37.2 C
Hyderabad
May 2, 2024 11: 24 AM
Slider కవి ప్రపంచం

తరువుతో లేదు కరువు

#K.Veena Reddy

పచ్చని చెట్టు మన ప్రగతకి మెట్టు

ప్రాణవాయువుకది ఆయువుపట్టు!

కన్నతల్లివంటిది కల్పతరువు

కాలుష్యాన్ని హరించే తెరువు!

తీయని పళ్లనిచ్చి ఆకలి తీర్చు

చల్లని నీడనిచ్చి సేదను దీర్చు!

శిశూదయానికి ఊయెలై స్వాగతించు..

అలసిన జీవనానికి మంచమై నిదురపుచ్చు..

ఆగిన జీవనానికి ఆసనమై ఎదను పరుచు..

కళేబరంతోపాటు కాలి బూడిదై తోడు నిలుచు!

పవనదేవుని వింజామరల వీచికలలో,

తన ఆకులూ పూలూ కొమ్మల కదలికలతో,

వరుణదేవుని కరుణను కరిగించి మరీ..

ధరణి పైన వానను కురిపించును తరువు!

ఆమూలాగ్రం ఆయుర్వేదానికి ఆధారమై,

పొలం దున్నే హలమై, కలం రాసే కాగితమై,

సుగంధమై, సంగీతసాధనమై, రవాణాశకటమై,

వంటచెరుకై, గృహోపకరణమై, ఊతకర్రైంది వృక్షం!

పర్యావరణానికి కారణమైనట్టి,

పశుపక్ష్యాదులకాశ్రయమైనట్టి,

ప్రకృతికి ఉపకృతి గావించు సుకృతి,

అవని ఎదపైని ఆకుపచ్చని ఆకృతి!

తనను నరికేవాడి తనువుకైనా నీడనిచ్చేది..

పరోపకారి తరువుకన్నా మిన్న మరి ఇంకేది?

అట్టి అమ్మవంటి చెట్టును నరికేస్తే ఓ నరుడా..

దేశ ప్రగతికది గొడ్డలిపెట్టగును పామరుడా..

ఆ దెబ్బ రేపు నీకూ తగిలెడిదే కదరా..

అందుకే చెట్టునాటి సంరక్షింపుము సోదరుడా!

కె. వీణారెడ్డి, హైదరాబాద్

Related posts

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన చిరంజీవి కుమార్తె సుస్మిత

Satyam NEWS

విలన్ టు హీరో: విలక్షణ నటనతో రెబెల్ స్టార్

Satyam NEWS

పాముతో సెల్ఫీ.. కందుకూరులో యువకుడు మృతి

Bhavani

Leave a Comment