ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులను రెచ్చగొట్టి వాడుకున్నది కేసీఆర్ కాదా అని ఆయన ప్రశ్నించారు.
ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇన్ని ఉద్యోగాలు ఇస్తానని ఎప్పుడు చెప్పలేదని అంటున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఎస్ సి, ఎస్ టి లకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పింది ఎవరు? డబల్ బెడ్ ఇండ్లు కట్టిస్తా అన్నది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్ తో కూడిన మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందని ఇప్పుడు ఈయన చేసింది ఏమిటని ప్రశ్నించారు. మేం ప్రజల పక్షాన మాట్లాడుతాం, మంత్రులతో,ముఖ్యమంత్రి తో వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదు అని ఆయన స్పష్టం చేశారు.
తాను సభలో లేనప్పుడు తనను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ జోకర్ అన్నాడు. మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు చూపిస్తా రమ్మని మంత్రి కి చెప్పాను. ఎవరు జోకర్ రో మంత్రి విజ్ఞాతకే వదిలివేస్తాను అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కృష్ణ జలాలతో నల్గొండ లో ప్లోరైడ్ ను తరిమికొట్టింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో పూర్తి చేసిన పవర్ ప్లాంట్ లతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తున్నదని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే నిలదిస్తాం అని ఆయన అన్నారు. గతంలో గట్టుప్పల్ మండలం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ రోజు సీఎం కేసీఆర్ ను ఇచ్చిన హామీని నెరవేర్చండి అని అడిగాను. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు వారికి ధన్యవాదాలు అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.