42.2 C
Hyderabad
April 26, 2024 16: 42 PM
Slider మెదక్

సోషల్ మీడియా గందరగోళం కొన్నాళ్లే: నిలబడేది ప్రధాన మీడియానే

#Padma Devender Reddy

గత కొంతకాలంగా సోషల్ మీడియా సృష్టిస్తున్న గందరగోళంతో ప్రస్తుతం ప్రధాన మీడియా దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటుందని, అయితే ఇది తాత్కాలిక పరిణామం మాత్రమేనని మునుముందు ప్రజల్లో సుస్థిరంగా నిలబడేది ప్రధాన మీడియేనని మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మెదక్ శాసన సభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నాడు మెదక్ పట్టణంలోని టీఎన్జీవోల సంఘం భవన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) జిల్లా ద్వితీయ మహాసభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

సంచలనాల కోసం తప్పుడు సమాచారాన్ని అందిస్తూ సమాజాన్ని తప్పు దోవ పట్టిస్తున్న సోషల్ మీడియాపై ఇప్పటికే ప్రజలు విరక్తి చెందిపోయారని, రాబోవు రోజుల్లో ఖచ్చితంగా దానిని తిరస్కరిస్తారని పద్మ అన్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా మెతుకుసీమ ప్రజలతో మమేకమై పనిచేస్తూ, వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంతో పాటు ప్రజా ఉద్యమాల్లో పాలుపంచుకుంటున్న టీయూడబ్ల్యూజేకి సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం ఉందని ఆమె కొనియాడారు. సంఘానికి ఉన్న గౌరవానికి మచ్చ తేకుండా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని జర్నలిస్టులకు ఆమె సూచించారు.

మెదక్ పట్టణంలో దాదాపు 115మంది జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించడమే కాకుండా, డబుల్ బెడ్ రూం ఇళ్ళతో ప్రత్యేక కాలనీ నిర్మించినట్లు ఆమె తెలిపారు. దీంతో పాటు రామయంపేట, నిజాంపేట, అల్లదుర్గం జర్నలిస్టులకు సైతం త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరీ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. జర్నలిస్టుల ప్రధాన సమస్య అయిన ఆరోగ్య పథకం అమలుకు సంబంధించి ఆరోగ్య మంత్రి హరీష్ రావుతో చర్చిస్తానని పద్మ హామీ ఇచ్చారు.

సభకు గౌరవ అతిథిగా హాజరైన టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ మాట్లాడుతూ, మెతుకుసీమ వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంతో తనకు మూడున్నర దశాబ్దాల బంధం ఉందన్నారు. జర్నలిజంలో తనకు ఓనమాలు దిద్దించి, వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమం వైపు అడుగులు వేయించిన తన పురిటిగడ్డ మెతుకుసీమకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతూ దేశంలో ఐజేయూ, రాష్ట్రంలో టీయూడబ్ల్యూజే సంఘాలు మాత్రమే వేలాది జర్నలిస్టుల విశ్వాసం చూరగొన్నాయని విరాహత్ స్పష్టం చేశారు.

జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్ చారీ అధ్యక్షతన జరిగిన ఈ సభలో టీఎన్జిఓల సంఘం జిల్లా అధ్యక్షుడు నరేందర్, జిల్లా కార్యదర్శి బుక్క అశోక్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు డి.జి.శ్రీనివాస్ శర్మ, కే. శ్రీనివాస్, కంది శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు నాగరాజు, రాజశేఖర్, శ్రీధర్ తదితరులతో పాటు 250మంది పాత్రికేయులు పాల్గొన్నారు.

Related posts

పోరుమామళ్ల వద్ద 23ఎర్రచందనం దుంగలతో 5గురు అరెస్టు

Satyam NEWS

రాజధాని ప్రాంతం లో మరో రైతు ఆత్మహత్య

Satyam NEWS

రాష్ట్రంలో మతతత్వ పార్టీలకు స్థానమే లేదు

Bhavani

Leave a Comment