26.7 C
Hyderabad
April 27, 2024 07: 55 AM
Slider ముఖ్యంశాలు

తెలుగు భాషను కాపాడుకోవడం మన బాధ్యత

సేవ చేయడం ద్వారా వచ్చే ఆత్మసంతృప్తికి ఏదీ సాటి రాదని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ఎవరి పని వారు చేస్తే ఆనందం కలుగుతుందని, అయితే ఇతరుల కోసం పనిచేస్తే కలిగే ఆనందాన్ని వర్ణించలేమన్నారు. శ్రీ ముప్పవరపు ఫౌండేషన్ దశమవార్షికోత్సవం, స్వర్ణభారత్ ట్రస్ట్ సంక్రాంతి సంబరాల సందర్భంగా హైదరాబాద్‌లోని శిల్పారామంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘వ్యవసాయాధారిత భారతదేశంలో రైతుకు, పాడి పంటలకున్న ప్రత్యేకతే వేరు. మరీ ముఖ్యంగా తెలుగు లోగిళ్లలో, వ్యవసాయం ఆధారంగానే మన పండగలు, పబ్బాలు నిర్ణయించారని అన్నారు. ఇందులో సంక్రాంతి పండగ ఒకటి. పల్లెసీమలకు కొత్త క్రాంతినిచ్చేదే సంక్రాంతి’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

 వ్యవసాయంతోపాటు రైతుకు పంటలో తోడుగా నిలుస్తున్న పాడి, పశు సంపదకు కృతజ్ఞతలు చెప్పుకునే శుభవేళే ఈ సంక్రాంతి పండగన్నారు. తెలుగు సంప్రదాయానికి సంక్రాంతి పండగ ప్రతీక అని.. కుటుంబ విలువలకు మనమిచ్చే గౌరవాన్ని ఈ పండగ ప్రతిబింబిస్తుందన్నారు. పిల్లల దీర్ఘాయుష్షును కోరుకుంటూ వారికి భోగిపళ్లు పోయడం.. పండగకు ఆడపడుచులను, అల్లుళ్లని పిలుచుకుని వారిని గౌరవించుకోవడం, వారితో కలిసి సంతోషంగా గడిపే గొప్ప సంప్రదాయం మన తెలుగువారికే సొంతమన్నారు.

తెలుగుజాతి జాతి అస్తిత్వానికి తెలుగు భాషే ప్రాణవాయువని దీన్ని కాపాడుకోవడంలో భాగంగా వీలున్న చోటల్లా తెలుగులో మాట్లాడుతూ ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ‘అజంతాల సుందరి.. అదే తెలుగు పందిరి. తెలుగు నుడికారం.. మనందరికి అలంకారం. ఆత్మశక్తి కూర్చు అజరామరమైన భాష.. మన తెలుగు భాష’ అని మహాకవి విశ్వనాథ సత్యనారాయణ తెలుగు గురించి పలికిన పలుకులను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.

మన భాషతో ముడిపడి ఉన్న మన పండగలు, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరం ప్రయత్నించాలన్నారు. మన భాష, మన యాస, మన పాట, ఆట, కట్టు, బొట్టు, సంప్రదాయాలను కాపాడుకుని.. మన సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలన్నారు. ప్రతి ఒక్కరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్  బండారు దత్తాత్రేయ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  రాఘవేంద్ర సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సినీ, సాహితీ రంగాల ప్రముఖులు, సామాజికవేత్తలు, భాషాభిమానులు పాల్గొన్నారు.

Related posts

బీజేపీ నాయకుడి ఇంటిపై కొనసాగుతున్న సీబీఐ దాడులు

Satyam NEWS

ఈ మాటలు మోడీనీ కేసీఆర్ ను కదిలిస్తాయా?

Satyam NEWS

కలకలం సృష్టించిన ఖాలిస్తాన్ పోస్టర్లు

Satyam NEWS

Leave a Comment