29.7 C
Hyderabad
April 29, 2024 07: 16 AM
Slider కృష్ణ

నిన్న వెంకటగిరి… రేపు ప్రత్తిపాడు… మరో 38

#Mekathoti Sucharita

తాను, తన భర్త పార్టీ మారడం లేదని వివరణ ఇచ్చినా కూడా ప్రత్తిపాడు ఎమ్మెల్యే, మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్థానంలో పార్టీ ఇన్ చార్జిని నియమించేందుకు వైసీపీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. నాలుగేళ్లు ఏం చేశామని మళ్లీ ఓట్లు అడగాలి అంటూ ప్రశ్నించిన వెంకటగిరి ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి స్థానంలో ఇటీవల కొత్త ఇన్ చార్జిని వైసీపీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే.

ప్రత్తిపాడు ఎమ్మెల్యే మంత్రి పదవి పోయిన నాటి నుంచి పార్టీ పట్ల ముభావంగా వ్యవహరిస్తున్నారు. కొద్ది కాలం కిందట పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని అప్పగిస్తామని అంటే ఆమె దాన్ని స్వీకరించలేదు. ఆమె భర్త దయాసాగర్ ఆదాయపు పన్ను శాఖలో అధికారిగా పని చేశారు. దయాసాగర్ తెలుగుదేశం పార్టీలో చేరి బాపట్ల పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయన తెలుగుదేశం పార్టీ అగ్ర నేతలతో కూడా పలుమార్లు సమావేశం అయినట్లు కూడా చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఆయనకు బాపట్ల పార్లమెంటు సీటును కేటాయించేందుకు ప్రాధమికంగా అంగీకారం తెలిపినట్లు కూడా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే మేకతోటి సుచరిత కూడా తన భర్త వెంట తెలుగుదేశం పార్టీలోకి వెళతారని పుకార్లు వ్యాపించారు. ఈ పుకార్లను ఖరారు చేస్తున్నట్లుగా ఆమె ఒక సందర్భంలో మాట్లాడుతూ భర్త ఒక పార్టీలో భార్య వేరొక పార్టీలో ఉండరు కదా భర్త ఎటు వెళితే భార్య అటు వెళుతుంది అని వ్యాఖ్యానించారు. దాంతో సుచరిత కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమనే భావన వ్యాపించింది. ఈ అనుమానాలపై సుచరిత సుదీర్ఘమైన వివరణ కూడా ఇచ్చారు కానీ, ఆమె ఇచ్చిన వివరణను పార్టీ పట్టించుకోవడం లేదు. గత ఎన్నికలలో ఆమెపై తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కు ఆ స్థానం కట్టబెట్టేందుకు యోచిస్తున్నారని తెలిసింది.

ప్రస్తుతం డొక్కా మాణిక్య వర ప్రసాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు. ఆయనను తాడికొండ సహ ఇన్ చార్జిగా ప్రకటిస్తే అక్కడి ఎమ్మెల్యే తీవ్రంగా ప్రతిఘటించారు. అప్పటిలో ఆ నిర్ణయాన్ని అమలు చేయలేకపోయారు. తాజాగా ఆయనను ప్రత్తిపాడు ఇన్ చార్జిగా నియమిస్తారని అంటున్నారు. ఇటీవల వెంకటగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నా ఇన్ చార్జిని నియమించినట్లే ఇప్పుడు ప్రత్తిపాడు కు కూడా చేస్తారని అంటున్నారు.

ఈ విధంగా మరో 38 నియోజకవర్గాలలో కూడా వైసీపీ నిర్ణయం తీసుకోబోతున్నదని చెబుతున్నారు. పక్కపార్టీ వైపు చూసే వారినే కాకుండా, వచ్చే ఎన్నికలలో గెలిచే అవకాశం లేదని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన 38 మందిపై అతి త్వరలో వేటు వేయబోతున్నారని తెలిసింది.ఎన్నికల సమయంలో కాకుండా ముందుగానే ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల పార్టీకి మేలుజరుగుతుందని వైసీపీ అధిష్టానం భావిస్తున్నది.

Related posts

క్లీన్ ఇమేజ్ ఉన్న టీఆర్ఎస్ క్యాండిడేట్ వాణిదేవి

Satyam NEWS

తెలంగాణ ఉద్యమ నేత పిడమర్తి రవికి MLC ఇవ్వాలి

Satyam NEWS

11వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం ఈ నెల 18న

Satyam NEWS

Leave a Comment