వెళ్తున్న దృశ్యాలు రికార్డు కావడంతో పోలీసులు రామకృష్ణ ను అదుపులోకి తీసుకొని విచారించారు. తమిళనాడుకు చెందిన రామకృష్ణ అలియాస్ మట్కా స్వామి అక్కమాదేవి ఆలయానికి కాలినడకన వెళ్లే దారిలో పథకం ప్రకారం హత్యచేసినట్టు నేరాన్ని అంగీకరించాడు. దీంతో రామకృష్ణపై కేసు నమోదు చేసిన పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించినట్టు డీఎస్పీ నర్సింహులు తెలిపారు.