దిశ హత్య కేసు నిందితులు పారిపోవడమే కాకుండా తమపై రాళ్లతో దాడి చేసినందువల్లే పోలీసులు కాల్పులు జరిపారని పోలీసు కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. ఈ తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్లు ఆయన తెలిపారు. చటాన్‌పల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు.
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సీపీ పరిశీలించారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు మృతి చెందారు అని ఆయన అన్నారు. అందులో ఏ1 కరడుగట్టిన నిందితుడని సజ్జనార్ తెలిపారు.
గత నెల 27వ తేదీన దిశపై అత్యాచారం చేసిన నిందితులు హత్య చేసి చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి కింద శవాన్ని కిరోసిన్ పోలీస్ కాల్చిన సంగతి ఆయన గుర్తు చేశారు. అదే ప్రదేశంలో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రదేశంలో చీకటిగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా చేసుకున్న నిందితులు పోలీసులపై దాడికి దిగారు.
తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. జైల్లో ఉన్నప్పుడు నిందితులను వేరువేరుగా ఉంచారు. నిందితులను ఘటనకు పాల్పడిన ప్రాంతానికి తీసుకురాగానే అరగంటపాటు విచారణ జరిగిన అనంతరం ఆరిఫ్ మొదట పోలీసులపై దాడి చేశాడు. అనంతరం మిగితా ముగ్గురు పోలీసులపై తిరగబడ్డారు.
నిందితులు తుపాకులు లాక్కొని పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారని ఆయన తెలిపారు.