38.2 C
Hyderabad
April 27, 2024 16: 41 PM
Slider కవి ప్రపంచం

సమశంఖం పూరిద్దాం

#Puli Jamuna

ఆరుగాలం అహర్నిశలు  శ్రమిస్తూ

స్వేదమును జీవ రసాయనంగా మార్చి

పల్లెసీమకు పచ్చదనాల లేపనమద్ది

దేశాన్ని అన్నపూర్ణగా మలిచే అన్నదాతలు

జగతి ప్రగతి పథానికి భాగ్య విధాతలు

చీకటి పొద్దుల్లో వెలుగులీను సూర్యులై

మట్టి పరిమళాల గుభాళింపులో మమేకమై

అనునిత్యం ప్రమాదపు అంచుల్లో పయనిస్తూ

దేశానికి పసిడి సిరులందించే పరోపకారతడు

అతివృష్టి అనావృష్టిలను తట్టుకుంటూ

దిగులు మేఘాలు కమ్మిన కలతల మదిలో

కాంతిరేకలను నిబ్బరంగా నింపుకుని

ప్రకృతి విలయాలకు ఎదురొడ్డి నిలుస్తాడు

ఆశల విత్తులు నాటి ఆశయాల రెక్కలు తొడిగి

అలుపెరుగక సేద్యం చేసే కృషీవలుడతడు

సంక్షేమం పేరిట నూతన వ్యవసాయ చట్టాలు

కర్షక వీరుల కర్మఫలాలను కబళించివేస్తూ

అస్తిత్వాన్ని అణచి వేసే అయుధమవుతుంటే

తరతరాల రైతన్నల  శ్రమ దానం నిష్పలమై

సమస్యల సుడిగుండంలో  కూరుకుపోతున్నారు

కార్పొరేట్ కాలసర్ప పరిష్వంగంలో బలి కాకుండా

హాలికుల కంటినీరును నింపుకున్న కలాలమై

తడియారని గాయాల గేయాలను ఆవిష్కరించాలి

శ్రమదోపిడిని ధిక్కరించే నిరసన గళాలమై

తిరుగుబాటు బావుటానెత్తిన పోరుబాటకు

సంఘీభావం తెలిపే స్వరాలమై భరోసానందిద్దాం

పులి జమున-మహబూబ్ నగర్, 8500169682

Related posts

అమ్మాయిలు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలి

Satyam NEWS

తెలుగు వారి ఉగాది

Satyam NEWS

కొల్లాపూర్ లో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి

Satyam NEWS

Leave a Comment