38.2 C
Hyderabad
April 28, 2024 19: 16 PM
Slider ఆధ్యాత్మికం

అష్టలక్ష్మీ మండపంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం

#TiruchanurPadmavati

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో  శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన అమ్మవారు బంగారుచీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి సాంప్రదాయ పుష్పలతో అమ్మవారిని ఆరాధించారు.

ఈ సందర్భంగా అమ్మవారిని 9 గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు. భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మీ వ్రతం పూజావిధానాన్ని, మహత్యాన్ని తెలియజేశారని పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు తెలిపారు. పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, అచరించవలసిన విధానాన్ని తెలియచేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు.

 త్రేతాయుగంలో కుండలినీ నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మీ నోము ఆచరించి పొందిన ఫలప్రదాన్ని ఈ సందర్భంగా వివరించారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రీతితో అవతరించిన తిరుచానూరులో వరలక్ష్మీవ్రతంలో పాల్గొన్న మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగల్యసౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబసౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు.

తరువాత 12 రకాల వివిధ  నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది.

భక్తులను విశేషంగా అకట్టుకున్న వ్రత మండపం

టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్యర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా అకట్టుకుంది. 15 మంది సిబ్బంది, 2 ట‌న్నుల సంప్రదాయ పుష్పాలు, 25 వేల కట్ ఫ్లవర్స్ తో మూడు రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయం, ఆస్థానమండపం, వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

ఇందులో తమలపాకులు, అపిల్‌, ద్రాక్ష, బత్తాయి, పైనాపిల్‌ వంటి ఫలాలు, వివిధ సంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా రూపొందించారు. మండపం పై భాగంలో గజలక్ష్మీ అమ్మవారు, కింది భాగంలో రెండు వైపుల ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆస్థాన మండపాన్ని అష్టలక్ష్మిమూర్తులతో, రోజాలు, తామరపూలు లాంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. హైదరాబాద్ కు చెందిన లారస్ ల్యాబ్ విరాళంతో పుష్పాలంకరణ చేపట్టామని ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు తెలిపారు.

Related posts

శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో శాస్త్రోక్తంగా ప‌త్ర పుష్ప‌యాగం

Satyam NEWS

అంగరంగవైభవంగా కొత్త సచివాలయం ప్రారంభోత్సవం

Bhavani

అంగన్వాడీల ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు అక్షరభ్యాసం

Satyam NEWS

Leave a Comment