29.2 C
Hyderabad
November 8, 2024 14: 22 PM
Slider ప్రత్యేకం

ఫొటో ఫినిష్: కౌన్సిల్ రద్దు విధానం ఇది

parliament-of-india

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

రాజకీయ అవసరాల కోసం కౌన్సిల్ ఏర్పాటు చేయడం, రద్దు చేయడం పరిపాటిగా మారిన ఈ సమయంలో కౌన్సిల్ రద్దు ప్రక్రియ ఎలా ఉంటుంది అనే సందేహం చాలా మందిలో ఉంది. కొందరు ఏడాది నుంచి రెండేళ్ల సమయం పడుతుందని చెబుతుండగా మరి కొందరు అంత సమయం పట్టదని త్వరగానే పూర్తి అవుతుందని అంటున్నారు. ఈ రెండు విషయాలలో వాస్తవమేమిటి? అనేది సత్యం న్యూస్ ప్రత్యేక విశ్లేషణగా మీకు అందిస్తున్నది.

కౌన్సిల్ ఉండాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆధారపడిన అంశం. రాష్ట్ర మంత్రి వర్గం తీర్మానం చేసి అసెంబ్లీకి పంపితే అక్కడ ఇందుకు సంబంధించిన తీర్మానం నెగ్గితే కౌన్సిల్ రద్దుకు శ్రీకారం చుట్టినట్లే అవుతుంది. అసెంబ్లీ తీర్మానాన్ని అసెంబ్లీ సెక్రటేరియేట్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాన్ని పరిశీలించి కేంద్ర హోం శాఖ కు నివేదిస్తారు.

కేంద్ర హోం శాఖ ఈ ఫైల్ ను పరిశీలించి ఏవైనా అనుమానాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణ తీసుకుని కేంద్ర హోం శాఖ మంత్రికి పంపుతారు. కేంద్ర హోం మంత్రి పరిశీలన అనంతరం ఈ ఫైలు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి చేరుతుంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఈ అంశాన్ని పరిశీలించిన తర్వాత కేంద్ర మంత్రి వర్గంలో టేబుల్ ఎజెండాగా చేరుస్తారు.

ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు కాబట్టి దీన్ని రెగ్యులర్ ఎజెండాలో ఉంచాల్సిన అవసరం లేదు. టేబుల్ ఎజెండాగా ఉంచిన ఈ అంశాన్ని కేంద్ర మంత్రి వర్గం సూత్రప్రాయంగా ఆమోదించి లోక్ సభ, రాజ్య సభ కార్యాలయాలకు పంపుతుంది. ఆ రెండు కార్యాలయాలు తదుపరి చర్యలు చేపడతాయి. లోక్ సభ స్పీకర్ అనుమతితో లోక్ సభలో తీర్మానంగా ప్రవేశపెడతారు. రాజ్య సభలో రాజ్య సభ చైర్మన్ అయిన ఉప రాష్ట్రపతి అనుమతితో తీర్మానంగా ప్రవేశ పెడతారు.

ఈ రెండు సభల ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి భవన్ కు చేరుతుంది. రాష్ట్ర పతి ఆమోదం తర్వాత చట్టంగా మారుతుంది. ఇదీ కౌన్సిల్ రద్దు కావడానికి జరిగే ప్రక్రియ. ఇక మరో ముఖ్య విషయం దీనికి మొత్తం సమయం ఎంత పడుతుంది అనేది. కేంద్ర హోం మంత్రికి చేరిన తర్వాత ఫైలు నిలిచి పోవచ్చు. తదుపరి చర్యలకు సమయం పట్టవచ్చు. లేదా ఫైలు చేరిన మరు క్షణంలోనే కేంద్ర హోం శాఖ మంత్రి సంతకం చేసి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి పంపవచ్చు.

అక్కడ నుంచి లోక్ సభ, రాజ్య సభల్లో తక్షణమే ఎజెండాలో చేర్చి మూజువాణి ఓటుతో ఆమోదించవచ్చు. ప్రస్తుతం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నందున ఈ బిల్లు తక్షణమే ఆమోదం పొందే అవకాశం కూడా ఉంటుంది. లేదా బడ్జెట్ సమావేశాలు కాబట్టి తర్వాతి సమావేశాలలో దీన్ని తీసుకుందామని వాయిదా కూడా వేయవచ్చు. రాజ్యసభ లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. రెండు సభలలో ఆమోదించడం ఒక్క నిమిషం పని.

లేదా చాలా కాలం పాటు బిల్లు వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉండవచ్చు. ఉభయ సభలు బిల్లును ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి కి చేరితే అక్కడ రాష్ట్రపతి తదుపరి వివరాలను కోరవచ్చు లేదా యధా తధంగా సంతకం చేసేయవచ్చు. రాష్ట్రపతి వివరాలు కోరితే మరి కొంత సమయం పట్టవచ్చు. ఆ తర్వాత చట్టం అయితే అప్పటికి కౌన్సిల్ రద్దు అవుతుంది. ఏ దశలో నైనా బిల్లు ఆగిపోవచ్చు లేదా ఆగమేఘాలపై సాగిపోనూ వచ్చు.

ప్రస్తుతం లోక్ సభలో అధికార బిజెపికి ఏ పార్టీతో సంబంధం లేదు కానీ రాజ్య సభలో ప్రతిపక్షంతో పని ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఏపిలో అధికారంలో ఉన్న వైసిపితో అనవసర వైరం పెట్టుకోకపోవచ్చు. ఎన్ ఆర్ సి, సిఏఏ లపై ఏపి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నందున వాటికి అనుమతి ఇస్తే ఈ బిల్లును ఆపకుండా పంపుతామని కేంద్రం చెప్పవచ్చు. కౌన్సిల్ రద్దుకు ఏపి బిజెపి వ్యతిరేకంగా ఉన్నందున ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయవచ్చు.

తెలుగుదేశం పార్టీ నుంచి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యులు కౌన్సిల్ రద్దు కు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వారు కేంద్ర ప్రభుత్వం జాప్యం చేసే విధంగా పావులు కదపవచ్చు. కేంద్ర ప్రభుత్వం సిఏఏ సంబంధిత అంశాలపై పీకల లోతున కూరుకుపోయి ఉంది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ రద్దు ప్రాధాన్యతాంశం కాదని భావిస్తే బిల్లు ఆగిపోతుంది.

 బడ్జెట్ సమావేశాలు పూర్తి అయిన తర్వాత చూద్దామని అనుకుంటే మరింత జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. బడ్జెట్ ఆమోదింప చేసుకోవడం ప్రధాన అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇది ప్రాధాన్యతాంశం కాదు. కేంద్రంలోని బిజెపి పెట్టే షరతులు, దానిపై వైసిపి స్పందన పై కౌన్సిల్ రద్దు బిల్లు ఆధారపడి ఉంటుంది. అందువల్ల బిల్లు ఒక్క నెల రోజుల్లోనే చట్టంగా మారవచ్చు లేదా నాలుగైదేళ్లు పట్టవచ్చు.

వై ఎస్ ప్రకాశ్ (విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్టు)

Related posts

ఎస్వీ ఓరియంట‌ల్ డిగ్రీ క‌ళాశాల‌లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

Bhavani

క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ సదస్సు: ఆరు జిల్లాల సిబ్బంది హాజరు

Satyam NEWS

వ్యాక్సిన్ అపోహలపై పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్

Satyam NEWS

Leave a Comment