28.6 C
Hyderabad
September 20, 2020 12: 14 PM
Slider ప్రత్యేకం

Analysis: కరోనా కంగనా మధ్యలో శివసేన

#SushanthSinghRajput

బాలివుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు రాజకీయ రంగస్థలంపై రకరకాల రంగులు పులుముకుంటోంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా? హత్యకు గురి అయ్యాడా? అనే అసలు కేసు పక్కకు వెళ్ళిపోయింది.

కొత్త కేసులు బుక్ అవుతున్నాయి. ముందుగా ఈ కేసు తేల్చిన తర్వాత, మిగిలిన కేసుల పనిపట్టవచ్చు. అది జరగడం లేదు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అనేక కోణాలు బయటపడుతున్నాయంటూ,  చిత్ర విచిత్రమైన మలుపులు తిప్పుతున్నారు.

యాక్షన్ ప్యాక్ డ్ సినిమాలా మారిన కేసు

చివరకు, ఇది బిజెపి వర్సెస్ శివసేన, కేరాఫ్ బీహార్ ఎన్నికలుగా సాగుతోంది. కంగనా రనౌత్ ప్రతిరోజూ వార్తల్లోకి ఎక్కుతోంది. ఈ పరిణామాల్లో తమ ఉనికిని చాటుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ కూడా మధ్య మధ్యలో గొంతు సవరిస్తోంది.

 సుశాంత్ మృతి కేసు క్రైమ్, సినిమా, పాలిటిక్స్ కలగవలసిన యాక్షన్ సినిమాలాగా సందడి చేస్తోంది. ముంబయిలో డ్రగ్స్ అంశం కొత్త కానేకాదు. ఇప్పుడే  కొత్తగా బయటకు వచ్చిన విషయం అస్సలు కాదు.

ఇదంతా ఏంటంటే కేవలం రాజకీయం, రాజకీయం,రాజకీయం. మహారాష్ట్ర -బీహార్ -హిమాచల్ ప్రదేశ్ -ఢిల్లీ చుట్టూ ఈ రాజకీయాలు తిరుగుతున్నాయి. కంగనా రనౌత్, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం ఊపందుకుంది. సాక్షాత్తు బిజెపి పెద్దలంతా కంగనా వైపు ఉన్నారు.

నిప్పు రగిల్చిన ముంబయిపై వ్యాఖ్యలు

దీనితో, ఆమె స్వరం మరింత పెరిగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ తో ముంబయిని పోలుస్తూ, కంగనా చేసిన వ్యాఖ్యలు శివసేనను, ఉద్ధవ్ ఠాక్రేను మరింత వేడిక్కించాయి. ఏదో ఒక రోజు సిఎం మాస్క్ తీసి రాజకీయాలు మాట్లాడుతానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి తాజాగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

కరోనాతో పాటు రాజకీయ సంక్షోభంతోనూ పోరాటం చేయవలసి వస్తోందని ఉద్ధవ్ అంటున్నారంటే, వాతావరణం ఎంత వేడెక్కిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. కరోనా ఒక వైపు – కంగనా ఒక వైపుగా మహారాష్ట్ర రాజకీయాలు రగిలిపోతున్నాయి.

కంగనా రనౌత్ కార్యాలయ భవనాన్ని  అక్రమ నిర్మాణంగా ఆరోపిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసింది. కంగనా వెనకాల బిజెపి పెద్దలు ఉన్నారన్న విషయం శరద్  పవార్ చెప్పేంతవరకూ ఉద్దవ్ ఠాకరేకు తెలియకపోవడం, ఒకవేళ తెలిసివున్నా, భవనాన్ని కూలదోయడం ఈ సమయంలో అంత తెలివైన పని కానే కాదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

బిజెపికి బీహార్ ఎన్నికలే ప్రధానాంశం

ఈ మహారాష్ట్ర రాజకీయాలు ఇలా సాగుతుండగా, అసలు అంశం బీహార్ ఎన్నికలని సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. త్వరలో బీహార్ లో  ఎన్నికలు జరుగనున్నాయి. జెడియు, బిజెపి సంకీర్ణ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా, బిజెపి నేత సుషీల్ కుమార్ మోదీ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఈసారి ఎన్నికలకు కూడా ఇదే రీతిలో సంకీర్ణంగానే  ఎన్నికల బరిలో నిలుస్తారని చెప్పాలి. బిజెపి తన వ్యక్తిగత బలాన్ని పెంచుకోడానికీ కసరత్తు  చేస్తోంది. 2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకూ అనేక తఫాలుగా నితీష్ కుమార్  ముఖ్యమంత్రిగా ఉన్నారు.

నిజాయితీపరుడుగా పేరు ఉన్నప్పటికీ, ఇన్నేళ్ల తన పాలనలో, బీహార్  పెద్దగా అభివృద్ధి చెందిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. వెనుకబడిన రాష్ట్రంగానే మిగిలివుంది. ఈ క్రమంలో, రేపు జరగబోయే ఎన్నికల్లో ఎంతవరకూ విజయం సాధిస్తామనే అనుమానం కొంత బిజెపి -జెడియు సంకీర్ణ ప్రభుత్వాన్ని పీడిస్తోంది.

కులాల కుమ్ములాటకు అందరూ సిద్ధమే

ఆర్ జె డి,కాంగ్రెస్ ఒక వైపు -బిజెపి, జెడియు సంయుక్తంగా  మరొక వైపు ఎన్నికల రణక్షేత్రం రూపు దిద్దుకుంటోంది. సుశాంత్ సింగ్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజ్ పుత్ (క్షత్రియ) సామాజిక వర్గానికి చెందినవాడు. బీహార్ లో శత్రుఘ్నసిన్హా తర్వాత అంత క్రేజు తెచ్చుకున్న పాపులర్ హీరో.

బీహారీల మనిషిగా నితీష్ కుమార్ ముద్రవేసుకున్నాడు. బీహారీ అస్మితకు తాము కూడా నిలబడి ఉన్నామని బలంగా నిరూపించుకొని, బీహారీల హృదయం గెలవాలనే ఆలోచనలో బిజెపి వుంది. సుశాంత్ సింగ్ మరణం కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని బిజెపి ముందుకు వెళ్తోంది.

ఈ కేసు దర్యాప్తులో మహారాష్ట్ర శివసేన ప్రభుత్వం వైఫల్యం చెందిందని, తాము ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, అత్యున్నత స్థాయిలో దర్యాప్తు చేసి, అన్ని విభాగాలను ఏకం చేసి, ఛేదించి బీహారీ హీరోవైపు మేము నిల్చున్నామని చాటి చెప్పుకుంటూ, రేపటి ఎన్నికల్లో ప్రయోజనం పొందడం కోసమే బిజెపి రాజకీయ కుట్ర పన్నుతోందని ఉద్దవ్ ఠాక్రే ఆరోపిస్తున్నారు.

కేసును మలుపులు తిప్పుతున్న కమలనాథులు

అటు బీహారీల, రాజ్ పుత్ ల హృదయాలు గెలవడం, ఇటు ఆర్ జె డిని అధికారంలోకి రాకుండా ఓడించడం, శివసేన ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడం మొదలైన వ్యూహాలతోనే ప్రస్తుతం సుశాంత్ కేసును  బిజెపి ఇన్ని మలుపులు తిప్పుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదే సమయంలో, రాజకీయమైన ప్రయోజనాల కోసం వ్యవస్థలను ఇంతగా దుర్వినియోగం చేయడం గతంలో ఎన్నడూ లేదని, ఈ తరహా విధానాలు కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భవిష్యత్తులో ఎటువంటి దుష్పరిణామాలవైపు తీసుకెళ్తాయో, అని కొందరు మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏ కేసు ఎప్పుడు పైకి తీస్తారో, ఏ కేసు ఎప్పుడు తొక్కి ఉంచుతారో, ఎప్పుడు మూస్తారో  ఏలినవారికి,  ఏలుతున్నవారికే తెలుస్తుందని సామాన్య ప్రజలు సైతం ఆలోచిస్తున్నారు. రాజకీయాల్లో నేరచరితులు పెరుగుతూ ఉండడంతో పాటు, దర్యాప్తు వైఖరులు ఇంతగా మారిపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి మంచిది  కాదు.

తప్పు చేసినవారికి తప్పకుండా శిక్ష పడాలి. డ్రగ్స్ వంటి ప్రమాదకరమైన ధోరణులను అరికట్టడం కూడా అంతే ముఖ్యం. ప్రతి విషయాన్నీ రాజకీయ ప్రయోజనంతోనే ముడివేయడమే బాధాకరం.సుశాంత్ కేసు ప్రశాంతమవుతుందా, సశేషం అవుతుందా రాజకీయ తెరపై చూడడమే తరువాయి.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

కొవిడ్ మాస్క్ ల తయారీలో నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్

Satyam NEWS

రేపు మహారాణా ప్రతాప్ సహకార బ్యాంకు ఎన్నికలు

Satyam NEWS

గ్రామీణ ప్రాంతాలకు ఉచిత హైస్పీడ్ ఇంటర్ నెట్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!