38.2 C
Hyderabad
May 3, 2024 20: 13 PM
Slider ప్రత్యేకం

వైసీపీకి చావుదెబ్బ: టీడీపీ ఘన విజయం

#panchumarthianuradha

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి చావుదెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ ఘన విజయం సాధించారు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం ఏడుగురు ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. మొత్తం 175 మంది శాసనసభ్యులు ఉన్నందున ఒక్కో అభ్యర్థి గెలుపుకోసం 22 మొదటి ప్రాధాన్యం ఓట్లు అవసరం.

ఏ ఇద్దరు అభ్యర్థులైనా 22 మొదటి ప్రాధాన్యం ఓట్లు పొందలేకపోతే అప్పుడు రెండవ ప్రాధాన్యం ఓట్లు కీలకం అవుతాయి. అధికార వైసీపీకి 151 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇతర పార్టీల నుంచి వచ్చి అనధికారికంగా చేరిన వారితో కలిపి ఆ పార్టీ బలం మొత్తం 156కు చేరింది. అధికార వైసీపీకి అధికారికంగా ఉన్న 151 స్థానాలతో ఆరుగురు ఎమ్మెల్సీలను గెలుచుకునే అవకాశం స్పష్టంగా ఉన్నది.

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అధికారికంగా 23 స్థానాలు ఉండగా అందులో నుంచి నలుగురు ఎమ్మెల్యేలు అనధికారికంగా పార్టీ ఫిరాయించి అధికార వైసీపీలో చేరారు. జనసేన పార్టీ నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా ఇప్పుడు వైసీపీ పంచన చేరి ఉన్నారు. ఫిరాయింపులు లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఒక స్థానం సునాయాసంగా దక్కాల్సి ఉంది. అయితే అధికార వైసీపీ పంతానికి పోయి ఏడో అభ్యర్ధిని కూడా రంగంలో దించింది.

వైసీపి నుంచి గెలుపొందిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిలు గత కొంతకాలంగా ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తామని ఇద్దరూ బహిరంగంగానే స్పష్టం చేశారు. దీంతో అధికార వైకాపాలో అలజడి మొదలైంది.

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వైకాపాకు ఓటు వేయకుంటే ఆ పార్టీకి మిగిలే బలం 154. ఆ మొత్తం సభ్యులు కచ్చితంగా అధికార పార్టీ నిలబెట్టిన ఏడుగురు సభ్యులకు ఒక్కొక్కరూ 22 ఓట్లు వేసేందుకు సరిపోతుంది. అయితే విషయం అంత సులభంగా లేదు. అధికార పార్టీని క్రాస్ ఓటింగ్ భయం వెన్నాడుతోంది. అనుకున్నట్లుగానే క్రాస్ ఓటింగ్ జరిగింది. దాంతో టీడీపీ తరపున బరిలోకి దిగిన పంచుమర్తి అనురాధ గెలుపొందారు. 23 ఓట్లు రావడంతో ఆమె విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.

Related posts

విజయనగరం లో వైభవోపేతంగా హనుమాన్ శోభాయాత్ర

Satyam NEWS

గాయపడ్డ వ్యక్తికి ఆస్పత్రికి తరలించిన పోలీసులు

Satyam NEWS

బతుకమ్మ కుంటలో డ్రైనేజీ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment