30.7 C
Hyderabad
April 29, 2024 03: 41 AM
Slider సంపాదకీయం

ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి డైలాగ్ లా జగన్ పాలన

jagan y s

మా నుంచి అక్రమంగా 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని మంత్రి పదవులు కూడా ఇచ్చిన చంద్రబాబునాయుడికి దేవుడు తగిన బుద్ధి చెప్పాడు. కరెక్టుగా 23 మంది మాత్రమే గెలిచారు. దేవుడు సరిగ్గానే స్క్రిప్టు రాశాడు అని వైసిపి శాసనసభ్యులతో జరిగిన తొలి సమావేశంలో ఏపి సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. తాము ఎట్టిపరిస్థితుల్లో అలాంటి పనులు చేయబోమని కూడా ఆయన స్పష్టం చేశారు.

తమ పార్టీలోకి రావాలంటే ఉన్న పార్టీకి, దాని ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేసి రావాల్సిందేనని కరాఖండిగా చెప్పారు. ఈ ప్రకటన విన్న తర్వాత రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషించారు. ఆహా ఇలాంటి సిఎం కదా మేం కోరుకున్నది అని గర్వించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి, స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుపడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబునాయుడిని వదిలించుకున్నందుకు ఎంతో సంతోషించారు.

ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయించి బిజెపిలో చేరారు. అప్పటి వరకూ పార్టీ ఫిరాయింపులపై ఆదర్శాలు వల్లెవేసిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఇలా ఫిరాయించి వచ్చిన రాజ్యసభ సభ్యులపై వేటు వేయకుండా, అప్పటి వరకూ తాను చెప్పిన ఆదర్శాలకు భిన్నంగా వారికి బిజెపి సభ్యత్వం ఇచ్చేశారు. ఈ మొత్తం సంఘటనపై ఏపి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానిస్తూ తాను వెంకయ్యనాయుడి స్థానంలో ఉంటే అలా చేసి ఉండేవాడిని కాదని చెప్పారు.

ఆ సమయంలో ఆహా ఇలాంటి స్పీకర్ కదా ఉండాల్సింది. అంటూ ఏపి ప్రజలు ఎంతో ఆనందించారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలను లోబరుచుకుంటూనే ఉన్నారు. పార్టీ ఫిరాయించకుండా అలానే ఉంచి ఆ పార్టీ నాయకుడికి చెప్పులో రాయిలా, చెవిలో జోరీగలా ఎప్పటికీ చీకాకు ఉండేలా చేస్తున్నారు.

వారే తిరుగుబాటు చేస్తున్నట్లు చిత్రీకరించి, చట్టబద్ధంగా వారిని ప్రత్యేక సభ్యులుగా గుర్తింపు ఇస్తున్నారు. తాజాగా శాసన మండలిలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ సభ్యులను లొంగదీసుకున్నారు. వారు తెలుగుదేశం తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసేలా చేశారు. జన సేన పార్టీ నుంచి గెలిచి ఒకే ఒక ఎమ్మెల్యేను కూడా దగ్గరకు పిలుచుకుని మాట్లాడుతున్నారు. జనసేన పార్టీకి వ్యతిరేకంగా ఆయన పనిచేసేలా ప్రోత్సహిస్తున్నారు. చేసేశారు కూడా.

ఇవన్నీ చట్టానికి దొరకని నేరాలే అంటే తప్పా? రాజధాని అమరావతి విషయంలో కూడా అంతే. రాజధాని ని అమరావతి నుంచి తరలించేసి విశాఖ పట్నంలో రాజధాని పెట్టేసి, రాజధానిని ఎవరు తరలించారు? అమరావతిలోనే ఉందిగా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. చట్టబద్ధంగా మాత్రం రాజధాని అమరావతే. అక్కడ ఏడాదికి రెండు సార్లో మూడు సార్లో ఉండే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తూ రోజు వారీ కార్యకలాపాలను విశాఖకు తరలించేశారు.

 ఎవరు కోర్టుకు వెళ్లినా రాజధాని అమరావతిలోనే ఉంది చూడండి అంటూ అక్కడి భవనాలు చూపిస్తారు. అసెంబ్లీ బిల్డింగ్ చూపిస్తారు. సెక్రటేరియేట్ లో వాచ్ మెన్ లను చూపిస్తారు. కోర్టులు కూడా ఏమీ చెప్పలేని విధంగా అంతా చట్టబద్ధంగా చేస్తున్నారు. అదేదో ఒక సినిమాలో చిరంజీవి ఒక ఛాలెంజ్ చేస్తాడు. ఏడాదిలో కొన్ని కోట్లు సంపాదిస్తానని…ఒక సందర్భంలో హీరో యిన్ అడుగుతుంది. నీవు చేసేది న్యాయమా? అని. దానికి సమాధానంగా ఆ చిరంజీవి క్యారెక్టర్ చెబుతుంది- నేను చట్టబద్ధంగా డబ్బు సంపాదిస్తాను అని చెప్పాను తప్ప న్యాయబద్ధంగా డబ్బు సంపాదిస్తాను అని చెప్పలేదు అని. అది సినిమా కాబట్టి ఆ డైలాగు సరిపోయింది. అయితే ప్రభుత్వం చట్టంతో బాటు న్యాయబద్ధంగా కూడా ఉండాలి. జగన్ ప్రభుత్వం ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగ్ చెబుతున్నది.

Related posts

జగన్ ఇంటి భద్రతా సిబ్బందికి కరోనా పాజిటీవ్

Satyam NEWS

భారీ వర్షాలకు జిల్లా యంత్రాంగం అప్రమత్తం

Satyam NEWS

Analysis: అటూ ఇటూ కమలానికి ‘కాపు’ రెక్కలు

Satyam NEWS

Leave a Comment