శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2020, మార్చి నెల కోటాలో మొత్తం 52,748 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఆన్‌లైన్ డిప్ విధానంలో 10,973 సేవా టికెట్లు కాగా, ఇందులో సుప్రభాతం 8,193, తోమాల 120, అర్చన 120, అష్టదళపాదపద్మారాధన 240, నిజపాదదర్శనం 2,300 టికెట్లు ఉన్నాయన్నారు.
ఆన్‌లైన్ జనరల్ కేటగిరిలో 41,775 సేవాటికెట్లు ఉండగా, వీటిలో కల్యాణం 14,250, ఊంజల్‌సేవ 4,500, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,425, సహస్రదీపాలంకారసేవ 15,600 టికెట్లు ఉన్నాయని వివరించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.
1. సుధాకర్‌రావు – చీపురుపల్లి: ప్రశ్న: సప్తగిరుల చుట్టూ గిరి ప్రదక్షిణ కోసం బాట వేసే అవకాశాన్ని పరిశీలించండి. టిటిడికి విరాళమిచ్చే దాతలకు స్వామివారి అక్షింతలుగానీ, పుస్తక ప్రసాదం గానీ పంపండి? ఈవో : అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
2. ప్రకాష్ – నగరి: ప్రశ్న: ఆన్‌లైన్ లక్కీడిప్ నమోదులో తప్పులు దొర్లుతున్నాయి, ఎడిట్ ఆప్షన్ పెట్టండి? ఈవో : తప్పకుండా పరిశీలిస్తాం.
3. నాగేంద్రప్రసాద్ – తిరుపతి: ప్రశ్న: తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం పక్కన రోడ్డుపై మాంసాహారం విక్రయించకుండా చూడండి? ఈవో : ఈ విషయాన్ని కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
4. మోహన్ వంశీ – విజయవాడ, భావనారాయణ – గుంటూరు, మోహన్‌రావు – విశాఖ: ప్రశ్న: తిరుపతిలోని విష్ణునివాసంలోనూ కొన్ని గదులకు అడ్వాన్స్ రిజర్వేషన్ కల్పించండి? శ్రీనివాసంలో గదులు కేటాయించే సమయాన్ని మార్చండి? ఈవో : శ్రీనివాసం, విష్ణునివాసంలో 50 శాతం గదులకు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం ఉంది. భక్తుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని శ్రీనివాసంలో గదులు కేటాయించే సమయాన్ని మారుస్తాం.
5. శ్రీనివాసరెడ్డి – అనపర్తి: ప్రశ్న: ఇదివరకు స్కౌట్స్‌కు వస్తున్నాం. శ్రీవారి సేవ అవకాశం కల్పించండి? ఈవో : శ్రీవారి సేవకు రావచ్చు.
6. శ్రీనివాస్ – హైదరాబాద్: ప్రశ్న: దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తరువాత కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు ఉచితంగా ఫోన్ సౌకర్యం కల్పించండి. రూ.300/- భక్తులను ధ్వజస్తంభాన్ని తాకనివ్వండి. సర్వదర్శనం భక్తులకు కూడా సంప్రదాయ వస్త్రధారణ అమలుచేయండి ? ఈవో : భక్తుల కోరిక మేరకు గతంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఫోన్లు అందుబాటులో ఉంచాం. ఆలయం వెలుపల ఫోన్లు పెట్టే విషయాన్ని పరిశీలిస్తాం. భక్తులందరూ ధ్వజస్తంభాన్ని తాకేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తాం. సంప్రదాయ వస్త్రధారణ అంశంపై భక్తుల అభిప్రాయాలను సేకరిస్తాం.
7. ప్రసాద్ – తిరుపతి: ప్రశ్న: టైంస్లాట్ దర్శనం భక్తుల కోసం నారాయణగిరి ఉద్యానవనాల మొదట్లో లగేజి కౌంటర్ ఏర్పాటు చేయండి ? ఈవో : పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటాం.
8. కృష్ణ – తిరుపతి: ప్రశ్న: నడకమార్గంలో జిఎన్‌సి టోల్ గేట్ సమీపంలో కొంత దూరం షెల్టర్ లేక భక్తులు ఇబ్బందిపడుతున్నారు. చివరిమెట్టు వద్ద హుండీ ఏర్పాటుచేయండి ? ఈవో : అలిపిరి నడక మార్గం మొత్తం నూతన షెల్టర్ ఏర్పాటు చేస్తాం. హుండీ విషయాన్ని పరిశీలిస్తాం.
9. జ్ఞానప్రకాష్ – తిరుపతి: ప్రశ్న: తిరుపతిలో త్యాగరాజ మందిరం ఏర్పాటుకు సహకరించండి? ఈవో : ట‌్రస్టు సభ్యులు సంప్రదిస్తే నిబంధనల ప్రకారం సాయం చేసే అంశాన్ని పరిశీలిస్తాం.
10. కృష్ణారావు – అరసవెల్లి: ప్రశ్న: ప‌్రధాన కల్యాణకట్ట వద్ద గల పాదరక్షల కౌంటర్‌లో సిబ్బందిని ఏర్పాటు చేయండి? ఈవో : తప్పకుండా ఏర్పాటు చేస్తాం.
11. వెంకట్రామాచారి – మదనపల్లి: ప్రశ్న: బ‌్రహ్మోత్సవాల్లో వర్షం పడడం వల్ల ఇబ్బంది పడ్డాం. గ్యాలరీల్లో షెడ్లు ఏర్పాటు చేయండి ? ఈవో : వాతావరణం అనుకూలించకపోవడం వల్ల బ్రహ్మోత్సవాల్లో షెడ్లు వేయలేకపోయాం. దీనిపై అధ్యయనం చేస్తున్నాం.
12. సత్యనారాయణ – కొత్తగూడెం: ప్రశ్న: శ్రీవాణి ట్రస్టుకు 10 వేలు విరాళమిస్తే కుటుంబం మొత్తానికి బ్రేక్ టికెట్లు ఇస్తారా? ఈవో : ఎస్‌సి, ఎస్‌టి, బిసి ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి, సనాతన ధర్మ ప్రచారానికి శ్రీవారి ట్రస్టు నిధులను వినియోగిస్తాం. రూ.10 వేలు విరాళమిస్తే ఒక బ్రేక్ దర్శనం టికెట్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది.
12. కామాక్షి – నెల్లూరు: ప్రశ్న: గదుల కోసం మహిళలకు ప్రత్యేక క్యూ ఏర్పాటు చేయండి ? ఈవో : భక్తులు క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ముందుగా నమోదు చేసుకునే విధానం ఉంది. ఈ ప్రకారం సంబంధిత భక్తులకు ఎస్ఎంఎస్ ద్వారా గది కేటాయింపు సమాచారం తెలియజేస్తారు.
13. రమణ – వైరా: ప్రశ్న: జనరల్ కేటగిరీలో ఆర్జిత సేవలు పొందిన భక్తులకు తిరిగి లక్కీడిప్‌లో టికెట్లు వస్తే రెండు సార్లు తిరుమలకు రావాల్సి వస్తోంది? ఈవో : మొదట లక్కీడిప్‌లో టికెట్ వస్తుందో రాదో ఖరారు చేసుకుని ఆ తరువాత జనరల్ కేటగిరీలో టికెట్లు పొందండి.
14. రమేష్ – అనంతపురం: ప్రశ్న: శ్రీవారి సేవకు వచ్చాను. భక్తులకు చక్కగా శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు, కృతజ్ఞతలు. ప్రయివేటు ట్యాక్సీల వల్ల కాలుష్యం పెరుగుతోంది ? ఈవో : ధన్యవాదాలు. కాలుష్యం పెరగకుండా తగిన చర్యలు తీసుకుంటాం. శ్రీవారి సేవకులు ఖాళీ సమయంలో సేవా సదన్‌లో ఫీడ్‌బ్యాక్ నమోదు చేయండి.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, తిరుపతి జెఈవో పి.బసంత్‌కుమార్, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, అదనపు సివిఎస్వో శివకుమార్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ రామచంద్రారెడ్డి, ఎస్ఇ ఎలక్ట్రికల్స్ వేంకటేశ్వర్లు, ఎస్ఇ-2 నాగేశ్వరరావు, విఎస్వోలు మనోహర్, ప్రభాకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.