26.7 C
Hyderabad
April 27, 2024 07: 50 AM
Slider జాతీయం

రిపబ్లిక్ మెసేజ్: ప్రతికూలతల మధ్య కూడా విజయ శిఖరాలు

ramnath kovind

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతిని ఉద్దేశించి సందేశం ఇచ్చారు. ఆయన ఇచ్చిన సందేశం పూర్తి పాఠం సత్యం న్యూస్ పాఠకుల కోసం ఈ కింద ఇస్తున్నాం.

ప్రియమైన భారత పౌరులారా

71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోను, విదేశాల్లోను నివశిస్తున్న మీ అందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ చేస్తున్నాను.

ఏడు దశాబ్దాల క్రితం జనవరి 26 తేదీన మన రాజ్యాంగం అమలు లోకి వచ్చింది. అంతకు ముందు కూడా ఈ తేదీ ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. “పూర్ణ స్వరాజ్” సాధించడం లక్ష్యంగా 1930 నుంచి 1947 వరకు ప్రతీ ఏటా మన దేశ ప్రజలు జనవరి 26వ తేదీన పూర్ణ స్వరాజ్ దినోత్సవం పాటిస్తున్నారు. అందుకే రాజ్యాంగ నిబంధనల పట్ల కట్టుబాటును పునరుద్ఘాటిస్తూ 1950 జనవరి 26వ తేదీన మన దేశం గణతంత్ర దేశంగా ప్రయాణం ప్రారంభించింది.  అప్పటి నుంచి ప్రతీ ఏడాది జనవరి 26వ తేదీన మనం గణతంత్ర దినోత్సవం నిర్వహించు కుంటున్నాం.

ఆధునిక భారతదేశంలో – చట్ట వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పేరిట మూడు ప్రధాన వ్యవస్థలున్నాయి. ఈ మూడింటి మధ్య అనుసంధానత, ఆధారనీయత అత్యవసరం. కాని క్షేత్ర స్థాయిలోమాత్రం ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ రకంగా గణతంత్రాన్ని ముందుకు నడిపే చోదక శక్తులుగా మేమున్నాం. అందరి ఉమ్మడి భవిష్యత్తును నిర్ణయించే వాస్తవ అధికారం ప్రజలు మాకు అప్పగించారు.

స్వేచ్ఛా పూరిత జాతి పౌరులుగా రాజ్యాంగం మనకి హక్కుల్ని ప్రసాదించింది. అదే సమయంలో ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు కట్టుబడాల్సిన బాధ్యతను కూడా మనపై వుంచింది. జాతిపిత జీవితం, విలువలను దృష్టిలో ఉంచుకున్నట్లయితే రాజ్యాంగ విలువలను అనుసరించడం మరింత తేలిక అవుతుంది. అలా చేయడం ద్వారా గాంధీజీ 150వ జయంతి వేడుకలకు మనం అర్ధవంతమైన కోణాన్ని ఆవిష్కరించ గలుగుతాం.

ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించింది. వాటిని ప్రజలే స్వచ్ఛందంగా ప్రజా ఉద్యమాలుగా మార్చడం ప్రత్యేకంగా గుర్తించదగిన అంశం. “స్వచ్ఛ భారత్ అభియాన్” స్వల్ప కాలం లోనే అద్భుతమైన విజయం సాధించింది. ఇతర కార్యక్రమాల్లో కూడా అదే స్ఫూర్తి కనిపించింది. ఇంధన సబ్సిడీలు వదులు కోవడం కావచ్చు, డిజిటల్ చెల్లింపులు పెంచడం కావచ్చు ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని సాధారణ మానవుడు తన సొంతం చేసుకుని వాటిని వాస్తవంగా సమర్ధవంతం చేశారు. “ప్రధానమంత్రి ఉజ్వల యోజన” సాధించిన విజయం గర్వ కారణం. 8 కోట్ల మంది లబ్ధిదారులకు చేరాలన్న లక్ష్యం సాధించడం పూర్తయింది. ఈ కార్యక్రమంతో అవసరమున్న అందరికీ స్వచ్ఛమైన ఇంధనం అందుబాటు లోకి వచ్చింది. “ప్రధాన మంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన” లేదా “సౌభాగ్య” కూడా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపింది. “ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి” కింద 14 కోట్ల మంది రైతు కుటుంబాలు ఏడాదికి ఆరు వేల రూపాయల కనీస వార్షికాదాయం పొందగలుగుతున్నాయి. మనకి ఆహారం అందించే రైతన్నలు హుందాగా, గౌరవంగా జీవితం గడిపేందుకు ఇది వీలు కల్పించింది.

నీటి సంక్షోభాన్ని సమర్థవంతంగా పరిష్కరించేందుకు జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటయింది. నీటి సంరక్షణ, జల వనరుల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది.  “స్వచ్ఛ భారత్ అభియాన్” వలెనే “జల్ జీవన్ మిషన్” కూడా ప్రజా ఉద్యంగా రూపు దిద్దుకుంటుందన్న నమ్మకం నాకుంది.

అత్యవసరంలో ఉన్న వారి సంక్షేమంతో పాటు ప్రభుత్వం చేపట్టిన ప్రతీ ఒక్క విధానానికి “జాతి ప్రథమం” సిద్ధాంతమే మార్గదర్శక సూత్రం. జిఎస్‌టి ని ప్రవేశ పెట్టడం ద్వారా “ఒక దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్” అనే విజన్ కు వాస్తవ రూపం వచ్చింది. దానికి ఇ-నామ్ పథకం మరింత బలం చేకూరుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా “ఒక జాతికి ఒకే మార్కెట్” అనేది వాస్తవ రూపం దాల్చింది. జమ్ము-కాశ్మీర్ కావచ్చు, లదాఖ్ కావచ్చు, ఈశాన్య ప్రాంతం లేదా హిందూ మహా సముద్రం లోని మన దీవులు.. ఏవైనా కావచ్చు.. దేశం లోని అన్ని భాగాలు సర్వ సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది.

దేశ అభివృద్ధికి బలమైన అంతర్గత భద్రత అత్యంత ప్రధానం. అందుకే ప్రభుత్వం అంతర్గత భద్రతా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు పలు నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది.

అందరికీ ఆరోగ్యం, విద్యా వసతులు అందుబాటులో ఉంచడం సత్పరిపాలను పునాదిగా తరచు పరిగణిస్తారు. గత ఏడు దశాబ్దాల కాలంలో ఈ రెండు రంగాల్లోనూ మనం ఎంతో పురోగమించాం. ఎంతో ఆశావహమైన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం ఆరోగ్య రంగంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన నుంచి ప్రారంభించి ప్రపంచం లోనే అతి పెద్దదైన, ప్రభుత్వ నిధులతో నడిచే సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ వరకు వివిధ కార్యక్రమాల ద్వారా పేద ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వం తన ప్రత్యేక శ్రద్ధను ప్రదర్శించింది. ఆరోగ్య సంరక్షణలో నాణ్యతను మెరుగు పరచడంతో పాటు పరిధిని కూడా విస్తరించింది. అందుబాటు ధరల్లోనే నాణ్యమైన జనరిక్ ఔషధాలను అందించడం కోసం జన్ ఔషధి యోజనను ప్రారంభించి సగటు జీవి ఆరోగ్య సంరక్షణ బడ్జెట్ ను గణనీయంగా తగ్గించింది.

నలంద, తక్షశిల వంటి తలమానికమైన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రాచీన కాలం లోనే విద్యా వ్యవస్థకు చక్కని పునాదులు వేశారు. భారతదేశంలో అధికారం, పలుకుబడి, సంపద కన్నా మేథస్సునే అత్యంత విలువైనదిగా పరిగణిస్తారు. మన సంప్రదాయంలో విద్యా సంస్థలను బోధనా దేవాలయాలుగా గౌరవించడం పరిపాటి. సుదీర్ఘ కాలం పాటు వలస పాలనలో మగ్గిపోయి వెనుకబడి పోయిన భారత భూమికి సాధికారత తెచ్చింది విద్యా రంగమే. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించగానే విద్యా సంస్థల అభివృద్ధి చేపట్టినప్పటికీ వనరుల కొరత కొంత అవరోధం అయినప్పటికీ విద్యా రంగంలో మనం సాధించిన విజయాలు అద్భుతమైన పథం లోనే ఉన్నాయి. బాల బాలికలు, యువతలో ఏ ఒక్కరికీ విద్య నిరాకరించ కూడదన్నదే మా అభిమతం. అదే సమయంలో విద్యా వ్యవస్థలో నిరంతర సంస్కరణల సహాయంతో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలు సాధించడానికి కూడా శ్రమిస్తున్నాం.

ఇస్రో సాధించిన విజయాలు భారత దేశానికి గర్వకారణం. గగన్ యాన్ దిశగా అవి మరింతగా పురోగమిస్తున్నాయి. మానవ అంతరిక్ష నౌక కార్యక్రమం పట్ల జాతి యావత్తు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆ కార్యక్రమాలకు ఈ ఏడాది మరింత వేగం వస్తుంది.

ఇది టోక్యో ఒలింపిక్స్ జరిగే సంవత్సరం. భారతదేశం సాంప్రదాయికంగా పలు క్రీడల్లో మంచి ప్రతిభ కనబరుస్తోంది. కొత్త తరానికి చెందిన క్రీడాకారులు, అథ్లెట్లు ఇటీవల సంవత్సరాల్లో పలు క్రీడల్లో దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకు వచ్చారు. 2020 ఒలింపిక్ క్రీడాకారుల బృందానికి కూడా కోట్లాది మంది ప్రజల అభినందనలు, ప్రోత్సాహం అండగా నిలుస్తాయి.

విదేశాల్లో నివశిస్తున్న భారతీయ సంతతి కూడా మనకి ఎంతో గర్వకారణం. నేను విదేశీ పర్యటనలకి వెళ్లినప్పుడల్లా అక్కడ నివశిస్తున్న భారతీయులు సంపదను తేవడమే కాదు, వారు వివిధ ప్రాంతాలను దత్తత తీసుకోవడం గమనించాను. వారు భారత దేశం ప్రతిష్ఠను ఎంతగానో పెంచారు. భిన్నత్వంతో కూడిన పలు కార్యక్రమాల ద్వారా వారిలో ఎక్కువ మంది ఎంతో విలువైన సేవలందించారు.

మన సాయుధ దళాలు, పారామిలిటరీ, అంతర్గత భద్రతా దళాలకు నేను ప్రత్యేక ప్రశంసలు అందచేస్తున్నాను. దేశ ఐక్యత, సమగ్రత కాపాడేందుకు వారు అసాధారణ సాహసం, క్రమశిక్షణ ప్రదర్శించారు. మన రైతులు, డాక్టర్లు, నర్సులు, విద్యా బోధన రంగం లోని ఉపాధ్యాయులు, వారందించే విలువలు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు; నిరంతరం అప్రమత్తంగా, చురుగ్గా ఉండే యువత;  శ్రమ కోర్చి పని చేసే కార్మిక శక్తి, ఆర్థిక సుసంపన్నతకు దోహదపడే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, మన సంస్కృతిని సుసంపన్నం చేస్తున్న కళాకారులు, అంతర్జాతీయంగా ప్రశంసలందుకుంటున్న మన సేవారంగ వృత్తి నిపుణులు, పలు కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న దేశ పౌరులు ప్రత్యేకించి ఎన్నో ప్రతికూలతల మధ్యన కూడా విజయ శిఖరాలు అందుకున్న మన కుమార్తెలు అందరూ జాతికి గర్వం తీసుకు వచ్చారు.

భిన్న రంగాల్లో ప్రశంసనీయమైన కృషి చేసిన పలువురిని కలిసే అవకాశం ఈ ఏడాది ప్రారంభంలో నాకు వచ్చింది. సైన్స్ – ఇన్నోవేషన్, క్రీడలు, దివ్యాంగుల సాధికారత, వ్యవసాయం – అడవుల పెంపకం, మహిళా – బాలల సాధికారత, విద్య, ఆరోగ్య సంరక్షణ, ప్రాచీన కళారీతుల పునరుద్ధరణ, అవసరంలో ఉన్న వారికి ఆహారం – పౌష్టికాహారం అందించడం వంటి భిన్న రంగాల్లో వారు నిశ్శబ్దంగా ఎంతో అద్భుతమైన సేవలందించారు. ఉదాహరణకి సుశ్రీ ఆరిఫా జాన్ జమ్ము కశ్మీర్ కు చెందిన నుంధా హస్త కళలు పునరుద్ధరించారు. సుశ్రీ రత్నావళి కొత్తపల్లి తెలంగాణలో తలసేమియాతో బాధ పడుతున్న రోగులకు సేవలందిస్తున్నారు. దేవకి అమ్మ తన వ్యక్తిగత ఆలోచనల ద్వారా కేరళలో అటవీ సంపదను పెంచారు. జంకోజంగ్ మిసావో మణిపూర్ లో సామాజిక అభివృద్ధి కార్యకలాపాల ద్వారా పలువురి జీవితాలను మెరుగు పరిచారు. బాబా అలీ పశ్చిమ బెంగాల్ లో తన బాల్యం నుంచి సమాజంలో నిరాదరణకు గురవుతున్న వర్గాల బాల బాలికలకు విద్యా బోధన చేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో ఉదాహరణలున్నాయి, నేను కొన్నింటిని మాత్రమే ప్రస్తావించాను. సాధారణ ప్రజలు కూడా అసాధారణమైన సేవలందించగలరని వారు నిరూపించారు. అలాగే జాతి నిర్మాణంలో కృషి చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలకు బలం చేకూరుస్తున్న స్వచ్ఛంద సంస్థలు పెద్ద సంఖ్య లోనే ఉన్నాయి.

ప్రస్తుతం మనం 21వ శతాబ్ది మూడో దశకంలో ఉన్నాం. సరికొత్త భారతం, భారతీయుల్లో కొత్త తరం పైకి వస్తున్న దశాబ్దం ఇది. జాతి సాగిస్తున్న ఈ ప్రయాణంలో ఈ శతాబ్దిలో జన్మించిన ఎందరో భాగస్వాముల వుతున్నారు. కాలం గడుస్తున్న కొద్ది మనం స్వాతంత్ర పోరాటానికి చెందిన సజీవ సంధానతను కోల్పోతున్నాం. అయినా స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుకు నడిపిన మార్గదర్శకాలు కొనసాగుతాయా అన్న చింత అవసరం లేదు. సాంకేతిక పరిజ్ఞానం సాధించిన పురోగతితో యువ మస్తిష్కాలు నేడు చక్కని సమాచారం, ఎంతో విశ్వాసం కలిగి ఉన్నాయి. మన జాతికి చెందిన మూల విలువలకు తదుపరి తరం బలంగా కట్టుబడి ఉంటారు. మన యువత దృష్టిలో ఎప్పటికీ జాతిదే ప్రథమ స్థానం. వారి సహాయం తోనే సరికొత్త భారతాన్ని మనం చూడ గలుగుతాం.

జాతి నిర్మాణ చర్యల్లో మనకి మహాత్మా గాంధీ ఆదర్శాలు ఎప్పటికీ మార్గ దర్శకంగా ఉంటాయి. గాంధీజీ అందించిన సత్యం, అహింస సందేశాలు మన నిత్య జీవితంలో ఆత్మావలోకనంలో ఒక భాగంగా ఉంటాయి. నేటి కాలానికి అవి మరింత ప్రధానం.

ఏదైనా ఒకటి సాధించేందుకు పోరాడే సమయంలో ప్రజలు, ప్రత్యేకించి యువత, గాంధీజీ మానవాళికి అందించిన అహింస సిద్ధాంతాన్ని విస్మరించ కూడదు. ఏదైనా ఒక చర్య సరైనదా, కాదా అనేది తెలుసుకునే విషయంలో అనుసరించే గాంధీజీ సిద్ధాంతం మన ప్రజాస్వామ్యం పనితీరుకు కూడా వర్తిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఉభయ వర్గాలు తమ రాజకీయ సిద్ధాంతాలను ఆచరించే సమయంలో దేశాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని పరిగణన లోకి తీసుకుని ముందుకు సాగాలి.

మన రాజ్యాంగాన్ని గుర్తు చేసుకునే గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగ ప్రముఖ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలను ఉటంకించాలను కుంటున్నాను. “ప్రజాస్వామ్యాన్ని కేవలం ఒక రూపం లోనే కాకుండా వాస్తవికతలో కూడా నిలిచేలా చేయాలంటే మనం ఏం చేయాలి? రాజ్యాంగ విధానాలకు కట్టుబడి మాత్రమే సామాజిక, ఆర్థిక లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్నదే నా మొదటి తీర్పు”. ఈ మాటలే మన మార్గానికి ఎప్పుడూ వెలుగులు నింపుతాయి. సరికొత్త శిఖరాలకు చేరడానికి ఈ మాటలే మార్గదర్శకంగా ఉంటాయి.

ప్రపంచం అంతటినీ ఒక పెద్ద కుటుంబంగా అభివర్ణించే మన “వసుధైవ కుటుంబకం సిద్ధాంతం” ఇతర దేశాలతో మన బంధానికి బలంగా నిలుస్తుంది. ప్రజాస్వామిక విలువలను, అభివృద్ధి ఫలాలను మనం యావత్ ప్రపంచంతో పంచుకుంటాం.

ఇతర దేశాధినేతలను గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అతిథులుగా ఆహ్వానించే సంప్రదాయం మనం అనుసరిస్తున్నాం. ఈ ఏడాది రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో మనకి అభిమాన పాత్రుడైన మిత్రుడు, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో పాల్గొంటున్నారు.

మనకే కాకుండా యావత్ మానవాళికి సురక్షితమైన, సుసంపన్నమైన భవిష్యత్తు అందించే ప్రయత్నంలో ప్రపంచం అంతటితో కలిసి ముందుకు సాగడానికి పురోగమన పథంలో ఉన్న భారతదేశంగా, భారతీయులుగా మనం కట్టుబడి ఉన్నాం.

మరో సారి నేను మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

జైహింద్

Related posts

యాదగిరి గుట్టలో విషాదం: భవనం నేల కూలి నలుగురి మృతి

Satyam NEWS

రాజధానిని మార్చే అధికారం జగన్ కు లేదు

Bhavani

రాపిడ్ డెకాయిటీ: తమిళనాడు లోనూ కొట్టేశారు

Satyam NEWS

Leave a Comment