అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతి కీలకమైన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 18 మంది ముఖ్యమంత్రి జగన్ కు షాక్ ఇచ్చారు. ఒక్క సారిగా కళ్లు తేలేసే ఈ లెక్క పార్టీలోని డొల్లతనాన్ని వెల్లడి చేసింది. మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు కీలక సమయంలో సభకు హాజరు కాలేదు.
ముఖ్యమంత్రి జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కౌన్సిల్ రద్దు తీర్మానానికి ఇంత మంది ఎమ్మెల్యేలు రాకపోవడం పార్టీ క్రమ పద్ధతిలో నడవడం లేదని స్పష్టం చేస్తున్నది. ప్రధాన ప్రతిపక్షం సభలో లేకపోవడం, పూర్తి స్థాయి మెజారిటీతో ఉండటం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ 18 మంది ఎమ్మెల్యేలు సభకు కీలక సమయంలో గైర్హాజర్ కావడం మాత్రం కల్లోల పరిచే విషయమే.
మండలి తీర్మానానికి అనుకూలంగా 133 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా ఒక్కటి కూడా లేదు. అదే విధంగా తటస్థంగా కూడా ఎవరూ లేరు. అసెంబ్లీలో వైసిపికి ఉన్న బలం 151 మంది. స్పీకర్ ను తీసేస్తే వైసిపి బలం 150 కాగా జనసేన ఎమ్మెల్యే తో కలుపుకుంటే 151 మంది. అంటే 18 మంది వైసిపి ఎమ్మెల్యేలు సభకు ఎగనామం పెట్టారు. ఇది చాలా సీరియస్ విషయం. ఫ్లోర్ కో ఆర్డినేషన్ ఘోరంగా విఫలం అయినట్లుగా లెక్క.
ఇది కేవలం ఇంత వరకే పరిమితమా లేక ఇంకా ముందు పెద్ద సమస్యగా పరిణమిస్తుందా అనేది వేచి చూడాల్సిన అంశం. ప్రస్తుతం ఉన్న కౌన్సిల్ వై ఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చిన కౌన్సిల్ కాగా దాన్ని వై ఎస్ జగన్ రద్దు చేయించడాన్ని జీర్ణించుకోలేక ఎమ్మెల్యేలు రాలేదని కొందరు అంటున్నారు.
ఇదే నిజమైతే మరిన్ని సమస్యలు ముందు ఉంటాయి. ముందు 121 అని ప్రకటించి ఆ తర్వాత 133 అని శాసనసభ సిబ్బంది ప్రకటించారు. ఇది కూడా ఘోర తప్పిదం. ఇది కౌంటింగ్ లో లోపమా లేక నిజంగానే 121 మందే ఉన్నారా అనేది కూడా అనుమానమే. తెలుగుదేశం పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇద్దరు లాబీల్లోనే ఉన్నారు తప్ప సభలోకి రాలేదు.