పటిష్టమైన పునాదులతో భవ్యంగా ఉన్న దివ్య సచివాలయం వాస్తు అనే మూఢ నమ్మకం కారణంగా కూలిపోయే క్షణాలు దగ్గరకు వచ్చేశాయి. ఆంధ్రాలో ఒక రేకుల షెడ్డును కూల్చివేస్తుంటే గగ్గోలు పెట్టిన మీడియా ఇంత పెద్ద సచీవాలయాన్ని ఒక్క సారిగా కూల్చేస్తుంటే ఒక్క అక్షరం కూడా రాయడం లేదు. సచివాలయం కూల్చివేతలపై సత్యం న్యూస్ ధారావాహికగా విషయాలను వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి పటిష్టమైన కట్టడాలతో ఉన్న సచివాలయానికి ఆదివారం ఉదయం ప్రధాన ద్వారానికి జీఏడీ అధికారులు తాళం వేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర తాళంచెవి ఉంటుంది.
అవసరం ఉన్నవాళ్లు తాళాలను సీఎస్ దగ్గరి నుంచే తీసుకోవాల్సి ఉంటుందంటున్న జేఏడీ అధికారులు చెబుతున్నట్లు తెలిసింది. ఈ పరిణామాలతో ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఆ సచివాలయం తన వైభవాన్ని కోల్పోనుంది. సచివాలయంలోనే సేవలందించాలని ఇతర పార్టీల నాయకులు, పలువురు మేధావులు చెబుతున్నప్పటికీ.. తెలంగాణ సర్కారు మాత్రం పాత సచివాలయాన్ని కూల్చి.. కొత్త సచివాలయ నిర్మాణానికి మొగ్గు చూపుతుండటంతో ఇక పాత సచివాలయం వైభవం గతంగానే మిగలనుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాంలో జనంతో కలకలలాడిన సచివాలయం తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా కొంత కాలం బాగానే నడిచింది. అయితే, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సచివాలయంకు రాకుండా ప్రగతి భవన్ నుంచే పాలన కొనసాగించడంతో ఆ భవన సముదాయం కొంత కళ తప్పింది. ఇక ఇప్పుడు ఏకంగా ఆ సచివాలయాన్ని అక్కడ్నుంచి పూర్తిగా ఖాళీ చేసి మరో చోటికి తరలించే ఏర్పాటు కూడా పూర్తయ్యాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో బూర్గుల రామకృష్ణారావు భవన సముదాయంలోకి సచివాలయంలోని అన్ని విభాగాలు ఇప్పటికే తరలిపోయాయి. దీంతో ఘనమైన చరిత్ర కలిగిన సచివాలయం వెలవెలబోతోంది. 1952లో హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు కాలం నాటి నుంచి ఈ సచివాలయం సేవలందిస్తున్నది.
1956లో రాయలసీమ, కోస్తాలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. నాటి నుంచి నేటి వరకు ఎందరో ముఖ్యమంత్రులు మారినప్పటికీ ఆ సచివాలయం తన సేవలను నిరంతరాయంగా అందిస్తూనే ఉంది.
నీలం సంజీవరెడ్డి 1956-60, ఆ తర్వాత దామోదరం సంజీవయ్య, మళ్లీ 1964లో నీలం సంజీవ రెడ్డి, 1964, ఫిబ్రవరి 29న కాసు బ్రహ్మానందరెడ్డి, 1971-73 వరకు పీవీ నరసింహారావు, 1973-78 వరకు జలగం వెంగళరావు, 1978-80 వరకు డా. మర్రి చెన్నారెడ్డి, 1980-82 వరకు టంగుటూరి అంజయ్య, 1982 ఫిబ్రవరి 24-సెప్టెంబర్ 20 వరకు భవనం వెంకట్రామ రెడ్డి, 1982 సెప్టెంబర్20-1983, జనవరి 9 వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, 1983-84 వరకు నందమూరి తారక రామారావు, 1984 ఆగస్టు 16-1984 సెప్టెంబర్ 16 వరకు నాదెండ్ల భాస్కరరావు, 1984-1985 వరకు మళ్లీ ఎన్టీఆర్, ఆ తర్వాత 1985-1989 వరకు మళ్లీ ఎన్టీఆర్, 1989-90 వరకు మర్రి చెన్నారెడ్డి, 1990-92 వరకు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, 1992-94 వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, 1994-95 వరకు ఎన్టీఆర్ ముఖ్య మంత్రులు గా వ్యవహరించారు.
ఈ మహామహులంతా కూడా ఇదే సచివాలయం నుంచి పాలన కొనసాగించారు. ఆ తర్వాత 1995-2004 వరకు చంద్రబాబు నాయుడు, 2004-2009 వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, 2009-10 వరకు కొణిజేటి రోశయ్య, 2010-2014 వరకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ సచివాలయం నుంచే పాలన కొనసాగించారు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-19 వరకు ఈ సచివాలయం నుంచే పాలన కొనసాగినప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం ఇక్కడికి వచ్చేవారు కాదు.
ఇక ప్రగతి భవన్ నిర్మించిన తర్వాత సచివాలయం ముఖం చూడటమే మనేశారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్ నుంచే పాలన కొనసాగిస్తూ వస్తున్నారాయన. ఇక ఇప్పుడు ఆ సచివాలయం వాస్తు బాగోలేదని, ప్రస్తుతం ఆ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయనే కారణాలతో మరో కొత్త సచివాలయం నిర్మించేందుకు సిద్ధమవుతున్నవారు. ఈ నేపథ్యంలోనే ఆ సచివాలయ భవనాన్ని ఖాళీ చేశారు. ఇప్పుడు ఆ భవన సముదాయం పాత సచివాలయంగా మారిపోయింది. ఆ పాత సచివాలయ ప్రాంగణం నుంచి ఖాళీ చేసి వెంటనే వెళ్ళిపోవాలని అన్ని శాఖలకు సాధారణ పరిపాలన శాఖ మౌఖిక ఆదేశాలు కూడా ఇప్పటికే జారీ చేసింది. సచివాలయ భవనాల నుంచి శాఖల తరలింపు ఇప్పటికే 90% పూర్తయిపోయింది. ఆదివారం పూర్తిగా ఖాళీ అవుతుంది. ఇక సచివాలయం వైభవం అంతా గతమే…