39.2 C
Hyderabad
April 28, 2024 12: 31 PM
Slider కవి ప్రపంచం

ఎంత కొత్త యుద్ధమైనా పాతదే..

#Sailaja Mitra

యుద్ధం పాతదే..

ఎంత కొత్త యుద్ధమైనా పాతదే…

విమానాల్లా ఎగిరే శరీరాలు

ఆకలి మంటలకు మసి అయిపోతున్న జీవాలతో

చెడి బతుకుతున్న ఈ ప్రపంచానికి

ఎంత కొత్త యుద్ధమైనా పాతదే..

అరచేతుల్లోనే ఆవిరైపోయిన శాంతి ప్రసూనాలన్నీ

నరమేధపు దృశ్యాలై మారినప్పుడు

ఎంత కొత్త యుద్ధమైనా పాతదే..

ధనాధికారపు ట్రంకు పెట్టెలో ఆత్మాభిమానాలన్నీ  

ఊపిరాడక తన్నుకులాడుతున్నప్పుడు

ఎంత కొత్త యుద్ధమైనా పాతదే..!

నాలుగు వేదాల, దిక్కుల జ్వలనాల్లో

తన,మన,పరతమ స్వారూప్య కట్టడాలన్నీ

శిధిలాలుగా మారిపోయి,

ఏ తునక ఏ దేహానిదో గుర్తుపట్టలేనంతగా

మారిపోయినప్పుడు

ఎంత కొత్త యుద్ధమైనా పాతదే..

భయపడుతూ జీవించే జీవాలకు

బాధపడుతూ కనిపించే బంధాలకు పెద్ద తేడా లేదు.

ఆధిపత్యం,అధికారం  నిరంకుశధోరణిని

కొమ్ముకాసే కోరల్లో

వేరొకరి రక్తాన్ని చూసి ఆనందించే తత్త్వాలు,

మరొకరిపై జరిగే దాడి దృశ్యీకరణలు

కాష్టం నుండి కడుపులు నింపుకునే యత్నాలు

కూలిపోతున్న సంస్కారాలు

రాలిపోతున్న ప్రాణాలూ

మన ఉనికికి ఆనవాళ్ళయినప్పుడు

ఎంత కొత్త యుద్ధమైనా పాతదే..

మీకు తెలియదేమో..మనిషి

తనకే తెలియకుండా అత్యాశలకు పోయి

ఎప్పుడో అశువులు బాసాడు..

జరుగుతున్న శవాల యాత్రలో ఎవరైనా ఒకటే కదా..!

అప్పుడు ఎంత కొత్త యుద్ధమైనా పాతదే కదా..!

మనమంతా కంటే

మనమెంత నయమనిపిస్తున్నప్పుడు

ఎంత కొత్త యుద్ధమైనా పాతదే..! 

శైలజామిత్ర, హైదరాబాద్

Related posts

ఎనాలసిస్: పైపైకి ఎగబాకుతున్న కరోనా కేసులు

Satyam NEWS

20న హైదరాబాద్ వస్తున్న మోటివేషనల్ స్పీకర్ రాజ్ దీదీ

Satyam NEWS

కార్యకర్త కుటుంబానికి 2 లక్షల బీమా సొమ్ము

Satyam NEWS

Leave a Comment