28.7 C
Hyderabad
April 20, 2024 03: 14 AM
Slider తెలంగాణ సంపాదకీయం

సిబ్బందికి మేలు చేయనిది ఈ ఆర్టీసీ సమ్మె

tsrtc bus

తెలంగాణ ఆర్ టి సి తలపెట్టిన నిరవధిక సమ్మెపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. పండుగల సీజన్ లో సమ్మె తలపెట్టడం బ్లాక్ మెయిలింగ్ కిందికే వస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం కూడా దాదాపుగా ఇదే వైఖరితో ఉన్నట్లు కనిపిస్తున్నది. అందుకే పండుగ సీజన్ లో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పెద్ద ఎత్తున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నది. దేశం మొత్తం ఆర్ధిక మాంద్యంతో తల్లడిల్లుతున్న సమయంలో ఆర్ టి సి సిబ్బంది సమ్మెకు దిగడం ఎవరికి వేలు చేస్తుందని అందరూ ప్రశ్నిస్తున్నారు.

రానున్న రోజుల్లో సామరస్యంగా సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమని చెబుతున్నా ఆర్ టి సి సిబ్బంది సంఘాలు వినకపోవడం దారుణమైన విషయంగా పరిగణిస్తున్నారు. వచ్చేఏడాది మార్చి ఆఖరు వరకూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులు వుండే అవకాశం కనిపిస్తున్నది. కొత్త బడ్జెట్ ప్రవేశ పెడితే తప్ప కొత్త విషయాలు ఆలోచించే స్థితిలో ప్రభుత్వం లేదు. ఒక్క తెలంగాణ ప్రభుత్వమే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాల పరిస్థితి ఇలానే ఉంది.

తెలంగాణతో పోలిస్తే చాలా రాష్ట్రాలలో ఇప్పటికే ఆర్ధిక మాంద్యం కమ్ముకుని ఉంది. ఆర్ధిక మాంద్యం తరుముకొచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకే నిధులు సరిపోవడం లేదు.  కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదుకునే అవకాశం లేకపోవడం వల్ల ఇప్పుడు ఆర్ టి సి లాంటి సంస్థల సిబ్బందికి ఉన్న సమస్యలు తీర్చడం సాధ్యం కాదు. ఇలాంటి కీలక విషయాలను అధికారుల కమిటీ చెబుతున్నా కూడా సిబ్బంది సంఘాలు మంకుపట్టు పడుతున్నాయి.

పండుగలు, సెలవు సీజన్ లోనే ఆర్ టి సికి కొద్దో గొప్పో లాభాలు వచ్చేది. ఆ లాభాలు కూడా హరించే విధంగా ఆర్ టి సి సిబ్బంది వ్యవహరిస్తునారనే విమర్శలు పెల్లుబుకుతున్నాయి. ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఆర్ టి సి మరింతగా నష్టాల్లో కూరుకుపోతే ఇక ప్రయివేటు వారికి అప్పగించడం తప్ప ప్రభుత్వం చేసేది ఏమీ ఉండదు. ఈ వాస్తవాన్ని ఆర్ టి సి సిబ్బంది సంఘాలు మరుగున పెడుతున్నాయి. పండుగల సీజన్ లో సమ్మె చేయడం తమ చేత్తో తమ కన్నునే పొడుచుకోవడం గా పలువురు అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 37 వేల ప్రయివేటు వాహనాలకు ప్రభుత్వం తాత్కాలిక రూట్ పర్మిట్లు ఇచ్చేసింది.

అదే విధంగా ఇతర ప్రయివేటు వాహనాలను కూడా ప్రయాణీకులను ఎక్కించుకునే విధంగా పర్మిట్లు మంజూరు చేస్తున్నారు. మరో వైపు దక్షిణ మధ్య రైల్వే కూడా అదనపు రైళ్లను నడిపేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నది. మెట్రో రైలు హైదరాబాద్ లో అదనపు సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. స్కూల్లకు సెలవులు ఉన్నందున అన్ని స్కూళ్ల బస్సులను రవాణా వాహనాలుగా ఉపయోగించేందుకు కూడా ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. క్యాబ్ సర్వీసులు ఇతర వాహనాలను కూడా ప్రజా రవాణాకు వీలుగా పర్మిట్టు ఇచ్చేస్తున్నారు. అంతే కాకుండా పక్క రాష్ట్ర మైన ఆంధ్రప్రదేశ్ లో ఆర్ టి సి సమ్మె లేకపోవడం వల్ల అక్కడ నుంచి అదనపు వాహనాలు నడిపితే ఇక తెలంగాణ ఆర్ టి సి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఆర్ టి సి సిబ్బంది కోరికలను తీర్చాలని ప్రభుత్వానికి ఉన్నా ఇప్పుడు చేసే వీలు లేదు. సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకోవడానికి ఏ మాత్రం అనుకూలత ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రుల ఉప సంఘాన్ని వేసి ఉండేవారు. అలా లేదు కాబట్టే కఠిన వైఖరి అవలంబించేందుకు  సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో అధికారుల కమిటీని నియమించారు. అందువల్ల ఇప్పటి కైనా ఆర్ టి సి సిబ్బంది సంఘాలు వాస్తవ పరిస్థితిని గమనించి పండుగల సీజన్ లో సంస్థకు వచ్చే లాభాలను అడ్డుకోకుండా ఉండటం మంచిది

Related posts

“అనన్య” అసాధారణ విజయం సాధించాలి

Satyam NEWS

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

Satyam NEWS

అరెస్టుల పర్వం: మరో తెలుగుదేశం నాయకుడి అర్ధరాత్రి అరెస్టు

Satyam NEWS

Leave a Comment