ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా బలపడాలని ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీ వికృత మత రాజకీయాలకు తెరతీసినట్లే కనిపిస్తున్నది. తిరుపతి ఆర్టీసీ టిక్కెట్లపై జరూసలేం యాత్ర కు సంబంధించిన ప్రకటనలు వేసి అన్యమత ప్రచారానికి పాల్పడుతున్నారని రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బిజెపి ఒక్క సారిగా సోషల్ మీడియా క్యాంపెయిన్ ప్రారంభించింది. దావానలంలా వ్యాప్తి చెందిన ఈ మెసేజ్ లు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోలుకునేలోపునే దారుణమైన డ్యామేజి జరిగిపోయింది. తిరుపతిలో ఆర్టీ సీ బస్ టిక్కెట్లపై జరుసలేం యాత్రకు సంబంధించిన ప్రకటనలు ఉన్న ఫొటోలను బిజెపి అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. ఎన్నికల ముందు కావాలి జగన్ రావాలి జగన్ అని ప్రచారం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కావాలి జీసస్, రావాలి జీసస్ అంటూ ప్రచారం ప్రారంభించిందని బిజెపి క్యాంపెయిన్ ప్రారంభించడంతో జనంలో కలకలం రేగింది. ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేసుకుంటూ ఇటీవలి కాలంలో బిజెపి నాయకులు బహిరంగ విమర్శలు ఎక్కువ చేశారు. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అయితే ఇప్పటికే చాలా అంశాలలో ముఖ్యమంత్రి జగన్ కు అల్టిమేటం ఇచ్చారు కూడా. రాజధాని విషయంలో కూడా లక్ష్మీనారాయణ ఘాటుగానే స్పందించారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలతో ఏపి ముఖ్యమంత్రి టచ్ లోనే ఉన్నారని, ప్రధాన నిర్ణయాలు వారికి తెలిసే జగన్ తీసుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి చెప్పడంతోనే ఆంధ్రప్రదేశ్ బిజెపి గట్టిగా రియాక్ట్ అయింది. అలాంటిదేం లేదని తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తిరుపతిలో అన్యమత ప్రచారం జరుగుతున్నదంటూ బిజెపి చేసిన ఈ ప్రచారం ఒక్క సారిగా ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపడేలా చేసింది. జరూసలేం యాత్ర గురించి ఆర్టీసీ టిక్కెట్ల వెనుక ప్రకటనలు ముద్రించారని ఇదీ జగన్ ప్రభుత్వ నిర్వాకం అని బిజెపి సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. దాంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఏం జరుగుతున్నదో తెలుసుకునే లోపునే ప్రభుత్వానికి డ్యామేజి జరిగిపోయింది. ఆ తర్వాత దిద్దుబాటు చర్యలు తీసుకున్నా కూడా అప్పటికే జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి. వాస్తవంగా ఇది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన పనికి పర్యవసానం. కడప, నెల్లూరు జోన్లలో ఆర్టీసీ టిక్కెట్లు జారీ చేసే టిమ్ మిషన్లలో ఉంచే కాగితంపై ప్రకటనలు ముద్రించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం పర్ఫెక్ట్ కోటెడ్ పేపర్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది. 2019 మార్చి 5న ఈ ఆర్డర్ ఇవ్వగా ఆ సంస్థ మొత్తం 60 వేల టిక్కెట్లకు వచ్చేపేపర్ రోల్స్ పై మైనారిటీ శాఖ ఇచ్చిన ప్రకటనలను ముద్రించింది. అందులో హజ్ యాత్ర, జరూసలేం యాత్ర, ముస్లింలకు ఇచ్చే చంద్రన్న తోఫా లాంటి పథకాల ప్రకటనలు ఉన్నాయి. నెల్లూరు, కడప జోన్లలో ఈ టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే తిరుపతిలో పేపర్ రోల్సు అయిపోయిన కారణంగా కొన్ని రోల్స్ ను అక్కడి టిమ్ లలో వాడటానికి పంపించారు. అక్కడి ఆర్టీసీవారు అవే రోల్స్ ను ఉపయోగించి ప్రయాణీకులకు టిక్కెట్లు జారీ చేస్తున్నారు. ఇది బిజెపి నాయకుల కంట పడటంతో తిరుపతిలో అన్యమత ప్రచారం చేస్తున్నట్లుగా భావించి వారు ఈ విషయాన్ని బయటకు చెప్పేశారు. దాంతో ఒక్క సారిగా రాష్ట్రం ఉలిక్కి పడింది. జగన్ సి ఎం కావడం వల్లే ఇలా జరుగుతున్నదనే నిర్ణయానికి వచ్చేశారు. ప్రభుత్వానికి డ్యామేజి జరిగిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా జరిగిన నష్టం పూడదు. ప్రభుత్వంలోని వివిధ స్థాయిలలో చంద్రబాబునాయుడి మనుషులు ఇంకా ఉన్నారని సత్యంన్యూస్ ఇప్పటికే చాలా సార్లు చెప్పింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో అధికారులు, వారు ఆర్టీసీ వారు కావచ్చు లేదా సచివాలయంలోని వారు కావచ్చు మొక్కుబడిగా ఉద్యోగం చేస్తున్నారే తప్ప ఇది మా ప్రభుత్వం అని పని చేయడం లేదు. ఈ ఒక్క కారణంతోనే ఇలాంటి దారుణాలు జరిగిపోతున్నాయి.
previous post