42.2 C
Hyderabad
April 26, 2024 16: 21 PM
కవి ప్రపంచం

అంతఃకరణశుద్ధి

#Kondapally Niharini

అద్భుత ప్రచలిత తరగలు గుండెలోనికి

చేరవేస్తున్న వేళ లోకం కన్నుతో చూడు!

సంకెలలు తెగినసౌందర్యంలో

దగ్గరితనాన్ని మరింత కలిపేస్తూనే

దూరాలెంచమనని  సందర్భమిది.

విలువలచరితుల, సమరవీరుల త్యాగ ఫలితమిది

రక్తంరాలని యుద్ధ విజయమిది !

సర్వమత స్నేహాలు వజ్రసంకల్పమై,

మహోజ్వలమై, భవ్య స్వేచ్ఛాభారతమై

కాలయవనికపై మూడురంగుల వందన

గీతాలయినవి !!

ఆదర్శాల ఆశయసిద్ధి మనదయ్యేందుకై

అంతఃకలహాల పరదాలుతొలిగి

హృదయ తెరల చెరసాలలు వీగి

సమస్తం వెలుగుల జ్ఞాననక్షత్రమవ్వాలి!

అదిగో ,

ఆకసాన తెల్లపావురాల వారధి ఉన్నది

నేలతల్లి అడుగడుగున ప్రేమఫలాలు

పంచుతున్నది .                    

బద్ధవైరాల విశుద్ధరాగాల్ని గద్దకన్నుల కపటాలకు చిక్కనీయక

బహువిధ శాంతం ,

స్వచ్ఛ సౌభ్రాతృత్వం,

సమతాధ్యానం జెండాదండమవ్వాలి!

త్రివర్ణ పతాక భావం అంతఃకరణ శుద్ధత్వమై వెలగాలి!!

– కొండపల్లి నీహారిణి

Related posts

పిచ్చుక

Satyam NEWS

ప్రబోధ గీతం

Satyam NEWS

వ్యాయామం

Satyam NEWS

Leave a Comment