30.7 C
Hyderabad
April 29, 2024 06: 57 AM
Slider కవి ప్రపంచం

దిగులు మేఘం

#Dr Bheempally Srikanth

అక్కడ…

క్షణాలు యుగాలుగా గడిచిపోతుంటాయ్

రోజులు హారతి కర్పూరంలా ఆవిరవుతుంటా‌య్

అక్కడ… ప్రతి ఒక్కరి ముఖంలో

ఆందోళనల ఎదురుచూపులే

ఆరోగ్యంగా ఉండాలనే ఆరాటాలే

ఎవరో… ఎక్కడివారో… ఏ ప్రాంతంవారో…

అక్కడ బంధువుల కోసం ఎదురుచూస్తుంటారు

ఆరోగ్యసంజీవులై రావాలని ఆత్రుతపడుతుంటారు

గుండెభారంతో శ్వాసను అదిమిపట్టుకుని

ప్రతిరోజు బాధల బరువును మోస్తుంటారు

నిత్యం వేయికళ్ళతో ఎదురుచూస్తూనే

వైద్యులను క్షణక్షణం పలకరిస్తుంటారు

వాళ్ళు చిరునవ్వుతోనే సమాధానమిస్తూ

ఏమీ కాదన్నట్లు భరోసా ఇస్తుంటారు

ఇక్కడ గుండెల్లో ఏదో బాధల ముళ్ళు

రోజూ కెలుకుతూనే ఉంటుంది

మనిషికి మానని గాయమై 

మానసికరోగమై అల్లుకుంటుంది

అక్కడ… నిరీక్షించడమంటే

మరో లోకంలో జీవించడమే

నరకానికి నకలులా మారిపోయి

జీవచ్ఛవంలా బతుకును సాగించడమే

అక్కడ… ఉదయస్తమయాలు

కాలాన్ని హరిస్తూనే ఉంటాయి

రోగులు బతుకుజీవుడా అంటూ

క్షణాలను లెక్కిస్తూనే ఉంటారు

అక్కడికి వెళ్ళాలంటే

కాసింత గుండెధైర్యాన్ని పట్టుకెళ్ళాలి

అక్కడే ఉండిపోవాలంటే

నిన్ను నువ్వు మరచిపోవాలి

– డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, 9032844017

Related posts

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో చేరిక

Murali Krishna

అక్టోబర్ 2న గాంధీ ఆసుపత్రి ఎదుట గాంధీ విగ్రహావిష్కరణ

Satyam NEWS

అంబాసిడర్

Satyam NEWS

Leave a Comment