29.7 C
Hyderabad
May 2, 2024 05: 20 AM
Slider కవి ప్రపంచం

బోనం సాక !

#Mamidi Harikrishna

తల్లి పుటుకనిస్తది

బోనాల తల్లి సల్లని బతుకునిస్తది

నమ్మకమా – నిజమా ఏదైతేంది

బస్, మనిషి మంచిగుంటే సాలు గద ….

జోష్ గ, జబర్దస్తుగ జిందగీని జమాయిస్తే సాలు గద…!

ఇయ్యాల నగరం

అడ్డంగ – నిలువుగ మస్తుగ ఎదిగింది

వలపట – దాపట పుర్సత్ గ పెరిగింది

అంత్రాలు అంత్రాలుగా మబ్బుల్ని అందుకుని

కాలనీలు కాలనీలుగ భూమి కొస్సలకు చేరుకున్నది

చెర్లు మునిగి బంగ్లాలు- బస్తీలు మొలిసి

గుట్టలు కరిగి విల్లాలు, మాల్ లు అప్సోసుగ వెలిసి

కబ్జాలు, దర్జాలు, దందాలు ఆస్మాన్ ను తాకినై .!

అయితేంది?

ఆషాడం వచ్చిందంటే  సాలు

గోల్కొండ ఖిల్ల మీన తీన్మార్ డప్పు

నపీర, డోలు , తాషల సప్పుడు

డిక్కిరి డిక్కిరి డీం డీం … డిక్కిరి డిక్కిరి డీం డీం …

డిల్లేమ్ బల్లెం డీమ్ డీమ్… డించిక్ డించిక్ డీమ్ డీమ్…  

అని మోగుతది

ఇంకేమన్నా ఉన్నదా ….

పూరా హైదరబాద్ పూనకాలచ్చి శివాలూగుతది

పోతరాజు చిందులేసి పండగ ముచ్చటను ఎరకజేస్తది

బోనమెత్తి గజ్జె కట్టి పలారం బండెక్కి వాడవాడ తిర్గుతది

అమ్మతల్లికి సీరెసారెలు బెట్టి

కోడ్ని కోసి, ఆనిక్కాయ గొట్టి , పొట్టేల్ ను పడేసి

అందరికీ పంచుతది

పిల్లాజెల్లలందరిని సల్లగ కాపాడమని

దీవనార్తి పడ్తది  …

అమ్మలగన్నయమ్మకు శణార్తి పాడుతది ….!

బోనాలజాతర షురువై

లాల్ దర్వాజ, చార్మినార్,

అక్కన్న మాదన్న- దర్బార్ మైసమ్మల నుంచి

లష్కర్ ఉజ్జయిని మహంకాళి కి మొక్కులు అప్పజెప్పి

బల్కంపేట ఎల్లమ్మదాంక సాగిపోతది

అంతేనా—

దేశమంతట ఉన్న ఆడబిడ్డలను

నగరానికి రప్పిత్తది

ఆషాడం అరిష్టమో శూన్య మాసమో కాదు

ఆడోళ్ళ పాదాలకు పసుపు పూసే అదృష్ట కాలం అనిపిస్తది …

జనాలకు, జీవితాలకు మాత్రమే కాదు

మొత్తం లోకానికి ఆడబిడ్డే దిక్కు అని

యాది చేసుకునేలా చేస్తది ….!

ఇక నగరం మొత్తం కాస్మెటిక్ మేకప్పులను తీసేసి

పెద్ద ఊరుగ మారిపోతది

ఊపర్ సే ఎన్ని పౌడర్ లు రుద్దినా

పైపైన ఎన్ని నుమాయిష్ లు- నగిషీలు అద్దినా

తన అస్లీ నిషాన్ – పహ్లీ బునియాది మాత్రం

తమామ్ పల్లెనే అని మురుస్తది !

ఎన్ని సెప్తే ఏమస్తది

ఎంత జేత్తే ఏమున్నది

నువ్వేమో ఇది పండుగే కాదంటివి

ఇదంత అనాగరికం అంటివి

కాస్మోపాలిటన్ సిటీల ఇవన్నీ అవమానాలంటివి !

అందుకే ఇప్పుడు, 

కుండచుట్టూ కుంకుమ బొట్లు బెట్టి

వేపాకులు సుట్టు కట్టి, నూనెవత్తులకు దీపం పెట్టి

రేపటి తండ్లాటలన్నీ ముడుపు కట్టింది తెలంగాణ.!

బోనాన్ని తలకెత్తుకోని

సాంపి సల్లి , సాలు కట్టి, సాకుకోని

సావుకెదురు నిల్సింది నా తెలంగాణ !

ఇక, బోనం సాక –

మన అస్తిత్వ పతాక !

తెలంగాణ గడ్పల్ల పసుపు కుంకుమల దీప శిఖ !!

మట్టి బిడ్డల గుండెలల్ల ప్రవహించే రక్త రేఖ !!!

మామిడి హరికృష్ణ  8008005231

Related posts

విజయసాయిరెడ్డికి నిజంగా కరోనా సోకిందా? లేదా?

Satyam NEWS

ప్రొద్దుటూరు లో లెజెండ్ మూవీ 7 వ వార్షికోత్సవం

Satyam NEWS

ఒంగోలులో సీఎం జ‌గ‌న్ చే సున్నా వ‌డ్డీ ప‌థ‌కం ప్రారంభం…!

Satyam NEWS

Leave a Comment