33.7 C
Hyderabad
April 29, 2024 02: 55 AM
Slider ముఖ్యంశాలు

జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మిన ఆడియో క్లిప్

#thirdEyeWeb

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక సీనియర్ అధికారి మాట్లాడిన మాటలు అంటూ ఒక ఆడియో క్లిప్ ను విస్తృతంగా ప్రచారం చేసిన ఒక వెబ్ ఛానెల్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని మాదల గ్రామానికి చెందిన అంజి అనే వ్యక్తి థర్డ్ ఐ వెబ్ అనే ఛానెల్ ను నడుపుతున్నాడు.

ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేసే ఈ ఛానెల్ కు పాపులారిటీ కూడా బాగానే ఉంది. ఐదారు రోజుల కిందట ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడిన మాటలు అంటూ ఒక ఆడియో క్లిప్ విడుదల అయింది. ఆ ఆడియో క్లిప్ లో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు ఉన్నాయి.

కరోనా వ్యాప్తిని నిరోధించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని అందువల్ల త్వరలో కేంద్ర బృందాలు రాబోతున్నాయని కూడా ఆ ఆడియో క్లిప్ లో ఉన్నది. కరోనా వ్యాప్తిని సమర్ధంగా అరికట్టిన రాష్ట్రాలుగా పాండిచ్చేరి, కేరళ విషయాలను చెబుతూ వారిని ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారని కూడా అందులో ఉన్నది.

ముఖ్యమంత్రి ఫొటోకు గ్రామ వాలంటీర్లు నమస్కారం చేసే వీడియో గురించి కూడా ప్రస్తావిస్తూ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనను తీవ్రంగా విమర్శించడం ఆ ఆడియో క్లిప్ సారాంశం. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్రంగా స్పందించింది.

ప్రత్యేక బృందాలు రంగంలో దిగి సైబర్ నిపుణులను సంప్రదించి ఆ ఆడియో క్లిప్ ను ప్రచారం చేసిన వ్యక్తిగా అంజిని గుర్తించినట్లు తెలిసింది. దాంతో నరసరావుపేట సమీపంలోని తురక పాలెంలో ఉన్న అంజిని రెండు రోజుల కిందట సీబీసిఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అంజి అత్తగారి ఇల్లు అయిన తురకపాలెం వెళ్లిన అతను లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుబడి పోయాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఆడియో క్లిప్ ఒరిజినల్ దేనా లేక ఫేక్ ఆడియోనా అనేది తేలాల్సి ఉంది.

దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం వెనుక కారణాలు ఏమిటనే విషయం కూడా బయటకు రావాల్సి ఉంది. ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న ఆ ఆడియో క్లిప్ ను ఏమి ఆశించి అంజి సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేశాడనేది కూడా పోలీసు విచారణలో తేలే అవకాశం ఉంది. అంజి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగంలో పని చేస్తుంటాడని ధృవీకరణ కాని సమాచారం. థర్డ్ ఐ వెబ్ ఛానెల్ ప్రారంభించడానికి ముందు అంజి విజయవాడ కేంద్రంగా పని చేసే ఒక ప్రముఖ ఛానెల్ లో రిపోర్టర్ గా కూడా పని చేసినట్లు చెబుతున్నారు.

Related posts

ఎంఆర్ఓ సంజీవరావు సేవలు మరువలేనివి

Satyam NEWS

నూతన భవనంలోకి మారుతున్న యూఎస్‌ కాన్సులేట్‌

Satyam NEWS

పేద జర్నలిస్టు కుమార్తెకు ఐ.ఏ.ఎస్ సి.ఎస్.బి అకాడెమీ డైరెక్టర్ సాయం

Satyam NEWS

Leave a Comment