29.7 C
Hyderabad
April 29, 2024 07: 10 AM
Slider ప్రత్యేకం

అహంకారం…అహంకారం.. అహంకారం అదే అమెరికాకు శాపం

#Donald Trump

ఆఫ్రికన్ అమెరికన్ అయిన  జార్జ్ ఫ్లాయిడ్ పై శ్వేతజాతి పోలీసు చేసిన దాష్టీకానికి ఇప్పుడు అమెరికా మొత్తం అతలాకుతలం అవుతున్నది. ఈ సంఘటనకు వ్యతిరేకంగా అమెరికాలో ఆందోళనలు, ఆగ్రహాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అమెరికాలోని  అనేక నగరాల్లో ఇప్పటికే కర్ఫ్యూ విధించారు.

శ్వేత సౌధం ఆవరణలోనే నల్లజాతీయులు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన కుటుంబసభ్యులతో సహా శ్వేత సౌధంలో ఉన్న బంకర్ లోకి వెళ్ళిపోయాడు. ఈ పరిణామాల మధ్య  నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దించారు. సైన్యాన్ని కూడా దింపాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరికలు జారీచేశాడు.

తెల్లవారి కోసం తెల్లవాడు చేస్తున్న ప్రయత్నం

అల్లర్లు అదుపుచేయడంలో గవర్నర్లు ఉదాసీనంగా ఉంటున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా  చేశాడు. ఇప్పటి వరకూ దాదాపు 4,000 మంది అరెస్టయ్యారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 40 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. 140 నగరాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు” అని చెప్పాడు  అమెరికాను పాలించిన ఆదర్శనీయ అధ్యక్షుడు అబ్రహం లింకన్.

ఇప్పటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అమెరికాకు కొత్త నిర్వచనం నిర్మాణం చేస్తున్నాడు. కేవలం తెల్లవారి యొక్క, తెల్లవారి చేత, తెల్లవారి కొరకు మాత్రమే అమెరికా అనేది ట్రంప్ ధోరణి. తాను  అధికారంలో ఉండడం కోసం, తెల్లవారిలో జాతీయభావం రెచ్చగొట్టి, వారి చేత ఓట్లు వేయించుకొని, తెల్లవారి నాయకుడుగా ముద్రపడాలనే రాజకీయ స్వార్ధం తప్ప ఆయనకు ఇంకొకటి లేదు.

తెల్లవారి ఓట్లు వస్తే సరిపోతుందా?

దానికి తోడు సహజసిద్ధమైన నల్లజాతి వ్యతిరేక భావం, తెల్ల అహంకారం కూడా ట్రంప్ లో  బలీయంగా ఉంది. రేపు డిసెంబర్ లో జరుగబోయే ఎన్నికలకు తెల్లవారిని సంపూర్ణంగా తన ఓటర్లుగా మార్చుకోడానికి చేసే వ్యూహంలో భాగమే నల్లవారిపై ఈ ద్వేషం, ఈ ఆగ్రహం. ఇది కేవలం జాత్యహంకారం కాదు.

స్వార్ధపూరిత రాజకీయ వ్యూహం. ఇదొక ప్రదర్శన. ఇదొక నాటకం. గత ఎన్నికల్లోనూ  తెల్లజాతి నినాదంతోనే ట్రంప్ అధికారంలోకి వచ్చాడు.  ఇప్పుడూ అదే నినాదం.అదే విధానం. కాకపోతే, స్వరం మార్చాడు. నల్లవారిపై స్వరం పెంచాడు.

నల్ల జాతి వారి ఓట్లు రాకపోయినా ఫర్వాలేదు

కరోనా విషయంలో సమయోచిత నిర్ణయాలు తీసుకోకపోవడం, సరియైన స్పందనలు లేకపోవడం వల్ల అమెరికా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఆ భావం అటు ప్రపంచ వ్యాప్తంగానూ, ఇటు అమెరికన్లలోనూ వ్యాపించింది. రేపటి ఎన్నికలకు ఇది దుష్ఫలితాలను ఇస్తుందోమో?  అనే భయం ట్రంప్ లో ఉంది.

దీని నుండి మెజారిటీ ఓటరులైన శ్వేతజాతీయులను  దారి మళ్లించడానికే ఈ నినాదం, ఈ విధానం  ఎత్తుకున్నాడని చెప్పాలి. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 70 శాతంకు పైగా తెల్లజాతీయులే ఉన్నారు. లాటిన్ అమెరికన్లు 16 శాతం వరకూ ఉంటారు.

నల్లవారు సుమారు 12.7శాతం ఉన్నారు. వీరినే ఆఫ్రికన్ అమెరికన్లని, ఆఫ్రో అమెరికన్లని అంటారు. అమెరికా జనాభాలో వీరిది 3వ స్థానం. ఐనప్పటికీ, వీళ్లు ఓటు వేయకపోయినా?  అధిక శాతం లో ఉన్న తెల్లవాళ్లు, మిగిలిన వారి ఓట్లతో అధికారంలోకి రావచ్చు అనే ధీమా బలంగా ఉన్న నాయకుడు డోనాల్డ్ ట్రంప్. ఆయన ట్రంప్ కార్డు కూడా అదే.

దుందుడుకు నాయకులకు బుద్ధి వస్తుంది 

ఈయన సమీకరణాలు రేపటి ఎన్నికల్లోనూ విజయవంతమవుతాయా?  ఇతని అహంకార ధోరణిని తెల్లవారూ కూడా వ్యతిరేకిస్తారా? కాలంలో తెలుస్తుంది. కాలం గొప్పది. ఇలా దురహంకారం ప్రదర్శించిన నాయకులందరికీ, అన్ని దేశాల్లోనూ ప్రజలు బుద్దిచెప్పిన చరిత్ర మన ఎదురుగానే ఉంది.

వీసాల అనుమతులు, ఉద్యోగాలు మొదలైన విషయాల్లో  భారతీయులను కూడా ట్రంప్ ఇబ్బందులు పెడుతున్నాడు. మొన్న, హైడ్రోక్సి క్లోరో క్విన్ విషయంలో భారత్ ను కూడా బెదిరించాడు. అగ్రరాజ్యాధిపతిననే అహంకారం కూడా ఈయనకు పుష్కలంగా ఉంది.

ఆర్ధిక ప్రయోజనాలకే ట్రంప్ ప్రాధాన్యం

ఇంతటి అహంకారం ఉన్నప్పటికీ, ప్రాధమికంగా ఇతనిలో వ్యాపారి దాగిఉన్నాడు. వ్యాపారం నుండి రాజకీయాల్లోకి వచ్చినవాడు కాబట్టి ఆర్ధిక ప్రయోజనాలకే పెద్దపీట వేస్తాడు. రాజకీయనాయకుడిగా మారిన తర్వాత అధికారం రుచి కూడా మరిగాడు కదా! ఈ అధికారం నిలబెట్టుకోడానికి కావాల్సిన గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలన్నీ ప్రదర్శిస్తాడు. వీటిల్లో భాగమే ఈ చేష్టలన్నీ.

ఆఫ్రికా నుండి కొన్ని వందల ఏళ్ళనాడు  ఈ నల్లజాతీయులంతా అమెరికాకు బానిసలుగా వచ్చారు. అనేక అవమానాలకు గురయ్యారు. అదే సమయంలో,  అమెరికా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పొందడానికి వారికి సాయంగా కూడా  నిలబడ్డారు.

తరచూ తలెత్తుతున్న ఘర్షణలు

మార్టిన్ లూథర్ కింగ్ వంటి మహానాయకుల పోరాటాలు, పౌర హక్కుల ఉద్యమాల తర్వాత, క్రమంగా బానిసత్వం నుండి బయటపడ్డారు. ఓటు హక్కు  సంపాయించారు. అక్షరాస్యత కూడా పెంచుకున్నారు. అభివృద్ధి పథంలోకి వచ్చారు. అమెరికా అభివృద్ధిలోనూ భాగస్వామ్యులవుతున్నారు.

ఇన్ని పరిణామాల తర్వాత కూడా జాతి విద్వేషాలకు తరచూ గురిఅవుతూనే ఉన్నారు. ఆందోళనలు జరుగుతూనే ఉంటాయి. తెల్లవారూ, వీళ్ళు కలిసి సాగుతూ ఉంటారు. మళ్ళీ, ఇటువంటి సంఘటనలు ఉద్యమాలు  పైకి లేస్తూ ఉంటాయి. నల్లజాతీయులు- తెల్లజాతీయుల మధ్య తిరిగే జీవితచక్రం ఇది.

ఒబామా అధ్యక్షుడైనా మారని చరిత్ర

చరిత్రలోనే మొట్టమొదటగా,  నల్లజాతీయుడైన ఒబామా బరాక్ అమెరికాకు  అధ్యక్షుడయ్యాడు. ఇది గొప్ప గెలుపు. నల్లజాతీయులు జీవితంలో కొత్త మలుపు. సరికొత్త అధ్యాయం. ఒబామా శకం ముగిసింది. మళ్ళీ శ్వేతజాతీయుడే పాలకుడయ్యాడు.

అమెరికాను పరిపాలించిన అధ్యక్షులలో అబ్రహం లింకన్, జాన్ కెనడీ   మొదలైనవారు సర్వమానవ సమానత్వ స్థాపనలో ఆదర్శంగా నిలిచారు. మానవులు నాగరికంగా ఎదుగుతున్నా?  ఈ అనాగరిక జాత్యహంకార, కులమత ద్వేషాల నుండి బయటకు రాలేకపోవడం పెను విషాదం. ఎప్పటికైనా మారుతారని ఆశిద్దాం.

మారాలని అభిలషిద్దాం. అమెరికాలో రగులుతున్న ఈ ద్వేషాలు త్వరలో సమసి పోవాలని కోరుకుందాం. సమభావం నాటుకోవాలని ఆశిద్దాం. బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైందని, సాక్షాత్తు అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ అన్నాడు. ఈ పోరులో ఏది గెలుస్తుందో వేచి చూద్దాం.

– మాశర్మ సీనియర్ జర్నలిస్టు

Related posts

టి‌ఆర్‌ఎస్ తోనే అభివృద్ది

Murali Krishna

సత్యం న్యూస్ కథనంతో కదిలిన పోలీసు యంత్రాంగం

Satyam NEWS

మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Satyam NEWS

Leave a Comment