26.7 C
Hyderabad
May 3, 2024 08: 04 AM
Slider ప్రత్యేకం

జగన్ గారూ, ఆ 40 వేల కోట్లూ ఏమయ్యాయో ప్రజలకు చెప్పండి

#RRR letters

రాష్ట్ర ఖజానా నుంచి 40 వేల కోట్ల రూపాయలు మాయం కావడంపై ముఖ్య ఎకౌంటెంట్ జనరల్ లతా మల్లికార్జున రాసిన లేఖ కు తక్షణమే సమాధానం ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.

ఆయన ‘‘అత్యంత విధేయత’’తో నేడు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఏదో పొరబాటు జరిగిందని అంటే సరిపోదని, ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత తీసుకోకపోతే విపరీత పరిణామాలు దురవుతాయని రఘురామకృష్ణంరాజు తన లేఖలో పేర్కొన్నారు. ఆయన రాసిన లేఖ పూర్తి పాఠం ఇది:

ముఖ్యమంత్రి గారూ,

రాష్ట్ర ప్రభుత్వం, సుమారు 41,000 కోట్ల రూపాయలకు పైగా నిధులకు సరైన లెక్కలు చూపలేదని మీడియా, ప్రతిపక్షనాయకులు, సాధారణ ప్రజానీకం కూడా ఇప్పుడు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ కోడ్ కు విరుద్ధంగా ఈ భారీ మొత్తం నిధులను బదిలీ చేసినట్లు లేదా విత్ డ్రా చేసినట్లు వారికి స్పష్టంగా కనిపిస్తున్నది.

మొత్తం రూ.41,043.08 కోట్ల కు సంబంధించిన 10,806 బిల్లులను ప్రత్యేక క్యాటగిరి బిల్లులుగా పేర్కొంటూ ట్రెజరీ కోడ్ కు విరుద్ధంగా డ్రా చేశారనే విషయాన్ని ప్రస్తావిస్తూ ముఖ్య ఎకౌంటెంట్ జనరల్ లతా మల్లికార్జున రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ కు లేఖ రాశారు. ఈ బిల్లులకు సంబంధించిన వోచర్లు కానీ, మంజూరి పత్రాలుగానీ, లాభితుల వివరాలు గానీ, డ్రాయింగ్ అండ్ డిస్బర్స్ మెంట్ అధికారి సంతకాలు కానీ, బిల్లుల వర్గీకరణ లాంటి ఏ ఒక్క వివరం కూడా లేదు. ఇలా ఏ వివరం లేకపోవడంతో పైన చెప్పిన మొత్తం నిధులకు సంబంధించిన బిల్లులను అనుమానాస్పద బిల్లుల కిందే పరిగణించాల్సి ఉంటుంది. ఇది చెల్లింపుల విధానంలోని అంతర్గత నిబంధనల డొల్లతనాన్ని వెల్లడి చేస్తున్నది.

ఇంత పెద్ద మొత్తంలో నిధులకు లెక్కలు చూపకపోవడం పొరబాటున జరిగింది కాదు. అందువల్ల మరింత స్పష్టమై వివరాలతో, బాధ్యతాయుతమైన సమాధానం అవసరం అవుతున్నది. అందుకే గౌరవనీయులైన రాష్ట్ర ఆర్ధిక మంత్రిగారు తగిన వివరాలతో సంతృప్తికరమైన సమాధానం చెప్పేందుకు ముందుకు రావాలి. అలా కాకుండా ఏ విషయం అయినా సరే సాధారణంగా మీడియా ముందుకు వివరణలు ఇచ్చే ప్రజా వ్యవహారాల సలహాదారుడే మళ్లీ తెరపైకి వచ్చి, దీనిపై కూడా వివరణ ఇవ్వడం సబబు కాదు. ఏదో కంటితుడుపు చర్యగా సమాధానం చెప్పేదామనుకోవడం ఈ విషయంలో సరికాదు. ఎందుకంటే ఇందులో ఎంతో విలువైన ప్రజాధనం మిళితమై ఉంది. సరైన సమాధానం చెప్పకపోతే మరిన్నిఅనుమానాలుకు తావిచచ్చినట్లు అవుతుంది. సమగ్ర ఆర్ధిక యాజమాన్య వ్యవస్థ (Comprehensive Financial Management System(CFMS) విషయాన్ని పక్కన పెడితే ఈ చెల్లింపులు ఎవరికి అందాయి? ఏ విధంగా చెల్లింపులు జరిపారు? ఇలా చేయడానికి ప్రధాన కారణాలు ఏమిటి? అనే అంశాలు ప్రజల ముందుకు వివరణ రూపంలో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

బిజినెస్ న్యూస్ డైలీ కథనం ప్రకారం పిఏజి లేవనెత్తిన ఈ రూ.40,000కోట్ల రూపాయల చెల్లింపులను ఏపి క్యాపిటల్ రీజియన్ శాఖ కింద మొత్తం 3,667 బిల్లుల ద్వారా 2020 21 ఆర్ధిక సంవత్సరంలో చెల్లింపులు జరిపినట్లుగా వెల్లడి అవుతున్నది. ఈ శాఖ కింద జరిపిన చెల్లింపుల లాభితులు ఎవరు? ఎందుకోసం వారికి చెల్లింపులు జరిపారు అనే విషయాలను తక్షణమే మరింత స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉన్నది.

ఉపాధి హామీ పథకం (MNREGA) కింద పనులు చేసిన అతి చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులను సమగ్ర ఆర్ధిక యాజమాన్య వ్యవస్థ (CFMS)  సక్రమంగా పని చేయడం లేదని  చెప్పి బిల్లుల చెల్లించని మీరు, అదే వ్యవస్థ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసేయడం పలు అనుమానాలు తావిస్తున్నది. అనుమానం పెనుభూతం. దాన్ని ఆదిలోనే తుంచేయాలి.

ఈ సందర్భంగా ప్రజలు కుమరగిరి వేమారెడ్డి పద్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కుమారగిరి వేమారెడ్డి అంటే వేరెవరో కాదు యోగి వేమన. ఆయన రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడే.

తమకుగల్గు పెక్కు తప్పులుండగా

ఓగు నేరమెంచు నోరులుగాంచి

చక్కిలంబు గాంచి జంతికనగినట్లు

విశ్వదాభి రామ నినురవేమ

పై పద్యం చదివిన తర్వాత మీకు ప్రజల అభిప్రాయం తెలిసిందనుకుంటాను. అందువల్ల మనం చేస్తున్న తప్పులపై మనం మరింత జాగ్రత్తగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నది. ఈ సందర్భంగా నేను మీకు చేస్తున్న సూచన ఏమిటంటే ఇక నుంచి మరింత పారదర్శకంగా ఉండేందుకు ప్రతి చెల్లింపునూ ట్రెజరీస్ అండ్ ఎకౌంట్స్ శాఖ నుంచే చేయండి. అలా కాకుండా ఇలా నిధుల దారి మళ్లింపు ఉంటే అది పెను ఉత్పాతానికి దారి తీస్తుందనడంలో సందేహం లేదు. తక్షణమే ఈ లోటుపాట్లను సరిదిద్దాలని నేను మీమ్మల్ని కోరుతున్నాను. అలా కాకుండా నిర్దేశిత పద్ధతులు, కోడ్ లు, నిబంధనలను ఇలా యధేచ్ఛగా ఉల్లంఘిస్తూ నిధులను దుర్వినియోగం చేసుకుంటూ పోతే  మరిన్ని ప్రమాదాలకు దారితీయవచ్చు. తక్షణమే సమగ్ర ఆర్ధిక యాజమాన్య వ్యవస్థ (CFMS) నుంచి చేస్తున్న చెల్లింపులపై పారదర్శకమైన ఆడిట్ జరిపించండి. భవిష్యత్తులో పెను విఘాతాలు కలిగి ప్రమాదాలలో చిక్కుకోకుండా ఉండాలంటే మీరు తక్షణం చేయాల్సిన పని ఇది.

భవదీయుడు

కె.రఘురామకృష్ణంరాజు.

Related posts

భారతీయ జనతా పార్టీకి జై కొడుతున్న యువకులు

Satyam NEWS

చినజీయర్ స్వామి పర్యటనకు దుబ్బాకలో పోలీసుల ఏర్పాట్లు

Satyam NEWS

నేత్రపర్వంగా ద్వాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు అష్టబంధన సంప్రోక్షణ

Satyam NEWS

Leave a Comment