27.7 C
Hyderabad
May 11, 2024 10: 48 AM
Slider సంపాదకీయం

ఇది కొత్త రాజకీయం: నైతిక విలువలకు పాతర

#gorantlamadhav

నైతిక విలువలు లేకుండా, సామాజిక కట్టుబాట్లు దాటిన వారిని కాపాడుకోవడమే కొత్త రాజకీయ నీతి అయితే అదే సిద్ధాంతాన్ని ఏపిలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నది. తన ప్రయివేటు పార్ట్ లను పబ్లిక్ గా (సెల్ ఫోన్ వీడియో కాల్ లో చేసినా అది ప్రజల్లో వైరల్ అయింది) ప్రదర్శించిన అనంతపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ ఏ మాత్రం బెరుకు లేకుండా ప్రవర్తిస్తున్న తీరు ఆశ్చర్యకరంగా ఉంది.

అంతే కాకుండా వీడియో కాల్ లో తాను చేసిన ‘‘బహిరంగ శృంగార చేష్టల్ని’’ ఎవడో ఒక కులం వాడు( కులం పేరు వాడటం ఇష్టం లేక రాయడం లేదు) వైరల్ చేశాడని చెప్పడం మరింత తెంపరితనం. ఇదంతా జరిగి మూడు రోజులు గడుస్తున్నా పార్లమెంటు సభ్యుడిపై సంబంధింత పార్టీ అధినాయకుడు ఎలాంటి చర్య తీసుకోకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తున్నది.

ఆ వీడియో కాల్ లో ఉన్న మహిళ ఎవరో చాలా మందికి తెలియలేదు కానీ సదరు పార్లమెంటు సభ్యుడు వత్తిడి తెచ్చాడో ఏమో కానీ స్థానిక పోలీస్ స్టేషన్ కు ఒక మహిళ వెళ్లి ‘‘ఆ వీడియో లో ఉన్నది నేను కాదు’’ అంటూ ఫిర్యాదు ఇవ్వడంతో ఆ మహిళ తనంత తానుగానే తన ఉనికిని పబ్లిక్ లో చెప్పుకున్నట్లయింది.

ఇది మరో అభ్యంతరకరమైన అంశం. సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ‘‘కఠినమైన శిక్ష’’ ఉంటుంది అని ప్రకటించిన ఆ పార్టీ ముఖ్య నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ తర్వాతి రోజు చంద్రబాబునాయుడి ‘‘ఓటుకు నోటు’’ కేసును ఉదహరించడం చూస్తుంటే అధికార పార్టీ ఆ పార్లమెంటు సభ్యుడిని కాపాడుకునేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నదనే విషయం అర్ధం అవుతున్నది.

వికృత చేష్టల వీడియో బయటకు రాగానే అమరావతి వచ్చి వివరణ ఇవ్వాలని వై ఎస్ జగన్ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. దాంతో ‘‘తప్పు చేసిన వారిని జగన్ వదలరు’’ అనే మెసేజి బలంగా వెళ్లింది. అయితే ఆ ఆదేశాలను పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ ఖాతరు చేసినట్లు కనిపించలేదు. ఎందుకంటే ఆయన అమరావతి రాలేదు. ఆ తర్వాతి రోజు జగన్ ఢిల్లీ వస్తారు కాబట్టి అక్కడే వివరణ ఇస్తాను అని ఆయన అన్నట్లు మళ్లీ మరో లీక్ ఇచ్చారు.

అయితే అదీ జరగలేదు. అంటే గోరంట మాధవ్ జగన్ ను ధిక్కరిస్తున్నారా? గోరంట్ల మాధవ్ పై చర్య తీసుకోవడానికి జగన్ అందుకే వెనకడుగు వేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రయివేటు వీడియో కాల్ విషయాన్ని పబ్లిక్ చేయడం తప్పు అన్న రీతిలోనే అధికార పార్టీ ప్రవర్తిస్తున్నది తప్ప ఒక పార్లమెంటు సభ్యుడు ఎవరు చూస్తున్నా, ఎవరు చూడకుండా ఉన్నా కూడా తన శరీరంలోని ప్రయివేటు భాగాలను చూపిస్తూ వీడియో కాల్ చేయవచ్చా? అనే నైతిక విలువల గురించి మాత్రం మాట్లాడటం లేదు.

బరితెగించి మరీ మద్దతు పలుకుతున్నవారే ఎక్కువ

కొందరు వైపీసీ కార్యకర్తలైతే మరింతగా బరితెగించి ఆయన వీడియో కాల్ చేస్తే తప్పేంటి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ‘‘ప్రయివేటు వీడియో కాల్ ’’లో, ‘‘నాలుగు గోడల మధ్య’’ ఎవరు ఏం చేస్తుంటారో అనే అంశం నైతిక అంశం ఎలా అవుతుందని కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు.

చర్య తీసుకోవడం అటుంచి ఇలాంటి ప్రచారం చేయడం కారణంగానే గోరంట్ల మాధవ్ ను అధికార వైసీపీ కాపాడుతున్నది అనే భావన విస్తృతంగా వ్యాప్తి చెంది ఉన్నది. గోరంట్ల మాధవ్ చేసిన దాంట్లో తప్పేంటి? అని ప్రశ్నించే వారు కూడా వైసీపీలో అధిక సంఖ్యలో ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశం. గోరంట్ల మాధవ్ తన శృంగార చేష్టల్ని పబ్లిక్ చేసిన అంశంలో చర్యలు తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు.

తన వీడియోను ఎవరో మార్ఫింగ్ చేశారంటూ ఆయన పోలీసులకు చేసిన ఫిర్యాదును ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నది. అంటే కేసును కోల్డ్ స్టోరేజిలోకి పంపేందుకు ముందే ఆయన పథకం వేసుకున్నారు. దానికి ప్రభుత్వ పరంగా మద్దతు దొరుకుతున్నట్లే కనిపిస్తున్నది. ఏ నాయకుడు ఏ తప్పు చేసినా కాపాడుకోవడమే నూతన రాజకీయ విధానం అనుకుంటే ఎవరూ చెప్పేదేంలేదు… చేసేది అంతకన్నా లేదు. అయితే ఇలాంటి ఒక్కో చర్యతో అధికార పార్టీ ప్రజల నుంచి అసహ్యాన్ని పోగు చేసుకుంటున్నదని మాత్రం చెప్పవచ్చు.

Related posts

కృష్ణా జిల్లా వైసీపీ నేతల మధ్య భగ్గుమన్న విభేదాలు

Satyam NEWS

500 కోట్ల తో మెడికల్ కాలేజీ వర్చువల్ శంకుస్థాపన

Satyam NEWS

రెండేళ్లలో అనేక ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాలు

Sub Editor

Leave a Comment