కొత్త సంవత్సరం సందడి అప్పుడే స్టార్ట్ అయినట్లు కనిపిస్తున్నది. హైదరాబాద్ లోని పంజాగుట్ట ప్రాంతంలో ఉన్న ప్రముఖ లిస్బాన్ పబ్ లో పెద్ద ఎత్తున వ్యభిచారం దందా నడుస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో వారు నేడు అర్ధ రాత్రి లిస్బాన్ పబ్ పై దాడి చేశారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 21 మంది అమ్మాయిలు ఈ పబ్ లో దొరికారు. 9 మంది విటులను, ఇద్దరు నిర్వాహకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. లక్షా 30 వేల రూపాయల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరం నడిబొడ్డున ఇంత పెద్ద ఎత్తున హైటెక్ వ్యభిచారం జరగడం ఇటీవలి కాలంలో ఇదే ప్రధమం. పశ్చిమ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకునే వారకూ లోకల్ పోలీసులు ఏం చేస్తున్నారనేది ఇక్కడ ప్రశ్న.
లోకల్ పోలీసులకు సమాచారం లేకుండా ఉందా లేక వారు కావాలనే దాడి చేయకుండా ఊరుకున్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఈ పబ్ నగరం నడి బొడ్డున ఉన్నా కూడా ఇందులో అనేక రకాల సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయి. గతంలో వ్యభిచారం చేయనన్నందుకు ఒక డ్యాన్సర్ పై అక్కడి బౌన్సర్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
అక్కడికి వెళ్లే కస్టమర్లపై కూడా బౌన్సర్లు తరచూ దాడులు చేస్తుంటారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరువలోనే సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నా పోలీసులు చూసీ చూడనట్లు ఊరుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.