గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసిన చంద్రబాబునాయుడు ఆ పార్టీకి పెద్ద ఎత్తున నిధులు సమీకరించి పంపినట్లు ఇటీవల జరుగుతున్న ఐటి దాడులలో కీలక పత్రాలు దొరుకుతున్నాయి. అనధికారిక సమాచారం మేరకు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో పోటీ చేస్తున్న బిజెపీయేతర పార్టీలకు చెందిన అభ్యర్ధులకు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ లకు సన్నిహితంగా ఉండే వారి నుంచి ఫండ్స్ వెళ్లినట్లు ఆధారాలు లభించాయని తెలిసింది.
కడపలో జరిగిన ఐటి దాడుల్లో తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ముఖ్య నేతలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చినట్లు వెల్లడి అయింది. అదే విధంగా వందల కోట్ల రూపాయల బినామీ ట్రాన్సాక్షన్లు జరిగినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ప్రాధమిక సాక్ష్యాధారాలు దొరికినట్లు గా తెలిసింది. గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడుల్లో వెలికి వస్తున్న ఈ నిజాలపై త్వరలో ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగే అవకాశం ఉంది.
పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు ప్రాధమిక విచారణలో తేలినందున ఈ నిధులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవా లేక విదేశాల నుంచి వచ్చినవా అనే కోణంలో ఈడీ పరిశోధన జరుపుతుంది. ఈడీ పరిశోధనలో మనీ లాండరింగ్ నిజమని తేలితే సంబంధిత వ్యక్తులను అరెస్టు చేసి వారి ఆస్తులను ఎటాచ్ చేసుకుంటారు. గత నాలుగు రోజులుగా కడప, విజయవాడ, హైదరాబాద్ లలో పలు కంపెనీలు వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.
కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఆయనకు చెందిన కంపెనీలపై హైదరాబాద్ పంజాగుట్ట ప్రాంతంలో దాడులు చేశారు. అదే విధంగా బంజారాహిల్స్ లోని ఎవెక్సా కార్పొరేషన్ లో కూడా ఐటి దాడులు జరిగాయి. ఈ కంపెనీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్ కు చెందినది. అదే విధంగా చంద్రబాబునాయుడి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన కిలారి రాజేష్ కంపెనీలపై కూడా ఐటి దాడులు జరిగాయి.
కిలారి రాజేష్ జూనియర్ ఎన్టీఆర్ కు, ఆయన మామ కు కూడా అత్యంత సన్నిహితుడు. అదే విధంగా లోకేష్ కు కూడా అతను అత్యంత నమ్మకస్తుడు. డిఎన్ సి ఇన్ ఫ్రా కంపెనీ కి చెందిన నరేన్ చౌదరి పై కూడా ఇన్ కం టాక్సు అధికారులు వల విసరగా అందులో కూడా పెద్ద ఎత్తున ఆర్ధిక అవకతవకలు దొరికాయి. నరేన్ చౌదరి కిలారి రాజేష్ కు సన్నిహితుడు. ఈ వ్యక్తులు, వారి కంపెనీల వద్ద చంద్రబాబునాయుడు ఎన్నికలలో ఉపయోగించిన హెలికాప్టర్ బిల్లులు కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులకు దొరికినట్లు తెలిసింది. అన్ని లింకులు ఎస్టాబ్లిష్ అయితే నేరుగా చంద్రబాబునాయుడికి, ఆయన కుమారుడికి కూడా తలనొప్పులు తప్పవు.