టీవీ9 వ్యవస్థాపక ఛైర్మన్, సీఈవో రవిప్రకాష్ పై అసందర్భమైన, అసత్య ఆరోపణలు చేసిన పార్లమెంట్ సభ్యుడు విజయ సాయి రెడ్డి పై 100 కోట్ల పరువునష్టం దావా వెయ్యాలని రవిప్రకాష్ కార్యాలయం నిర్ణయించింది. ఏబీసీఎల్ సంస్థలో చట్టవ్యతిరేకంగా ప్రవేశించిన రామేశ్వరరావు, మెఘా కృష్ణా రెడ్డి ద్వయం ఈ నీచమయిన ఆరోపణలు చేయిస్తోందని రవిప్రకాష్ కార్యాలయం ఆరోపించింది. నెలక్రితం ఇవే అసత్య ఆరోపణలు రామేశ్వరరావు, మెఘా కృష్ణారెడ్డి అనుచరుడైన రౌడీ షీటర్ రామారావు లిఖితపూర్వకంగా వివిధ శాఖలకు పంపించారని ఇప్పుడు అవే ఆరోపణలు పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి చేస్తున్నారని రవిప్రకాష్ మీడియా కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆరోపణలు కేవలం గాలి కబుర్లేనని ఇప్పటికే అధికారులు నిర్ధారించారని అయినా రామారావు నెలక్రితం పంపిన లేఖ కాపీనే ఎంపి విజయ సాయి రెడ్డి ఇప్పుడు తన లెటర్ హెడ్ పై పంపించారని రవిప్రకాష్ మీడియా కార్యాలయం తెలిపింది. గతంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పై మలేషియా, సింగపూర్ విదేశీ నిధులు తరలింపంటూ అబద్ధపు ఫిర్యాదులు పంపి అభాసుపాలయిన రామారావు తిరిగి నేడు రవిప్రకాష్ పై ఆధారాలు లేని ఆరోపణలు సంధించారని ప్రత్యారోపణ చేశారు. ఈ కట్టుకథలు వెనుక ఈ పెద్దలే ఉన్నారని స్పష్టంగా అర్ధమవుతోందని రవిప్రకాష్ మీడియా కార్యాలయం వివరించింది. కంపెనీ షేర్ల వివాదం లో పై చేయి సాధించడం కోసం మై హోమ్ రామేశ్వర రావు, మెఘా కృష్ణారెడ్డి ఈ నీచమైన ఆరోపణలను వివిధ శాఖలకు పంపిస్తున్నారన్న విషయం స్పష్టంగా అర్ధమవుతోందని, ఈ నిరాధారమైన ఆరోపణలను అత్యుత్సాహంతో ప్రసారం చేసిన ఛానెళ్ల పై కూడా చర్య తీసుకోవాలని మా కార్యాలయం నిర్ణయించిందని రవిప్రకాష్ కార్యాలయం తెలిపింది.
next post