29.7 C
Hyderabad
May 2, 2024 03: 18 AM
Slider సంపాదకీయం

సోము వీర్రాజూ… ఏమిటీ ఈ అపరిపక్వ వ్యాఖ్యలు?

#SomuVeerraju

అసలే అంతంత మాత్రంగా ఉన్న బిజెపి జనసేన సంబంధాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అపరిపక్వ ప్రకటనలతో ప్రమాదకర పరిస్థితులకు చేరుకుంటున్నాయి. తిరుపతి లోక్ సభ స్థానం నుంచి తామే పోటీ చేస్తున్నామని ఏకపక్షంగా ప్రకటించిన సోము వీర్రాజు జన సేన పార్టీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు.

ఇప్పుడు తాజాగా బిసిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించి నాలిక కరుచుకున్నారు. ఒక్క రోజులో మాట మార్చినా కూడా సోము వీర్రాజు చేసిన ప్రకటనతో జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ పార్లమెంటు స్థానాలలో బిజెపి పోటీ చేయాలని, ఎక్కువ అసెంబ్లీ స్థానాలలో జన సేన పోటీ చేయాలని ఇరు పార్టీ ల మధ్య ఒప్పందం కుదిరింది.

సోముకు ఢిల్లీ పెద్దల అక్షింతలు

ఆ ఒప్పందం మేరకు ముఖ్యమంత్రి అభ్యర్ధి జన సేన నుంచి ఉంటారు. అలాంటి పదవికి ఎవరు ఉండాలో సోము వీర్రాజు ముందే నిర్ణయించడంపై జన సేన కార్యకర్తలు ఒక్క సారిగా మండిపడ్డారు. ఢిల్లీకి ఫిర్యాదు కూడా చేయడంతో ఢిల్లీ బిజెపి పెద్దలు సోము వీర్రాజుకు అక్షింతలు వేసినట్లు తెలిసింది.

దాంతో ఆయన తన మాటలను మార్చుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యణ్ ఎక్కువ సీట్లు సాధిస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి ఇప్పటి నుంచే వ్యతిరేకంగా పని చేయడం ద్వారా సోము వీర్రాజు ఇరు పార్టీల ఉమ్మడి అంగీకారానికి దెబ్బ కొట్టారని జన సేన నాయకులు భావిస్తున్నారు.

అమరావతిపై కూడా పవన్ ను ఇరుకున పెట్టిన సోము

ఇప్పటికి మాట మార్చి సర్దుకున్నా సోము వీర్రాజు మనసులో ఏముందో అర్ధం అయిందని జనసేన నాయకులు అంటున్నారు. ఇది విపరీత పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందని కూడా వారు అంటున్నారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కాగానే అమరావతి రాజధానిపై వివాదాస్పద ప్రకటన చేసిన సోము వీర్రాజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఇరకాటంలో పెట్టారు.

ఆ తర్వాత చాలా సందర్బాలలో జనసేనను ఇరుకున పెట్టే విధంగానే సోము వీర్రాజు ప్రవర్తించారని జనసేన నాయకులు అంటున్నారు. ఈ దశలో తిరుపతి లోక్ సభ స్థానానికి అభ్యర్ధి ఎంపిక విషయం రావడంతో బిజెపి చేసిన ప్రకటనను జనసేన అడ్డుకున్నది.

దాంతో సంయుక్త అభ్యర్ధిని నిలబెడదామని సోము వీర్రాజు ప్రకటించి వివాదాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. అయితే జనసేనను వెన్నుపోటు పొడిచే విధంగానే సోము వీర్రాజు ప్రవర్తిస్తున్నారని జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ కు ఇటీవల జరిగిన సమావేశంలో ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు.

తాజా ప్రకటనతో సోము వీర్రాజు కుట్ర బయటపడిందని కూడా వారు అంటున్నారు. అతి పెద్ద జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనాలోచితంగా చేస్తున్న వ్యాఖ్యలు తమకు తలనొప్పి తెచ్చి పెడుతున్నాయని జనసేన నేతలు ఆక్షేపిస్తున్నారు.

Related posts

అర్చకులకు తీపికబురు: గౌర‌వ వేతనం రూ. 10 వేల‌కు పెంపు

Bhavani

టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక, శ్రామిక,కర్షక పక్షపాతి

Satyam NEWS

అంధ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కల్పించాలి

Satyam NEWS

Leave a Comment