38.2 C
Hyderabad
April 29, 2024 12: 17 PM
Slider ప్రత్యేకం

Special Analysis: మునుగోడు మొనగాడు ఎవరు?

#munugodu

ఇప్పుడు ఈ ప్రశ్న తెలంగాణ రాజకీయ పరిశీలకుల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తోంది. దాదాపు ఏడాది పైగా అసెంబ్లీ ఎన్నికలకు గడువు ఉండగా మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. షెడ్యూల్ ప్రకారం తెలంగాణ  తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగనున్న చివరి ఉపఎన్నిక కావడంతో అన్ని రాజకీయపార్టీలు ఈ  ఎన్నికను ప్రతిష్టాత్మకంగా స్వీకరించాయి.

బీసీలు, ఎస్ సీ, ఎస్ టీ, మైనారిటీల  ఓట్లు మొత్తం కలిపి 70 శాతం పైగా ఓట్లు ఉన్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు ఇప్పటివరకు కాంగ్రెస్,తెరాస, సీపీఐ పార్టీలకు మద్దతు ఇచ్చి తమ విలక్షణతను ప్రదర్శించారు. గతంలో జరిగిన మునుగోడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే… 2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర రెడ్డిపై 22 వేల 552 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు. బీజేపీ టికెట్ పై పోటీచేసిన డా.జీ.మనోహర్ రెడ్డి కేవలం 8 శాతం ఓట్లు మాత్రమే పొందగలిగారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఇదే స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి ,స్వతంత్ర అభ్యర్థి పాల్వాయి స్రవంతి పై గెలుపు సాధించారు.

2018 లో మూడో స్థానంలో బీజేపీ

ఈ ఎన్నికలలో బీజీపీ అభ్యర్ధి డా. జీ.మనోహర్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పై సీపీఐ అభ్యర్ధి ఉజ్జిని యాదగిరి రావు 3,594 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం విశేషం. తాజాగా నవంబర్ 3 న జరుగనున్న మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెరాస అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, బహు జన సమాజ్ పార్టీ అభ్యర్థిగా ఆందోజు శంకరాచారి బరిలో ఉన్నారు.

ప్రధాన రాజకీయ పార్టీలు  తెరాస, బీజేపీ, కాంగ్రెస్ లు ఎవరికి వారే గెలుపు మాదే అన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అభ్యర్థుల ఖరారు, నామినేషన్ల జోరుతో మునుగోడు నియోజకవర్గం ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస , కేంద్రంలో అధికారం లో ఉన్న భాజపాలు  ఉపఎన్నికలో గెలిచేందుకు అస్త్రశస్త్రాలు. సిద్ధం చేస్తున్నాయి. మరొక వైపు కాంగ్రెస్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి పావులు కదుపుతోంది.

సామాజిక వర్గాలపై రాజకీయుల కన్ను

సామాజిక వర్గాల వారీగా ఉన్న ఓట్లకోసం రాజకీయ పార్టీలు గాలం వేస్తున్నాయి. కాంగ్రెస్ ను వీడి, కమలం గుర్తుపై పోటీ చేస్తున్న  కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అండతో రాజకీయంగా ఎదిగిన రాజ్ గోపాల్ రెడ్డి కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ కి అమ్ముడు పోయారని,ఈ విషయం ప్రజలు గుర్తించి మునుగోడు మాజీ ఎమ్మెల్యే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని గెలిపించాలని కాంగ్రెస్ ఓటర్లను కోరుతోంది. సిట్టింగ్ స్థానం గెలవడం ప్రస్తుతం కాంగ్రెస్ కు ఉన్న రాజకీయ అవసరం. టీ పీ సీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భావి రాజకీయ జీవితానికి మునుగోడు ఫలితం ప్రభావితం చేస్తుందని విశ్లేషకుల భావన.

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల తర్వాత జరిగిన నాలుగు ఉపఎన్నికలలో బిజెపి, తెరాస లు రెండేసి స్థానాలలో విజయం సాధించడం కాంగ్రెస్ కు తీవ్ర నిరాశ మిగిల్చింది. అందుకే ఈ సారి అందివచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని ఆ పార్టీ గట్టిగా నిశ్చయించుకుంది.

అమ్మకానికి….. నమ్మకానికి మధ్య యుద్ధం

 ‘ ఉప ఎన్నిక నమ్మకానికి, అమ్మకానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో నిజాయితీ పక్షాన ఉండాలని ఓటర్లను కోరుదాం ‘ అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ ఠాగూర్, టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహిళా సెంటిమెంట్ ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్దామని వారు పార్టీ కార్యవర్గ సభ్యులు, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పనిచేస్తున్న  పార్టీ ఇన్ చార్జి లకు దిశా నిర్దేశం చేశారు.

బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి సారించి, గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయా వర్గాలకు అందించిన తోడ్పాటును ప్రచారంలో ఉపయోగించాలని పార్టీ వ్యూహాలు పన్నుతోంది. టీఆర్ఎస్, బీజేపీ లు ఇద్దరినీ టార్గెట్ చేస్తూ దేశంలో, రాష్ట్రంలో ప్రజాసమస్యలపై వాటిని నిలదీయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో సానుకూల ఫలితం సాధించడానికి అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించడం, భారీ సభను విజయవంతంగా నిర్వహించడం వంటి దూకుడు ప్రచార పర్వంలోనూ కనిపిస్తోంది. తెరాస, బీజేపీ కలిసి చేస్తున్న వంచనకు మునుగోడు ఉపఎన్నికలో ఘన విజయం సాధించి చెక్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం అత్యంత పకడ్బందీ వ్యూహం రచిస్తోంది.

కమ్యూనిస్టుల దన్నుతో కదులుతున్న కారు

తెరాస అధినేత అభ్యర్థన మేరకు మునుగోడు ఉపఎన్నికలో  తెరాసకు మద్దతు ఇవ్వడానికి సీపీఐ అంగీకరించడం ఆసక్తి కలిగించే అంశం. మునుగోడు నియోజకవర్గంలో ఉన్న వామపక్షాల సానుభూతి ఓట్లు తెరాస కు బదిలీ కావడం కోసం సీపీఐ తెరాస తో కలిసి ఉమ్మడి ప్రచారానికి సిద్ధమవుతోంది. తమ పార్టీ తరఫున మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్ళిన నాయకులు, కార్యకర్తలతో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ అనేక సూచనలు చేశారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి, బీజేపీ అభ్యర్థి కోమటి రాజగోపాల్ రెడ్డి అహంకారానికి మధ్య ఈ ఉప ఎన్నిక జరుగుతోందని ఆయన అన్నారు.

వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనుల కోసం ధన దాహంతో రాజ గోపాల్ రెడ్డి ఉప ఎన్నిక తెచ్చారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో గెలిచేందుకు హామీల వర్షం కురిపించి , వాటిలో ఏ ఒక్కదానిని నెరవేర్చకుండా , మళ్ళీ మరోసారి ప్రజలను అబద్ధపు హామీలతో ప్రలోభ పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని కేటీఆర్ అన్నారు.భాజపా మోసపూరిత మాటలు వంచన నుంచి ఓటర్లు ప్రభావితం కాకుండా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు పార్టీ ఇన్ చార్జి లను హెచ్చరించారు.

స్వయంగా ముఖ్యమంత్రి మర్రి గూడ మండలం లెంకల పల్లి గ్రామానికి గజ్వేల్ ఎమ్మెల్యే హోదాలో తెరాస అధినేత కేసీఆర్ ఇన్ చార్జిగా వ్యవహరించనున్నారు. మంత్రి కేటీఆర్ గట్టుప్పల్ మండల కేంద్ర యూనిట్ కు, మరో మంత్రి హరీష్ రావు మర్రి గూడ మండలం కేంద్ర యూనిట్ కు ఇన్ చార్జిలుగా  నియమితులు కావడం విశేషం. మునుగోడు గెలుపును తెరాస సవాల్ గా తీసుకోవడంలో భాగమే ఇటువంటి ఎత్తుగడ.

టీఆర్ఎస్ లో తొంగి చూసిన అసంతృప్తి

మునుగోడు ఉప ఎన్నిక లో తెరాస అభ్యర్థిగా కూసుకుంట్లను ఎంపికచేయడానికి అయిదారు సర్వేలు చేయించినట్లు, అన్ని సర్వేలలోను 50 నుంచి 52 శాతం మద్దతు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి లభించినట్లు ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రకటించి, ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇదిలా ఉండగా…మునుగోడు నియోజక వర్గానికి చెందిన తెరాస అసంతృప్తనేతలను వెంటబెట్టుకుని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రగతి భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మంత్రి హరీష్ రావులతో భేటీ అయ్యారు. గతంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తమను ఇబ్బంది పెట్టిన తీరును ఏకరువు పెట్టారు. తమపై కేసులు నమోదు చేయించడం, ఆర్థికంగా దెబ్బతీయడం వంటివి చేశారని వారు నేతలకు వివరించారు. పార్టీ ఇన్ చార్జిలుగా నియమితులైన నేతలు కూడా తమను సంప్రదించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

తమ ఇబ్బందులను పరిష్కరించకపోతే సొంత దారి చూసుకుంటామని అసంతృప్త నేతలు సంకేతాలు ఇస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. బీజేపీ, కాంగ్రెస్ లను మట్టి కరిపించి, మునుగోడు ను కైవసం చేసుకోవడం  తక్షణ లక్ష్యంగా తెరాస అధినేత కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు.జాతీయ రాజకీయాల అరంగ్రేటం కోసం తాను ప్రకటించిన బీ ఆర్ ఎస్ పార్టీ దూకుడుకు మునుగోడు విజయం నాంది కావాలని ఆయన ఆశిస్తున్నారు. వారి అభీష్టం మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇస్తే బీ ఆర్ ఎస్ పార్టీ పేరు మీదనే  ఉపఎన్నికల బరిలో నిలవాలని కేసీఆర్ ధృఢ సంకల్పంతో ఉన్నారు. మునుగోడు విజయంతో కేంద్రంపై మరింత  ఒత్తిడి తేవాలన్నది ఆయన ఆలోచనగా రాజకీయ విమర్శకులు అంటున్నారు.

ఇక్కడ గెలిస్తే ఇక హద్దు ఉండదు

ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే.. మునుగోడు ఉప ఎన్నిక విజయం తమ పార్టీలో ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచగలదని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత పలుకుబడికి , ప్రజల్లో బీజేపీ పట్ల క్రమంగా పెరుగుతున్న ఆదరణ తోడై విజయం సాధించడం తథ్యమని ఆ పార్టీ గట్టిగా నమ్ముతోంది. మునుగోడు నియోజకవర్గంలో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని రూపొందించి ఓటర్లందరినీ కలవడంపై కమలదళం దృష్టి పెట్టింది. తెరాస వైఫాల్యాలను ఎండగట్టడంతో పాటు కేంద్ర పథకాలపై  ప్రచారం ముమ్మరం చేయనుంది.

నియోజకవర్గంలోని 298 బూత్ లలో మెజారిటీ సాధనకు ఆయా కమిటీలను కార్యోన్ముఖులను చేస్తోంది. ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించి క్షేత్రస్థాయి కార్యాచరణను పార్టీ పూర్తిచేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులు అధిష్టానానికి వివరిస్తూ వారి సూచనలను, సలహాలను పార్టీ శ్రేణులకు చేరవేస్తున్నారు. మునుగోడు నియోజక వర్గ ఓటర్లు  హైదరాబాద్ నగర శివార్లలో ఎక్కడెక్కడ ఉన్నారు అనే విషయం పై బీజెపీ నేతలు కసరత్తు ప్రారంభించారు.

మునుగోడు గెలుపు కంటే మెజారిటీ పై ఎక్కువ దృష్టి పెట్టినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తుల్ని సంఘటితం చేయాలని ఆశిస్తున్న తెరాస అధినేత కేసీఆర్ కు మునుగోడు ఓటమి కళ్ళు తెరిపించడం ఖాయమని   బీజేపీ ఘంటాపథంగా చెబుతోంది. ఈ ఉపఎన్నికలో బీజేపీని గెలిపించి కేసీఅర్ అవినీతి సర్కార్ కు చరమగీతం  పాడాలని అధిష్టానం పార్టీ శ్రేణులకు పిలుపునిస్తోంది. కేసీఆర్ పరిపాలనపై విసుగు చెందిన ప్రజలు బీజేపీ ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారని, అది మునుగోడు విజయంతో రుజువు కాగలదని పార్టీ నమ్ముతోంది. దుబ్బాక, హుజూరాబాద్ లలో వచ్చిన ఫలితమే ఇక్కడా వస్తుందని వారు ధీమాగా ఉన్నారు.

అందరూ రెడ్లే

బీసీలు, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు మెజారిటీ సంఖ్యలో ఉన్న మునుగోడు ఉప ఎన్నికలో తెరాస, బీజేపీ, కాంగ్రెస్ లు ఓకే సామాజిక వర్గానికి టికెట్స్ కేటాయించడం అన్యాయం అనే అంశాన్ని తెరపైకి తెచ్చి బీ ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీ అభ్యర్థిగా బీసీ నేత ఆందోజు శంకరాచారిని పోటీలోకి దించారు. బీసీ వ్యతిరేక పార్టీల నుంచి బహుజనులను కాపాడి, సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం శంకరాచారిని మునుగోడు ఓటర్లు గెలిపించాలని బీ ఎస్పీ అధినేత కోరారు. 1300మంది అమరుల ఆశయాలు నెరవేరాలంటే బీఎస్పీ అభ్యర్థికి ఓటు వేయాలని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర బీఎస్పీ నేతలు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో..మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికలలో బీజెపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధిస్తే అది ఆయన ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ క్షేత్ర స్థాయిలో బీజేపీ పార్టీ ఇంకా మొగ్గ దశలోనే ఉందని పరిశీలకుల అంచనా. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం దక్కించుకుంటే ఆ పార్టీని ప్రజలు ఇంకా నమ్ముతున్నారని తెలుస్తుంది. ఒక వేళ…తెరాస గెలిస్తే కేసీఆర్ జాతీయస్థాయి రాజకీయాల లక్ష్యానికి ఊతం దొరికినట్లు అవుతుంది. మునుగోడు ఓటర్లలో అత్యధిక శాతంగా ఉన్న బీసీలు, ఎస్సీ,ఎస్టీ సామాజిక వర్గాలు గెలుపోటములను ప్రభావితం చేయడం సహజం. వారు మొగ్గు చూపినవారు నెగ్గడం ఖాయమని తెలుస్తోంది. అయితే.. కాంగ్రెస్ , తెరాస, బీజేపీ, బీఎస్పీల మధ్య ఓట్ల చీలిక ఆధారంగా జయాపజ యాలు ఉంటాయనేది నిర్వివాదాంశం.

ఈ ఎన్నికలో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా ఇటు రాష్ట్రంలో గానీ, అటు కేంద్రంలో గానీ వచ్చే తక్షణ మార్పులు ఏమీ ఉండవు. ఒక ఉప ఎన్నికలో గెలవడం కోసం సర్వ శక్తులు ఒడ్డడం విడ్డూరం. మునుగోడు ఉప ఎన్నిక  మరొక అత్యంత ఖరీదైన ఎన్నికగా చరిత్రకెక్కడం ఒక్కటే ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన అంశం. పార్టీల జెండాలు, గుర్తులు, సిద్ధాంతాలు( ఉన్నాయని నమ్మితే) లో తేడాలు ఉంటాయి గానీ ఎలాగైనా గెలవాలి అనే రాక్షస రాజకీయ క్రీడలో తిలా పాపం తలా పిడికెడు. ప్రజాస్వామ్యం నేతి బీరకాయ చందంగా మారిన నేపథ్యంలో ఎన్నికలను పవిత్రంగా చూసే అదృష్టం సగటు ఓటరుకి దూరమై చాలా దశాబ్దాలు గడిచాయి. ఆ పరంపరలో మునుగోడు లో గెలిచే మొనగాడు ఎవరైనా దేశానికి ఏమున్నది గర్వకారణం?

పొలమరశెట్టి కృష్ణారావు, రాజకీయ సామాజిక విశ్లేషకుడు

Related posts

ఆకుపచ్చని పల్లెటూరు ఆ గ్రామం

Satyam NEWS

దేశ చ‌రిత్ర‌లోనే జ‌గ‌న‌న్న కాల‌నీలు ప్ర‌తిష్ఠాత్మ‌కం

Satyam NEWS

వెయ్యి రూపాయ‌ల కోసం ఎస్పీ మీడియా స‌మావేశం

Satyam NEWS

Leave a Comment