26.7 C
Hyderabad
April 27, 2024 09: 02 AM
Slider జాతీయం

సమగ్ర శిక్షా పథకం కొనసాగింపునకు కేబినెట్ కమిటీ ఆమోదముద్ర

#sarva skisha abhiyan

సవరించిన సమగ్ర శిక్షా పథకాన్ని ఐదేళ్లు పొడిగించాలన్న ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతలోని ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఆమోదం తెలిపింది. 2021-22నుంచి 2025-26వ సంవత్సరం వరకూ ఐదేళ్ల పాటు ఈ పథకాన్ని పొడిగించడానికి మంత్రివర్గ సంఘం ఆమోదించింది. రూ. .2,94,283.04 కోట్ల మేర పెట్టుబడితో (రూ. 1,85,398.32 కోట్ల కేంద్ర వాటాతో సహా) ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

ప్రయోజనాలు:

మొత్తం 11లక్షల 60వేల పాఠశాలల్లో 15కోట్ల 60వేలమంది విద్యార్థులకు, 57లక్షల మంది ఉపాధ్యాయులకు ఈ పథకాన్ని వర్తింప జేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో, ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ స్థాయి నుంచి సీనియర్ సెకండరీ స్థాయి వరకు ఈ పథకం అమలులో ఉంటుంది.

వివరాలు:

సమగ్ర శిక్షా అనేది పాఠశాల విద్యకు వర్తించే సమగ్రమైన  కేంద్ర ప్రాయోజిత పథకం. ప్రీ-స్కూలు స్థాయినుంచి పన్నెండవ తరగతి వరకూ వర్తింప జేయడానికి ఈ పథకాన్ని రూపొందించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు (ఎస్.డి.జి.-4కు) అనుగుణంగా, అందుకు పాఠశాల విద్యను ఒక కొనసాగింపు ప్రక్రియగా ఈ పథకం పరిగణిస్తుంది. విద్యాహక్కు చట్టం (ఆర్.టి.ఇ.) అమలుకు సహాయకారిగా ఈ పథకం పనిచేస్తుంది.

అంతేకాక, పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలని, అందరికీ సమాన అవకాశాలతో తరగతిగది వాతావరణంలో విద్య అందేలా చూడాలని 2020వ సంవత్సరపు జాతీయ విద్యా విధానం పేర్కొన్న సూత్రాలకు అనుగుణంగా ఈ పథకం పనిచేస్తుంది. పిల్లల విభిన్నమైన నేపథ్యాలు, బహుళ భాషల అవసరాలు, విభిన్నమైన విద్యాపరమైన సామర్థ్యాలు వంటి వాటి రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని, అధ్యయన ప్రక్రియలో వారికి చురుకైన భాగస్వామ్యం ఒనగూడేలా చూడాలని విద్యావిధానం పేర్కొన్న సూత్రాలకు, సిఫార్సులకు కూడా సర్వశిక్ష అభియాన్ తగిన మద్దతు ఇస్తుంది.

ఈ పథకం కింద ప్రధాన కార్యక్రమాలు:

(i) మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా సార్వత్రిక అనుసంధానం; (ii)పునాది స్థాయిలోనే వ్యవస్థాపక అక్షరాస్యత, గణిత శాస్త్ర పరిజ్ఞానం, (iii) లింగపరమైన సమానత్వం; (iv) సమ్మిళిత విద్య; (v) నాణ్యత, సృజనాత్మకత; (vi) ఉపాధ్యాయ వేతనాలకు ఆర్థిక మద్దతు; (vii) డిజిటల్ పరిజ్ఞానాన్ని పెంచే చర్యలు; (viii) యూనిఫారం దుస్తులు, పాఠ్యపుస్తకాలతో సహా విద్యాహక్కు పరంగా వచ్చే అర్హతల అమలు; (ix) బాలల సంరక్షణ, విద్యాబోధనకు (ఇ.సి.సి.ఇ.కి) మద్దతు; (x) వృత్తి విద్య; (xi) క్రీడలు, శారీరక దారుఢ్య విద్య; (xii) ఉపాధ్యాయ విద్య, శిక్షణా ప్రక్రియలను బలోపేతం చేయడం; (xiii) పర్యవేక్షణ; (xiv) కార్యక్రమ నిర్వహణ; (xv) జాతీయతా అంశాలు.

సవరించిన సమగ్ర శిక్షా పథకంలో నూతన కార్యక్రమాలు:

ఈ పథకం నేరుగా పిల్లలకు చేరే అవకాశాలను విస్తరింపజేసేందుకు పిల్లల ప్రయోజనాలే ప్రధానంగా చేపట్టే కార్యక్రమాలన్నింటినీ పూర్తిగా అందుబాటులోకి తెస్తారు. ఇందుకోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదిక ఆధారంగా విద్యార్థులకు ప్రత్యక్ష ప్రయోజనాన్ని నిర్ణీత కాలంలో బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంటారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు/ అభివృద్ధి సంస్థల ప్రమేయంతో ఈ పథకానికి ఒక క్రియాశీలక ఆకృతితో కూడిన వ్యవస్థ ఉంటుంది. నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక తత్వపు మంత్రిత్వ శాఖతో ఉన్న ప్రమేయంతో వృత్తి విద్యావ్యవస్థ విస్తరణ జరుగుతుంది. నైపుణ్యాల అభివృద్ధికోసం ఈ మంత్రిత్వ శాఖతోపాటుగా ఇతర మంత్రిత్వ శాఖలు నిధులు అందించే ఏర్పాటు ఉంటుంది. సదుపాయాలను సంతృప్త స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాఠశాలల, పారిశ్రామిక శిక్షణా సంస్థల (ఐ.టి.ఐ.ల), పాలిటెక్నిక్ సంస్థల మౌలిక సదుపాయాలు దోహదపడతాయి. బడికి వెళ్లే విద్యార్థులకే కాక, పాఠశాల విద్యకు దూరమై బడి బయట ఉంటున్న చిన్నారులకు కూడా ఈ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. 

అంగన్ వాడీ కార్యకర్తలకు, ఇ.సి.సి.ఇ. విభాగపు ఉపాధ్యాయులకు సర్వీసులోనే ఉండగానే శిక్షణ ఇచ్చేందుకు అవసరమయ్యే మాస్టర్ శిక్షకుల తర్ఫీదుకోసం కూడా తగిన ఏర్పాటు ఉంటుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విభాగాల్లోని వారికి బోధనా, అధ్యయనా సామగ్రి (టి.ఎల్.ఎం.)కోసం, స్వదేశీ తయారీ ఆటబొమ్మలు, గేమ్స్, తదితర కార్యక్రమాలకు  ఒక్కో చిన్నారికి సంవత్సరానికి రూ. 500 చొప్పున అందించేందుకు అవకాశం.

మూడవ తరగతి ముగిసేటప్పటికి లేదా ఐదవ తరగతి లోగా చదవడం, రాయడం, గణిత పరిజ్ఞానం అలవర్చుకోవడంతోపాటుగా ప్రతి చిన్నారీ ఆశించిన రీతిలో సామర్థ్యాలు సాధించేలా చూడటమే లక్ష్యంగా నిపుణ్ భారత్ పేరిట జాతీయ ఆక్షరాస్యతా, గణిత పరిజ్ఞాన వ్యవస్థాపక కార్యక్రమాన్ని ఈ పథకం పరిధిలోనే చేపట్టారు. ఈ కార్యక్రమం కింద బోధనా, అధ్యయన సామగ్రికోసం ప్రతి చిన్నారికీ సంవత్సరానికి రూ. 500, టీచర్ మాన్యువల్స్, వనరులకోసం రూ. 150, కార్యక్రమంపై మధింపుకోసం ప్రతి జిల్లాకు రూ. 10-20 లక్షలు అందిస్తారు.

జాతీయ విద్యా, పరిశోధనా శిక్షణా మండలి (ఎన్.సి.ఇ.ఆర్.టి.) చేపట్టే నిషితా కార్యక్రమంలో భాగంగా మాధ్యమిక విద్యా బోధనపై టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక శిక్షణా ప్రణాళిక.

ప్రీ ప్రైమరీ స్థాయినుంచి సీనియర్ సెకండరీ స్థాయి వరకూ పాఠశాలల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం. ఇదివరకు ఈ విషయంలో ప్రీ ప్రైమరీ స్థాయిని మినహాయించారు.

అన్ని బాలికల వసతి గృహాల్లో ఇన్సినరేటర్, శానిటరీ ప్యాడ్ వెండింగ్ యంత్రాల ఏర్పాటు.

ప్రస్తుతం అందుబాటులోఉన్న సెకండరీ పాఠశాలల్లో కొత్త పాఠ్యాంశాలను చేర్చడం.

సంవత్సరానికి రూ. 6,000 వ్యయంతో సెకండరీ స్థాయి వరకూ రవాణా సదుపాయం కల్పన.

పాఠశాల విద్యకు దూరమైన 16నుంచి 19 ఏళ్ల పిల్లలకు సంబంధించి, ఎస్.సి, ఎస్.టి., వికలాంగ పిల్లలకు తగిన తోడ్పాటును అందిస్తారు. జాతీయ సార్వత్రిక పాఠశాలల సంస్థ (ఎన్.ఐ.ఒ.ఎస్.) స్కూళ్లు/స్టేట్ ఓపెన్ స్కూళ్ల (ఎస్.ఒ.ఎస్.) ద్వారా సెకండరీ, సీనియర్ సెకండరీ విద్యను పూర్తి చేసేందుకు వీలుగా ఒక్కో తరగతికి రూ. 2,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు.

బాలల హక్కుల రక్షణ కమిషన్ కోసం ఆర్థిక సహాయం. రాష్ట్రాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని బాలల హక్కుల రక్షణ, భద్రత కోసం సహాయం.

ప్రతి అధ్యయన కర్త ప్రగతిని/విభిన్నత్వాన్ని పటిష్ట స్థాయిలో సంపూర్ణంగా తెలియజేసే విధంగా నివేదికను రూపొందించే పద్ధతిని ప్రవేశపెట్టడం. పరిపూర్ణ స్థాయి ప్రగతి నివేదిక (హెచ్.పి.సి.) రూపంలో దీన్ని అమలు చేయడం.

పరిపూర్ణ స్థాయి వ్యక్తిగత అభివృద్ధి కోసం పనితీరు, మధింపు, సమీక్ష, విశ్లేషణ పరిజ్ఞానాన్ని బేరీజు వేసేలా జాతీయ మధింపు సంస్థ పరాఖ్ నిర్వహించే కార్యకలాపాలకు మద్దతు.

ఏదైనా పాఠశాలనుంచి కనీసం ఇద్దరు విద్యార్థులు,.. ఖేలో ఇండియా పాఠశాలస్థాయి జాతీయ క్రీడోత్సవాల్లో పతకాన్ని సాధించిన పక్షంలో అలాంటి పాఠశాలలకు క్రీడల గ్రాంటుగా రూ. 25,000 వరకూ కేటాయింపు.

పిల్లలకు పుస్తకాల సంచులు మోసే అవసరంలేని వాతావరణాన్ని కల్పించడం. స్కూలు భవన సముదాయాల ఏర్పాటు, స్థానిక పారిశ్రామికులతో శిక్షణ, పాఠ్యాంశాలు, విద్యా బోధనా పద్ధతుల్లో సంస్కరణలు తదితర అంశాలను పొందుపరచడం.

భాషా బోధనకు కొత్తగా ఉపాధ్యాయుడిని నియమించే అంశాన్ని ఈ పథకంలో జోడించారు.-ఉపాధ్యాయులకు శిక్షణ, ద్విభాషా పుస్తకాల కల్పన, బోధన, అధ్యయన సామగ్రి వంటి వాటిని కూడా అదనంగా జోడించారు. ఉపాధ్యాయుల వేతనాలకు ఇచ్చే మద్దతుకు అదనంగా ఈ ఏర్పాట్లను పొందుపరిచారు.

కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయాలను (కె.జి.బి.వి.లను) అన్నింటినీ 12వ తరగతి స్థాయి వరకూ స్థాయిని పెంచి నవీకరించేందుకు పథకంలో ఏర్పాటు.

తొమ్మిది నుంచి పన్నెండవ తరగతి వరకూ ప్రస్తుతం విడిగా పనిచేస్తున్న బాలికల హాస్టళ్లకు (కె.జి.బి.వి. టైప్-4) ఆర్థిక సహాయాన్ని పెంచడం. ఇదివరకు సంవత్సరానికి రూ. 25 లక్షలుగా ఉన్న ఆర్థిక సహాయాన్ని రూ. 40లక్షల వరకూ పెంచడం.

‘రాణీ లక్ష్మీబాయి ఆత్మ రక్షా ప్రశిక్షణ్’ పథకం కింద బాలికలకు ఆత్మరక్షణ నైపుణ్యాలను, మెలకువలను నేర్పేందుకు 3 నెలల శిక్షణ. ఇందుకోసం ఇచ్చే నెలసరి మొత్తాన్ని రూ. 3,000నుంచి రూ. 5,000కు పెంచారు.

ప్రత్యేక అవసరాల పరిధిలోకి వచ్చే బాలికలకోసం స్టయిపండ్ రూపంలో నెలకు రూ. 200 చొప్పన పది నెలల పాటు చెల్లించేందుకు ప్రత్యేక ఏర్పాటు. ప్రీ ప్రైమరీ స్థాయినుంచి సీనియర్ సెకండరీ స్థాయి వరకూ చెల్లించే మొత్తానికి ఈ చెల్లింపు అదనం.

ప్రత్యేక అవసరాల పరిధిలోకి వచ్చే బాలల గుర్తింపుకోసం సంవత్సరానికి ఒకసారి బ్లాక్ స్థాయిలో గుర్తింపు శిబిరం నిర్వహణ. ఒక్కో శిబిరానికి రూ. 10,000 చొప్పున చెల్లింపు. వారి పునరావాసానికి, ప్రత్యేక శిక్షణ అవసరాలకు తగినట్టుగా బ్లాక్ స్థాయి వనరుల కేంద్రాలను తీర్చిదిద్దడం.

కొత్త తరహా రాష్ట్రస్థాయి విద్యా, పరిశోధనా, శిక్షణా మండలి (ఎస్.సి.ఇ.ఆర్.టి.) స్థాపించే ఏర్పాటు. దీనికి తోడు 2020 మార్చి నెలాఖరు వరకు జిల్లాల్లో కొత్త విద్యా శిక్షణా సంస్థలను (డి.ఇ.ఐ.టి.లను) ఏర్పాటు చేశారు.

పలు రకాల సాధనా సర్వేల నిర్వహణకోసం రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా మండలి (ఎస్.సి.ఇ.ఆర్.టి.)లో మధింపు విభాగాన్ని ఏర్పాటు చేయడం.

పరీక్షకు సంబంధించిన సామగ్రి, ఐటెమ్ బ్యాంకులు, వివిధ భాగస్వామ్య వర్గాలకు శిక్షణ, పరీక్షా సంబంధిత పరిపాలనా అంశాలు, సమాచార సేకరణ విశ్లేషణ, నివేదిక తయారీ వంటి వాటికి రూపకల్పన చేయడం.

బ్లాక్ స్థాయి వనరుల కేంద్రాలకు (బి.ఆర్.సి.లకు), క్లస్టర్ స్థాయి వనరుల కేంద్రాలకు (సి.ఆర్.సి.లకు) అందించే విద్యాబోధనా సంబంధమైన మద్దతును ప్రీ ప్రైమరీ, సెకండరీ స్థాయిలకు విస్తరింపజేయడం.

వృత్తి విద్య కింద ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలకు మద్దతు ఇవ్వడం.

పొరుగు ప్రాంతాల్లో ఇతర పాఠశాలలకు కేంద్రంగా పనిచేస్తున్న పాఠశాలల్లో వృత్తి విద్యకు సంబంధించి తరగతుల నిర్వహణతోపాటుగా, చర్చా గోష్టులను ఏర్పాటు చేయడం. స్కూళ్లకు రవాణా ఖర్చును, మధింపు  వ్యయాన్ని అందించే ఏర్పాటు.

ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐ.సి.టి.) లేబరేటరీలు, స్మార్ట్ తరగతి గదుల ఏర్పాటుకు అవకాశం. డిజిటల్ బోర్డులు, స్మార్ట్ వర్చువల్ తరగతి గదులు, డి.టి.హెచ్. చానల్స్.కు అదనంగా ఈ లేబరేటరీల ఏర్పాటుకు అవకాశం కల్పించారు.

పిల్లల స్థాయిని గురించి తెలుసుకునే వ్యవస్థను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో పాటు, ఎయిడెడ్ స్కూళ్లలోని వారికి కూడా కల్పించారు.

స్కూళ్ల సోషల్ ఆడిట్ కు మద్దతు. ప్రతి ఏడాది 20శాతం పాఠశాలలకు ఈ ఆడిట్ వర్తింపజేసే ఏర్పాటు. ఐదేళ్ల వ్యవధిలో మొత్తం స్కూళ్లకు సోషల్ ఆడిట్.ను వర్తింపజేస్తారు.

వ్యూహం అమలు, లక్ష్యాలు:

సమగ్ర శిక్షా పథకం అనేది పాఠశాల విద్యకోసం కేంద్రప్రభుత్వ సౌజన్యంతో రూపొందిన సమగ్ర పథకం. ఒక రాష్ట్రస్థాయి అమలు సంఘం (ఎస్.ఐ.ఎస్.) ద్వారా ఆయా రాష్ట్రాల్లో ఈ పథకం ఆమలవుతూ ఉంది. జాతీయ స్థాయిలో ఒక పరిపాలనా మండలి లేదా విద్యామంత్రి అధ్యక్షతలోని సంస్థ ఈ పథకాన్ని అజమాయిషీ చేస్తుంది.

ఈ పథకం అమలును పాఠశాల విద్య, అక్షరాస్యతా శాఖ కార్యదర్శి అధ్యక్ష్తతలోని ప్రాజెక్ట్ అనుమతి బోర్డు (పి.ఎ.బి.) కూడా పర్యవేక్షిస్తుంది. ఆర్థిక కార్యకలాపాలకు, కార్యక్రమాలకు సంబంధించిన నియమావళిని సవరించేందుకు పరిపాలనా మండలికి, లేదా సంస్థకు సాధికారత కల్పిస్తారు.

ఈ పథకం పూర్తిస్థాయి అమలుకు సంబంధించిన సవవిరమైన మార్గదర్శక సూత్రాలకు కూడా పరిపాలనా నిర్వహణా మండలి ఆమోదం తెలుపుతుంది. పాఠశాల విద్య నాణ్యతను మెరుగుపరిచేందుకు తీసుకోవలసిన చర్యలతో మార్గదర్శక సూత్రాల్లో ఎప్పటికప్పుడు తగిన సవరణలను పొందుపరుస్తూ ఉంటారు.

ఈ పథకం నేరుగా పిల్లలకు చేరే అవకాశాలను మరింత విస్తృతం చేసేందుకు వీలుగా బాలలకు ప్రయోజం కలిగించే కార్యక్రమాలన్నింటినీ నేరుగా విద్యార్థులకు చేరువ చేసేలా చర్యలు తీసుకుంటారు. నిర్ణీత వ్యవధిలోగా ప్రయోజనాలన్నీ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డి.బి.టి.) పద్ధతిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదిక ద్వారా విద్యార్థులకు చేరేలా తగిన చర్యలు తీసుకుంటారు.

15కోట్ల 60వేలమంది విద్యార్థులకు, 57లక్షల మంది ఉపాధ్యాయులకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రీ ప్రైమరీ స్థాయినుంచి సీనియర్ సెకండరీ స్థాయివరకు ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. పాఠశాల వ్యవస్థలోని ఉపాధ్యాయులు, టీచర్ ఎడ్యుకేటర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సమూహం, పాఠశాల యాజమాన్య కమిటీలు, రాష్ట్రాల స్థాయిలోని విద్యా పరిశోధనా శిక్షణా మండలులు (ఎస్.సి.ఇ.ఆర్.టి.లు), జిల్లా స్థాయి విద్యా శిక్షణా సంస్థలు (డి.ఐ.ఇ.టి.లు) బ్లాక్ స్థాయి విద్యా శిక్షణా సంస్థలు (బి.ఐ.టి.ఇ.లు), బ్లాక్ స్థాయి రిసోర్స్ పర్సన్స్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, వలంటీర్లు…వీరంతా సమగ్రశిక్షా పథకం అమలు వ్యవస్థ పరిధిలోకి వస్తారు. విద్యార్థులకు నాణ్యమైన, సమ్మళిత విద్యను సమాన ప్రాతిపదికతో అందజేసేందుకు వీరంతా కృషి చేయవలసి ఉంటుంది. 2020వ సంవత్సరపు జాతీయ విద్యావిధానంలో పేర్కొన్నట్టుగా విద్యార్థులకు పలురకాలైన నైపుణ్యాలను బోధించేందుకు మరింత ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తారు. వృత్తి విద్యను విస్తృతం చేసే ప్రక్రియను నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక తత్వ అభివృద్ధి మంత్రిత్వ శాఖతోను, నైపుణ్యాలకోసం నిధులందించే ఇతర మంత్రిత్వ శాఖలతోను కలసి అమలు చేస్తారు.

ప్రధానమైన ప్రభావం:

అందరికీ అందేలా పాఠశాల విద్య అనుసంధానాన్ని సార్వత్రికం చేయడం; తగిన అవకాశాలకు నోచుకోని, బలహీనమైన గ్రూపులను సమ్మిళతం చేయడం ద్వారా విద్యావకాశాల్లో సమానత్వాన్ని ప్రోత్సహించడం, అన్ని స్థాయిల్లోని పాఠశాల విద్యలో నాణ్యతను మెరుగుపరిచడం…వంటి లక్ష్యాలతో సమగ్ర శిక్షా పథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద నిర్దేశించిన వివిధ లక్ష్యాల ప్రకారం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగిన మద్దతు అందిస్తారు.:

2020వ సంవత్సరపు జాతీయ విద్యా విధానం సిఫార్సులను అమలు చేయడం;

చిన్నపిల్లల ఉచిత, నిర్బంధ విద్యా హక్కుకు సంబంధించి 2009వ సంవత్సరపు చట్టాన్ని అమలు చేయడం;

బాల్యదశ ప్రారంభంలో ముందస్తుగా సంరక్షణ కల్పించి, వారికి విద్యను అందించడం;

పునాది స్థాయిలో అక్షరాస్యత, గణిత పరిజ్ఞానం అలవర్చేందుకు ప్రాధాన్యం.;

పరిపూర్ణమైన, సమగ్ర, సమ్మిళిత, పాఠ్యాంశాలు, విద్యా బోధనా పద్ధతుల అమలకు ప్రాధాన్యం. కార్యకలాపాల ప్రాతిపదికగా, 21వ శతాబ్దపు నైపుణ్యాలను కల్పించడం;

నాణ్యతతో కూడిన విద్యను అందించడం, విద్యార్థుల్లో అధ్యయనపరంగా ఫలితాలను పెంపొందించడం;

పాఠశాల విద్య విషయంలో సామాజిక, లైంగిక పరమైన అంతరాలను పూడ్చివేయడం;

పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని స్థాయిల్లో సమానత్వం, సమ్మిళిత విధానం అమలు జరిగేలా చూడటం;

ఎస్.సి.ఇ.ఆర్.టి.ల/రాష్ట విద్యా సంస్థల, డి.ఐ.ఇ.టి.ల స్థాయిని పెంచి, మరింత బలోపేతం చేసి, ఉపాధ్యాయ శిక్షణకు నోడల్ ఏజెన్సీలుగా వాటిని తీర్చిదిద్దడం;

విద్యార్థులకోసం సురక్షితమైన, సానుకూలమైన అధ్యయన వాతావరణం నెలకొనేలా చూడడం. పాఠశాల విద్యా ప్రక్రియలో ప్రమాణాలు అమలయ్యేలా చూడటం,

వృత్తి విద్యను ప్రోత్సహించడం.

ఆత్మనిర్భర భారత్:

పునాది స్థాయిలో అలవడే నైపుణ్యాలు,.. జాతి నిర్మాణంలో నిర్వహించే కీలకపాత్రను గుర్తించిన ప్రభుత్వం ‘ఆత్మనిర్భర భారత్’ ఉద్యమ స్ఫూర్తితో ముందడుగు వేసింది. పునాది స్థాయిలో నైపుణ్యాల అభివృద్ధికి నేషనల్ వ్యవస్థాపక స్థాయి అక్షరాస్యత, గణిత పరిజ్ఞాన పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ‘ఆత్మనిర్భర భారత్’ కింద ప్రకటించారు. దేశంలోని ప్రతి చిన్నారీ మూడవ తరగతి పూర్తి చేసేలోగా పునాది స్థాయిలోనే అక్షరాస్యతను, గణిత పరిజ్ఞానాన్ని సాధించాలన్న లక్ష్యాన్ని 2026-27లోగా చేరుకునేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఇక చదవడం, అవగాహన చేసుకోవడం, గణిత పరిజ్ఞానం సాధించడం వంటి సామర్థ్యాలను పిల్లలకు అలవర్చేందుకు ఒక జాతీయ కార్యక్రమాన్ని నిపుణ్ భారత్ పథకం పేరిట ఇదే సందర్భంలో ప్రారంభించారు. 2021 జూలై 5న సమగ్ర శిక్షా పథకం పరిధిలోనే నిపుణ్ భారత్.ను ప్రకటించారు.

పథకం అమలు వివరాలు:

వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత సమగ్ర శిక్షా పథకం అమలవుతోంది.  దేశవ్యాప్తంగా చిన్నపిల్లల విద్యాపరమైన నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ పథకం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగిన మద్దతు అందిస్తోంది.

Related posts

తారాస్థాయికి చేరిన కుమ్ములాటలు: మంత్రి బొత్స నిర్ణయం ఏమిటో….

Satyam NEWS

మనమే నెంబర్ 1: ఎందులో…. జనాభాలో

Bhavani

తొలి ఎమ్మెల్యే అభ్యర్ధిని ప్రకటించిన జనసేన

Bhavani

Leave a Comment