33.7 C
Hyderabad
April 29, 2024 01: 39 AM
Slider ప్రత్యేకం

సదాశివ శర్మకు ఘన నివాళి అర్పించిన జర్నలిస్టులు

#sadasivasharma (2)

సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రభూమి పూర్వ సంపాదకుడు ముళ్లపూడి సదాశివ శర్మ నివాళి సభను జర్నలిస్టు మిత్రులు గురువారంనాడు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొని ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

సీనియర్ జర్నలిస్టు వేదుల నరసింహం ఈ సభకు అధ్యక్షత వహించగా సీనియర్ సంపాదకుడు కె.రామచంద్రమూర్తి, సాక్షి ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ ఆర్.దిలీప్ రెడ్డి, పూర్వపు సమాచార హక్కు కమిషనర్ విజయబాబు, సత్యంన్యూస్ చీఫ్ ఎడిటర్ సత్యమూర్తి, సీనియర్ జర్నలిస్టు రామ్మోహన్, విద్యారణ్య, సిహచ్ వి రమణారావు, రాకా సుధాకర్ రావు,  కర్లపాలెం హనుమంతరావు, ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యకారిణి సభ్యుడు రాంపల్లి మల్లికార్జున్, వనవాసీ కళ్యాణ్ క్షేత్ర అఖిలభారతీయ విద్యాప్రముఖ్ కే.రామచంద్రయ్య, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రవూఫ్, సినీనటుడు కిషోర్ దాస్, నివేదిత విద్యాసంస్థల కరస్పాండెంట్ హరిహర ప్రసాద్, త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన మూర్తి పాల్గొన్నారు.

సౌమ్యుడు, మృదుభాషి అయిన సదాశివ శర్మ ఆకస్మిక మృతి తెలుగు జర్నలిజానికి తీరని లోటని రామచంద్రమూర్తి అన్నారు. సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శర్మ పని చేసినప్పుడు తాను సాక్షి ఎడిటర్ గా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. శర్మకు సంబంధించిన జీవిత విశేషాలను క్రోడీకరించి పుస్తకరూపంలో తీసుకురావాల్సిన అవసరం ఉందని రామచంద్రమూర్తి తెలిపారు.

అలా చేయడం వల్ల భావితరాల జర్నలిస్టులకు ఉపయుక్తంగా ఉంటుందని, ఆయన జీవితం కొత్త తరం జర్నలిస్టులకు మార్గదర్శిగా ఉపయోగపడుతుందని అన్నారు. సాక్షి ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ ఆర్.దిలీప్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో జర్నలిస్టులను తీర్చిదిద్దిన వ్యక్తి సదాశివ శర్మ అని కొనియాడారు. ఆంధ్రప్రభ ఎడిటర్ గా ఉన్న సమయంలో ఆయనతో కలిసి పని చేసిన విషయాలను విజయబాబు గుర్తు చేసుకున్నారు. ఈనాడు టాబ్లాయిడ్ల రూపకల్పనలో సదాశివ శర్మ ప్రముఖ పాత్ర పోషించారని ఆయనతో కలిసి పని చేసిన సత్యమూర్తి తెలిపారు.

మారుమూల ప్రాంతాలలో మండలానికి ఒక జర్నలిస్టును నియమించే ప్రతిపాదన ఈనాడులో ఉన్నప్పుడు సదాశివశర్మ చేశారని ఆయన గుర్తు చేశారు. సదాశివ శర్మ జర్నలిస్టు జీవితంలో సాధించిన విజయాలన్నింటినీ క్రోడీకరించి ఒక నివాళి పుస్తకాన్ని తీసుకువస్తామని సత్యమూర్తి తెలిపారు. తనలాంటి ఎంతో మంది జర్నలిస్టులకు సదాశివ శర్మ గురుతుల్యుడని, ఆయన లేని లోటు తీర్చలేనిదాని సిహెచ్ వి రమణ రావు తెలిపారు.

సదాశివ శర్మ కుటుంబానికి తన వంతు సాయంగా తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారుడు, రిటైర్డ్ ఐ ఏ ఎస్ అధికారి కె వి రమణాచారి 30 వేల రూపాయలు అందచేశారని విద్యారణ్య తెలిపారు. ఎన్ని ఉన్నత పదవులు అధిరోహించినా ఆర్ధిక విషయాలపై ఏ మాత్రం శ్రద్ధ చూపని సదాశివశర్మ కుటుంబానికి తాము అండగా ఉంటామని ఆర్ఎస్ఎస్ తరపున రాకా సుధాకర రావు ప్రకటించారు.

సదాశివశర్మ కుటుంబానికి తమ వంతు సాయం చేస్తామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రవూఫ్ వెల్లడించారు. సదాశివ శర్మ కుటుంబాన్ని ఆదుకోవడానికి తమ వంతు సాయం అందిస్తున్నట్లు ఆంధ్రభూమి ఉద్యోగుల సంఘం ప్రకటించింది.    

Related posts

ప్రభుత్వానికే ‘ఆక్సిజన్’ అందిస్తున్న సోనూసూద్

Satyam NEWS

సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలి

Satyam NEWS

మన ఊరు మన బడి కార్యక్రమం పనులు వేగవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment