38.2 C
Hyderabad
April 28, 2024 23: 00 PM
Slider ప్రత్యేకం

తోడేళ్ల గుంపునకు సింహం నాయకత్వం వహిస్తుందా?

#raghurama

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1కి వ్యతిరేకంగా శాంతియుత ఆందోళన చేస్తున్న వారిని భయంతో అరెస్టు చేసిన నువ్వు సింహం ఎలా అవుతావు. పోలీసు తోడేళ్లను ప్రయోగించి దాడులు చేయించిన నిన్ను తోడేలు అనాలా? సింహం అనాలా? తోడేళ్ల నాయకుడిని ఏమంటారు?  సింహం ఎక్కడైనా తోడేళ్ల గుంపుకు నాయకత్వం వహిస్తుందా? అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గతంలో ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు పెట్టి, వేధించి హింసించేవారు. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన  శాసనసభ్యులపై కూడా దాడులు చేస్తున్నారు. దళిత ఎమ్మెల్యేగా బాల వీరాంజనేయులు పై దళిత శాసనసభ్యులతోనే దాడి చేయించి, స్పీకర్ పైనే ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు దాడి చేసినట్టుగా సాక్షి దినపత్రికలో కథనం  హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఎవరు ఎవరిపైన దాడి చేశారనే దానికి ఆధారాలు ఉన్నాయి.

దాడికి సంబంధించిన విజువల్స్ ఉన్నప్పటికీ?, తోడేళ్ల గుంపు లాగా దాడి చేసి, మమ్మల్ని కొట్టారని ఎదురు చెప్పడం సింహం లక్షణమా? అని  రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. పంచతంత్రంలో నక్క వేషాలను వేస్తూ, కొట్టిన తర్వాత కూడా కొట్టలేదని బుకాయించడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 తీర్పు కోర్టు పెండింగ్ లో ఉండగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఈ జీవో ను వెనక్కి తీసుకోవాలని ప్రజా సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని  అరెస్టు చేయడం సిగ్గుచేటని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.

కొట్టించి… కొట్టించానని చెప్పుకునే దమ్ము లేని నువ్వు సింహానివా?

అక్రమ కేసులో తనని అరెస్టు చేయించి సునీల్ కుమార్ అనే వ్యక్తి  ఆధ్వర్యంలో  తోడేలు గుంపు చేత చిత్రహింసలకు గురి చేయించి, కొట్టించానని చెప్పుకునే దమ్ము లేని నువ్వు  సింహానివా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. తనని కొట్టించడమే కాకుండా, ఆ వీడియోలను ఫోన్లో చూసి ఆనందించావు. కొట్టించానని  నువ్వు అంగీకరించావా?, కొట్టానని సునీల్ కుమార్ ఒప్పుకున్నాడా??, తనకు సంఘీభావం తెలిపిన ఎంపీలకు కొట్టలేదని చెప్పింది నిజం కాదా?, కొట్టించి కూడా కొట్టలేదని చెప్పుకునే నువ్వు సింహానివా అంటూ  రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. కాళ్లు కట్టేసి కొట్టించడం కాదు… ధైర్యం ఉంటే ఎదురెదురుగా తలపడుదాం.  ఎవరు గెలుస్తారో చూద్దామని ఆయన సవాల్ విసిరారు.

ఉలిక్కిపడిన కొంతమంది మంత్రులు… కడప ఓటమితో ఊపిరి

ఉత్తరాంధ్ర పట్టభద్రుల  ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు, ఒంగోలు,  ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్సీ  పట్టభద్రుల ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థుల పరాజయంతో  కొంతమంది మంత్రులు ఉలిక్కిపడ్డారు. ఎక్కడ పిలిచి కొడతారోనని, మంత్రి పదవి నుంచి తప్పిస్తారోనని, కానీ కడపలో కూడా అధికార పార్టీ అభ్యర్థి  ఓటమి చెందడంతో ఊపిరి పీల్చుకున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

పులివెందులలోనే కొరలు పీకి వేయడంతో, మంత్రులపై చర్యలు తీసుకునే అవకాశం లేకపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం తమ పార్టీకి చెందిన వారు కల ఇదని నిజమిదియని  తెలియదులే, బ్రతుకింతేనులే జగన్ ఇంతేను లే అని పాట పాడుకుంటుండగా, కల చెదిరింది, కథ మారింది… కన్నీరే ఇక మిగిలింది… జగన్ కు ఇక కన్నీరే మిగిలిందని పాట పాడుకుంటున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

ఇన్ని తప్పులు చేసిన వారికి  ఇంత శిక్ష పడకుండా తప్పుతుందా అని తమ పార్టీకి చెందిన సోషల్ మీడియా ఆక్టివ్  కార్యకర్త వ్యాఖ్యానించింది. 2017 లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైకాపా అభ్యర్థి నెగ్గితే, మార్పు మొదలయ్యిందని  సాక్షి దినపత్రికలో రాశారని  గుర్తు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడు కూడా ప్రజల్లో మార్పు మొదలయ్యింది. పశ్చాత్తాపంతో గ్రాడ్యుయేట్లు  ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.

అయినా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్లు మా ఓటర్లు కాదని పేర్కొనడం సిగ్గుచేటు. సజ్జల వ్యాఖ్యలపై  సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వీళ్లు మన ఓటర్లు కాకపోతే అరవ వాళ్ళ సార్ అంటూ ప్రశ్నిస్తున్నారు. టిడిపి అభిమానులను ఇళ్లల్లో కట్టిపడేసి, అరవ వాళ్లను అరువుకు తెచ్చుకొని  కుప్పం లాంటి చిన్న మున్సిపాలిటీని గెలుచుకున్న తర్వాత  వై నాట్ 175  అని మనం అన్నామని, ఇప్పుడు పులివెందులలో పరాజయం తర్వాత పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

హైయెస్ట్ సింగల్ డిజిట్ కోసం ప్రయత్నించాలి

రానున్న ఎన్నికల్లో అత్యధిక సింగిల్ డిజిట్ కోసం అంటే తొమ్మిది స్థానాల కోసం మనం తీవ్రంగా ప్రయత్నించాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. అందరిలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత మార్పు వస్తుంది. నిన్నటి వరకు చిటపటలాడిన పార్టీలు కూడా దారిలోకి వచ్చే అవకాశం ఉంది. వామపక్ష పార్టీలతో పాటు, బిజెపి కార్యకర్తలు సానుభూతిపరులు తమ రెండవ ప్రాధాన్యత ఓటును టిడిపికే వేశారు.

ప్రజలు పోరాడే వ్యక్తులని గెలిపించాలని నిర్ణయించుకున్నారు. అధికార వైకాపాను కూకటి వేళ్ళతో పెకిలించాలని అనుకున్నారు. అధికార పార్టీని ఓడించాలని ప్రజలు డిసైడ్ అయ్యారని తాను గత రెండున్నర ఏళ్లుగా చెబుతూనే ఉన్నాను. అన్ని వర్గాలను మోసం చేశాం.  మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పి చేయకుండా మహిళలను మోసగించాం. సొంత మద్యాన్ని తయారు చేస్తూ, కోట్లాది రూపాయల అక్రమ సంపాదన కోసం డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టలేదు. ఇసుకలో 20 కోట్ల రూపాయల  కోటా పెట్టడం వల్ల, ప్రేమ్ రాజ్ అనే వ్యక్తి రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా తలపెట్టి ఆత్మహత్యలు చేసుకోలేకనే  చేస్తున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

ఇది ప్రజా విజయమని చంద్రబాబు చెప్పారు

మూడు ఎమ్మెల్సీ  స్థానాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సాధించిన విజయాన్ని ప్రజా విజయంగా  ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు  అభివర్ణించారని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. బిజెపి, పిడిఎఫ్ తో పాటు  అన్ని పార్టీల కార్యకర్తలు,  సానుభూతిపరులు  రెండవ ప్రాధాన్యత ఓటును టిడిపి అభ్యర్థులకే వేశారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను తెలియజేయడానికి, ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికలను వేదికగా ఉపయోగించుకున్నారు.

తమ పార్టీ నాయకుల మాదిరిగా ఇది తమ విజయం తమ పార్టీ విజయమని పేర్కొనకుండా, చంద్రబాబు నాయుడు కూడా అంతే స్ఫూర్తితోఈ విజయాన్ని ప్రజా విజయంగా  అభివర్ణించారు. ప్రజలు ఈ యుద్ధం లో విజయం సాధించాలంటే సరైన నాయకుడు సైనిక అధ్యక్షుడిగా ఉండాలి. ప్రజలు అటువంటి నాయకుడిగా  చంద్రబాబు నాయుడుని గుర్తించారని రఘురామకృష్ణం రాజు అన్నారు.

ఇది మల్టీస్టారర్ సినిమా…

తనకు తానే హీరోనని, ఇంకెవరో విలన్ అని జగన్మోహన్ రెడ్డి  పేర్కొన్నప్పటికీ, ఇందులో ఇద్దరు హీరోలు… RRR తరహాలో ఇది మల్టీస్టారర్ సినిమా. విలన్ మాత్రం నువ్వే అని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. నందమూరి, కొణిదెల కుటుంబాల నుంచి హీరోలు ఉంటే, ఈ చిత్రం లో బ్రిటిష్ వాడి మాదిరిగా బహుశా  విలన్  మీరే అవుతారు. సినిమాలో మీకు మీరే హీరోనని చెప్పుకున్నారు.

రామాయణం, భారతం అనే గ్రంథాల గురించి ముఖ్యమంత్రికి అవగాహన ఉన్నందుకు అభినందనలు. సినిమాలో హీరోని అభిమానించినట్లుగా, ప్రజలు తనని అభిమానిస్తారని జగన్మోహన్ రెడ్డి చెప్పారు.  విలన్ ఎవ్వరూ అభిమానించరని అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రామోజీరావుల పేర్లను ప్రస్తావిస్తూ వారిని విలన్లతో పోల్చారు. రామాయణం, భారతం, బైబిల్, ఖురాన్ లలో హీరోని ప్రజలు అభిమానించారని, రామాయణంలో మిమ్మల్ని మీరు రాముడు అనుకున్నారు… మీరు రాముడు కాదు రావణసురుడివి అని అందరికీ తెలుసు.

రావణాసురుడు, శివుడి కోసం తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని అనుగ్రహం పొందారు. ప్రజా దేవుళ్ల వద్ద  రావణాసురుడి మాదిరిగానే మీరు కూడా 151 స్థానాలను పొందారు. శివుడిచ్చిన వరాన్ని ఆయన పైనే ప్రయోగించాలనుకున్న  బస్మాసురుడిలాగా తయారై, ప్రజలపై రకరకాల పన్నుపోట్లు వేశారు. బటన్ నొక్కానని చెబుతున్నారు. ఎన్నో ప్రజాయుతమైన సంక్షేమ పథకాలను ఎత్తివేసిన విషయాన్ని విస్మరిస్తున్నారు. కోటానుకోట్ల రూపాయల అప్పులు  చేశారు.

భారతంలో కృష్ణుడు,  అర్జునుడు కూడా మీరు కాదు. దుర్యోధనుడు మీరైతే, శకుని ఎవరో ప్రజలందరికీ తెలుసు. బైబిల్లో జీసస్ కాదు మీరు, సైతాన్ మీరు. ఖురాన్ లో మమ్మద్ ప్రవక్త కాదు మీరు, ఖురాన్ వర్షన్ సైతాన్ ఎబ్లీస్ మీరు అంటూ రఘురామకృష్ణంరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దానవీరశూరకర్ణ చిత్రంలో నందమూరి తారక రామారావు దుర్యోధనుడి పాత్ర పోషించినప్పటికీ, శ్రీకృష్ణుడి పాత్రధారి హీరో. శ్రీకృష్ణుడి వేశాన్ని కూడా ఆయనే వేశారు. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిన  రావణాసురుడు, దుర్యోధనుడు హీరో కాదు.

స్త్రీ కాంక్షతో  రావణుడు, సిరికాంక్షతో నువ్వు విఫలమయ్యారు. నువ్వు హీరో కాదు విలన్ అని ప్రజలు నిర్ణయించుకున్నారు. అందుకే దారుణంగా కడప జిల్లా లోను ప్రజలు ఓడించారని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఒక్క రోజైనా వై నాట్ 175  డైలాగులు ఆపినందుకు సంతోషం . ఎక్కడపడితే అక్కడ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. కేవలం 3 మెడికల్ కాలేజీ లకు మాత్రమే అనుమతి లభించింది. 17 మెడికల్ కాలేజీ లకు ఇప్పటివరకు అనుమతి లభించలేదు.

తిరువూరులో ప్రజలు తింగరి వాళ్లు అనుకొని అనుమతులు లేకున్నా జేబులో దమ్మిడిలేకున్నా, మెడికల్ కాలేజీ నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఇంకొక రెండేళ్లు అవకాశం ఇవ్వాలని కోరడం సిగ్గుచేటు. ఈ నాలుగేళ్లు మీరు చేసింది ఏమిటి?, గోడలకు రంగులు వేయటం స్కూల్ లను మూసి వేయడం తప్ప. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని 20 సార్లు కలిసామని చెబుతున్నారు.

గతంలో ప్రధాన మంత్రిని కలిసిన తర్వాత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు కానీ ఇతరులు కానీ  మీడియాతో మాట్లాడి ప్రధాని స్పందించిన అంశాలను వెల్లడించేవారు. కానీ మీరు ఏ ఒక్కనాడు కూడా ప్రధానితో ఏమి మాట్లాడారో మీడియాకు చెప్పిన దాఖలాలు లేవు. పోలవరం పెండింగ్ బిల్లులు పదివేల కోట్ల రూపాయలు ఉన్నాయని వాటిని చెల్లించాలని  చెబుతున్నారు.

నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు మాట్లాడారు. రాజ్యసభలో మాట్లాడింది లేదు. గత ఏడాది 88 వేల కోట్ల రూపాయల అప్పులు చేసిన మీకు, పదివేల కోట్ల రూపాయల పెండింగ్  బిల్లులను సాధించుకోలేకపోయారంటే ఆశ్చర్యం వేస్తుంది. రైల్వే జోన్ సాధన బాధ్యత తనకు అప్పగించిన, ఈపాటికి తాను సాధించి ఉండేవాడినని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇది కేవలం ఒక్క శాతం ఓటు బ్యాంకే నని పేర్కొనడం హాస్యాస్పదం .

108 అసెంబ్లీ నియోజకవర్గాలలో 10 లక్షల మంది ఓటర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో   నాలుగు కోట్ల ఓటర్లు ఉంటే, 108 అసెంబ్లీ నియోజకవర్గాలలో  2.75 కోట్ల ఓటర్లు ఉన్నారు. అందులో పది లక్షల ఓటర్లు అంటే, సుమారు మూడున్నర శాతానికి పైబడే. ఈ ఓటింగ్ ను పబ్లిక్ పల్స్ గా  గుర్తించాలి.

గ్రాడ్యుయేట్ వేసిన ఒక్క ఓటు అతని ఒక్క ఓటు మాత్రమే కాదు. ఆ కుటుంబ సభ్యుల అందరి ఓటు. ఒక్కొక్క కుటుంబంలో నలుగురు ఓటర్లు ఉన్నారు అనుకుంటే, ప్రస్తుతం అంచనా వేసిన మూడు శాతం  ఓట్లు కాస్త 12% అవుతాయి. ఇక మూడు ఎమ్మెల్సీ  స్థానాలలో  ఒకచోట మూడు శాతం మరొకచోట ఐదు శాతం, ఇంకో చోట రెండు శాతం ఓట్లు వచ్చినప్పటికీ, తమకు 10 శాతం ఓట్లు వచ్చాయని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఈ లెక్కన తెలుగుదేశం పార్టీకి 150 శాతం ఓట్లు వచ్చినట్టా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నామని చంద్రబాబు నాయుడు పేర్కొనడం విడ్డూరంగా ఉందని, ఇప్పుడు సూర్యుడు ప్రకాశించడం లేదా?, గాలివీయడం లేదా అని ఒక మంత్రి చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం అంటే శాసన,  పాలక, న్యాయ వ్యవస్థలను పనిచేయనీయకపోవడం అని  పేర్కొన్నారు. జ్యుడీషరిని కట్టు బానిస లాగా మార్చుకున్నారని, పాలన వ్యవస్థను చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. ఎమ్మెల్సీగా రాంగోపాల్ రెడ్డి విజయం సాధించిన తర్వాత కూడా ఆయనకు ధ్రువీకరణ పత్రం అందజేయకపోవడమే దానికి నిదర్శనం. టిడిపి నాయకులే  వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని అధికార పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

మీకు ఒక నిబంధన… నాకు ఒక నిబంధనా

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 23 స్థానాలున్న తెలుగుదేశం పార్టీ బీసీ మహిళా అభ్యర్థి అనురాధను బరిలోకి దించింది. ఎమ్మెల్సీ గా గెలవడానికి కేవలం 22 మంది ఎమ్మెల్యేల ఓట్లు చాలని రఘురామకృష్ణం రాజు అన్నారు. టిడిపి నుంచి గెలిచిన నలుగురిని  తమతో అధికార పార్టీ   నాయకత్వం  చేర్చుకుంది.  విలువల గురించి మాట్లాడే సింహం, జూనియర్ సింహం… పార్టీ వీడి బయటకు వచ్చిన వారిపై  ఎందుకు అనర్హత వేటు వేయలేదు.

తాను ప్రభుత్వానికి మంచి సూచనలు చేసినందుకే, తనపై అనర్హత వేటు వేయాలని సూట్ కేసులకు యుద్ధం చేశారు. పార్టీ తరఫున ఎవరైనా అభ్యర్థిని నిలబెట్టి విప్ జారీ చేస్తే, తాను ఓటు వేస్తాను. అలాగే టిడిపి తరఫున గెలిచిన నలుగురు ఆ పార్టీ విప్ జారీ చేస్తే ఓటు వేయవద్ద అంటూ ప్రశ్నించారు. విప్ కు వ్యతిరేకంగా ఓటు వేసే వారిని అనర్హులు గా ప్రకటిస్తావా?,  నలుగురు ఓటు వేస్తే, ముగ్గురు వారికి ఓటు వేసే అవకాశం ఉంది. ఏడు మందిని అనర్హులుగా ప్రకటించి ఎన్నికలు నిర్వహించే దమ్ముందా?, వేసేది నక్క వేషాలు చేసేది తోడేలు పనులు, పేరుకు మాత్రం సింహం అని బిల్డప్పుల అంటూ  రఘు రామకృష్ణంరాజు ఫైర్ అయ్యారు.

Related posts

నేతన్న చేతులు నాకుతున్న అవినీతి అధికారులు

Satyam NEWS

వెనువెంటనే పీఎస్ లను తనిఖీ చేస్తున్న విజయనగరం ఎస్పీ

Satyam NEWS

అంగరంగవైభవంగా కొత్త సచివాలయం ప్రారంభోత్సవం

Bhavani

Leave a Comment