రిపబ్లిక్ టివి అర్నబ్ గోస్వామి ఈ పేరు ఇప్పుడు తెలంగాణలో మళ్లీ మరొక్క సారి మారుమోగి పోయింది. పోతున్నది. తెలుగు మీడియా ఎవరూ చేయలేని విధంగా ప్రియాంకరెడ్డి ఇష్యూను ప్రెజెంట్ చేసిన అర్నబ్ గోస్వామి తెలంగాణ సిఎం కేసీఆర్ లో కూడా మార్పు తెచ్చారు. ప్రియాంక రెడ్డి హత్య తదనంతర పరిణామాలలో కేసీఆర్ ఎలాంటి స్పందన వ్యక్తంచేయలేదు.
ప్రియాంక రెడ్డి హత్య జరిగిన తర్వాత కేసీఆర్ కనీసం ఆ కుటుంబాన్ని వెళ్లి పరామర్శించడం పక్కన పెట్టినా కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయలేదు. పోనీ పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు కూడా దాఖలాలు కనిపించడం లేదు.
పోలీసు వ్యవస్థ కు సంబంధించిన మంత్రి ప్రియాంక రెడ్డి కి 100 కు డయల్ చేయాలనే విషయం తెలియదా అంటూ వివాదాస్పద ప్రశ్న వేసినా కూడా సిఎం కేసీఆర్ జోక్యం చేసుకోలేదు. నెపం బాధితురాలిపై వేయడం ఇప్పటి వరకూ పోలీసు అధికారులు కూడా చేయలేదు. అలాంటిది ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి హోం మంత్రి ఎలా చేస్తారు?
పైగా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం, పోలీసులు తాత్సారం చేయడం అందువల్లే ఈ ఘోరమైన నేరం జరిగిపోవడం క్రమం ప్రకారం చూశాం. అంత చదువుకున్న అమ్మాయికి 100 కు డయల్ చేయాలని తెలిదా అని హోం మంత్రి అడగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సిఎం కేసీఆర్ ప్రియాంక మర్డర్ పై ఎలాంటి కామెంట్ చేయకపోవడం పై రిపబ్లిక్ టి వి బాధ్యుడు అర్నబ్ గోస్వామి కడిగి పారేశారు.
అర్నబ్ గోస్వామి ఆవేశంతో అడిగిన ప్రశ్నలకు టిఆర్ఎస్ ఎంపి ఎలాంటి సమాధానం చెప్పలేని నిస్సహాయ పరిస్థితికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. అయినా కేసీఆర్ కార్యాలయం నుంచి స్పందన లేదు. ప్రియాంక మర్డర్ జరిగిన తర్వాత సిఎం కేసీఆర్ కొన్ని వివాహ కార్యక్రమాలలో పాల్గొనడం పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పెళ్లిళ్లకు వెళ్లే తీరిక ఉంది కానీ ప్రియాంక ను దారుణంగా హత్య చేస్తే సిఎం స్పందించరా అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. గతంలో ఇంటర్ విద్యార్ధులు 27 మంది ఆత్మహత్యలు చేసుకున్న సమయంలో కూడా కేసీఆర్ స్పందించలేదు. అయ్యో పాపం అనలేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన నిర్భయ హత్య తర్వాత అంత ఘోరంగా, అంత పాశవికంగా జరిగిన సంఘటన ఇది.
ఆమెను ఎవరూ తిరిగి తీసుకురాలేకపోయినా సంఘటన జరిగిన తీరు అందరి కడుపు రగిలేలా చేసింది. ఆ దుర్మార్గులను కోర్టులో హాజరు పరిచే సమయంలో ఎక్కడెక్కడి ప్రజలు షాద్ నగర్ తరలి వచ్చారు. షాద్ నగర్ నుంచి చర్లపల్లి వరకూ కూడా జనం కదలివెళ్లారు. ఇంతలా కదిలించిన ఈ సంఘటనపై ముఖ్యమంత్రి మాత్రం స్పందించలేదు. ఇప్పుడు అర్నబ్ గోస్వామి కడిగిపారేసిన తర్వాత సిఎం కేసీఆర్ ప్రియాంకరెడ్డి ఉదంతంపై మాట్లాడారు.
ఆర్టీసీ కార్మికుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రియాంకా రెడ్డి హత్య కేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశం ఇచ్చారు. కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రియాంకారెడ్డి కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు. థ్యాంక్స్ టు అర్నబ్ గోస్వామి.