31.7 C
Hyderabad
May 2, 2024 08: 35 AM
Slider ప్రత్యేకం

క్లారిటీ: జగన్, మంత్రుల ఆరోపణలకు స్పష్టమైన సమాధానం

Nimmagandda letter

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పున: సమీక్షించే అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ రాసిన లేఖకు సమాధానమిచ్చారు.

తాను ఎన్నికలను నిర్వర్తించకపోవడం వల్ల 14 వ ఆర్ధిక సంఘం నిధులు రాకుండా పోతాయని విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇదే విషయాన్ని తన లేఖలో ప్రముఖంగా ప్రస్తావించారు.-సత్యం న్యూస్- ఆర్ధిక శాఖ కార్యదర్శిగా పని చేసిన అనుభవం తోనూ రాజ్ భవన్ లో ఆర్ధిక సంఘం అంశాలను అజమాయిషీ చేసిన అనుభవంతో చెబుతున్నాను అంటూ ఎన్నికల నిర్వహణ ఒక్కటే నిధుల విడుదలకు అడ్డంకిగా ఉండదని ఆయన స్పష్టం చేశారు.

ఎన్నికలు నిర్వహించిన తర్వాత కూడా గత సంవత్సరపు నిధులను తెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో కావాలంటే తన వంతు సాయం అందిస్తానని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెబితేనే ఎన్నికల నిర్వహణకు ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి సౌకర్యంగా ఉండే విధంగా కుదించిన ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయాన్ని రమేష్ కుమార్ గుర్తు చేశారు. ఇంత చేసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం భద్రతాపరమైన అంశాలలో ఏం చేసిందో అందరికి తెలుసునని, తాను మరింత వివరంగా చెప్పదలచుకోలేదని ఆయన అన్నారు.

కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ , ఒడిసా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆపివేశారని ఆయన గుర్తు చేశారు. గోవాలో కూడా ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల సంఘం కమిషనర్లకు ఒక సమాచార గ్రూప్ ఉందని-సత్యంన్యూస్- దాదాపుగా అన్ని విషయాలూ అందులో చర్చించుకుంటామని రమేష్ కుమార్ వివరించారు.

రాష్ట్ర ఎన్నికల కమీషన్ WHO హెచ్చరికలను, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను పాటిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. కరోనా ఛాలెంజ్ ఎదుర్కుంటున్న ప్రస్తుత దశలో ఏపీ ఒంటరిగా ఉండజాలదని ఆయన పేర్కొన్నారు. తాను రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడకుండానే నిర్ణయాలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలను పరోక్షంగా రమేష్ కుమార్ ప్రస్తావించారు.

చీఫ్ సెక్రటరీ నీలం సహానీకి కరోనా వైరస్ పై కేంద్ర ప్రభుత్వ సూచనలు పాటించమని చెప్పినట్లు రమేష్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ కార్యదర్శితో కూడా తానే స్వయంగా మాట్లాడినట్లు రమేష్ కుమార్ తన లేఖలో స్పష్టం చేశారు. (ఈ ఇద్దరు అధికారులతో కూడా రమేష్ కుమార్ మాట్లాడలేదని ముఖ్యమంత్రి చెప్పారు) తానే స్వయంగా మాట్లాడినా రాష్ట్ర ఆరోగ్య శాఖ తనకు ఎలాంటి సమాచారం పంపలేదని అందువల్ల ఎన్నికల సంఘం పైనే నెపం వేయడం సబబు కాదని రమేష్ కుమార్ స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించినందుకు రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అభినందించారు. అయితే కరోనా వైరస్ అనేది ఒక దశ నుంచి మరొక దశకు అత్యంత వేగంగా విస్తరిస్తుందనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య ఉండాల్సిన కనీస దూరం విషయం ఎన్నికల సందర్భంగా పాటించే అవకాశం ఉండదు కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలను ఉల్లంఘించినట్లు కాకూడదనే ఎన్నికలను వాయిదా వేసినట్టు ఆయన వివరించారు.

కరోనా వైరస్ పై నేషనల్ టాస్క్ ఫోర్సు ఇచ్చిన తాజా నివేదికను కూడా చూడాలని ఆయన నీలం సహానీకి సలహా  ఇచ్చారు. భారత్ రెండో దశ లోకి వెళ్లిపోతున్నట్లుగా ప్రకటించేశారని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. 14వ ఆర్థిక సంఘం నిధుల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అవసరమైన డాక్యుమెంట్లను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుందని, కావాలంటే సలహాలు కూడా ఇస్తుందని రమేష్ కుమార్ వెల్లడించారు.

( 14వ ఆర్ధిక సంఘం నిధులు మురిగిపోతాయని చంద్రబాబు డైరెక్షన్ వల్లే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇలా నిధులను మురిగిపోయేలా చేస్తున్నారని సగానికి పైగా మంత్రులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే-సత్యం న్యూస్) 14వ ఆర్ధిక సంఘం నిధులను ఎన్నికల నిర్వహణ కారణంతో పొందలేకపోతున్నట్లు చెబుతున్న రాష్ర్టాలు చాలా ఉన్నాయని ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదని రమేష్ కుమార్ చెప్పారు.

సహేతుక కారణాలు చూపించి అన్ని రాష్ట్రాలూ కలిసి వెళ్లి అడిగితే నిధుల విడుదల సమస్య కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ ను మీరు అదుపులోకి తీసుకువస్తే ఎన్నికలను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఒంటరి కాదని ఎన్నికల సంఘాల బలమైన సమూహం ఉందని రమేష్ కుమార్ తెలిపారు.

తమ సమూహం అన్ని విషయాలనూ కూలంకషంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన వివరించారు. తనపై వ్యక్తిగతంలో దారుణమైన విమర్శలు చేస్తున్నారని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వివాదంలోకి లాగేందుకు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రమేష్ కుమార్ ఆక్షేపించారు.

మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిసా రాష్ట్రాలు స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకున్న తర్వాతి రోజు తాను నిర్ణయం తీసుకున్నట్లు రమేష్ కుమార్ స్పష్టం చేశారు. రాజ్యంగ విధులను నిర్వర్తించడంలో గానీ, ఎన్నికల సంఘం గౌరవాన్ని పరిరక్షించడంలో గానీ తాను వెనకడుగు వేసే ప్రశ్నేలేదని ఆయన అన్నారు.

ప్రస్తుతం వస్తున్న ఆరోపణలను ఖండించాల్సిన బాధ్యత ఉన్నందున ఇంత వివరంగా చెబుబుతున్నట్లు ఆయన తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అవసరమైన మేరకు మీకు, రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందివ్వడానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

Related posts

అభిమానికి బాలయ్య బాబు అభిమానుల నివాళి

Satyam NEWS

కరోనా హెల్ప్:నిరుపేద కుటుంబాలకు ఆపన్నహస్తం

Satyam NEWS

బీహార్ లో మళ్లీ అధికారం నితీష్ కుమార్ దే

Sub Editor

Leave a Comment