39.2 C
Hyderabad
May 3, 2024 11: 36 AM
Slider చిత్తూరు

చిత్తూరు నియోజకవర్గ తెదేపాకు దిక్కెవరు?

chandrababu

జిల్లా కేంద్రమైన చిత్తూరులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎవరు అనే విషయంలో  రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎన్నికల అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి మాజీ శాసనసభ్యుడు ఏఎస్ మనోహర్ రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఇన్చార్జి పోస్ట్ ఖాళీగా ఉంది. శాసన మండలి సభ్యుడు దొరబాబు అన్నీ తానై నడిపిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్చార్జిలే  ఎమ్మెల్యే అభ్యర్థులని ప్రకటించడంతో నియోజకవర్గ ఇన్చార్జిలపైన చర్చ ప్రారంభం అయ్యింది. పలువురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నవారు.

జిల్లా కేంద్రమైన చిత్తూరు తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకమైన స్థానం. గతాన్ని పరిశీలిస్తే 1952 నుండి 17 సార్లు ఎన్నికలు జరగ్గా,   మూడు పర్యాయాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ శాసనసభ స్థానాన్ని కైవసం చేసుకోగలిగింది. 1983లో ఝాన్సీలక్ష్మి, 2004లో AS మనోహర్, 2014లో సత్యప్రభ TDP తరపున విజయం సాధించారు. ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పనిచేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు ఏఎస్ మనోహర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. దీనితో ఇన్చార్జి పోస్టు ఖాళీ అయింది. 4 సంవత్సరాలుగా ఇన్ ఛార్జ్ ను నియమించడానికి పార్టీ చర్యలు తీసుకోలేదు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రస్తుతం నియోజక వర్గ ఇంచార్జ్ ని ప్రకటించడానికి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు నియోజక వర్గానికి చెందిన పార్టీ నాయకులతో కీలక మంతనాలు జరుపుతున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి కోసం అన్వేషణ జరుగుతుంది.

శాసన సభ్యునిగా మూడు పర్యాయాలు ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన సి.కె.బాబు ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారడం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో వైరి వర్గాల ఆధిపత్యం ఎక్కువ కావడంతో సి.కె.బాబు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన పార్టీలో చేరిన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సి.కె బాబుకు చిత్తూరు నియోజకవర్గంలో ఓటు బ్యాంకు ఉంది. రాజకీయంగా ఎత్తులు పైఎత్తులు వేయడంలో దిట్ట.   ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేస్తే  సంవత్సరం ముందుగా తాను క్రియాశీలకంగా పని చేస్తానని అధిష్టాన వర్గానికి సీకే బాబు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే CK బాబును కమ్మ సమాజిక వర్గానికి చెందిన నాయకులు వ్యతిరేకించడంతో CK బాబును పక్కన పెట్టినట్లు సమాచారం.

చిత్తూరు నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం ప్రాభాల్యం ఎక్కువగా ఉంది. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు కూడా బలిజ సామాజికవర్గానికి చెందిన వారే. ఒక పర్యాయం ఏఎస్ మనోహర్, మరో పర్యాయం డీకే సత్యప్రభ శాసనసభ్యులుగా గెలుపొందారు. ఎస్ మనోహర్ పార్టీకి రాజీనామా చేయడం, డీకే ఆదికేశవులు, ఆయన భార్య డీకే సత్యప్రభ స్వర్గస్తులు కావడంతో వారి కుటుంబం నుండి కుమారుడైన శ్రీనివాస్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన రాజకీయ పదవుల పట్ల ఆశక్తి చూపడంలేదు.

చిత్తూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాజూరు బాలాజీ చిత్తూరు నియోజకవర్గ ఇన్చార్జి రేసులో ఉన్నారు. తనదైన శైలిలో నియోజకవర్గ ప్రజలతో మమేకం అవుతున్నారు.  కరోనా సమయంలో ఆనందయ్య కొరోనా మందును నియోజకవర్గంలోని అన్ని వర్గాలకు అందజేశారు. కరోనా సమయంలో కూడా అండగా ఉంటూ సహాయ సహకారాలను అందించారు. భోజనాలు ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. పార్టీ కోసం ఇప్పటి వరకు రెండు కోట్ల రూపాయల వరకు వ్యయం చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోరాడారు. అందుకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలలో దూసుకుపోతున్నారు.

ఇదివరకు చిత్తూరు నియోజకవర్గ ఇన్చార్జిగా కటారి మోహన్ ఉండేవారు. దురదృష్టవశాత్తున కటారి మోహన్, ఆయన సతీమణి మున్సిపల్ మాజీ చైర్మన్ కటారి అనురాధలు మరణించారు. వారి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని కటారి ప్రవీణ్ పార్టీలో కీలకంగా పనిచేశారు. మున్సిపల్ చైర్మన్ పదవిని తన సతీమణి  హేమలతకు ఇప్పించడంలో కృతకృత్యులయ్యారు. నియోజకవర్గ బాధ్యతలను తాను చూసుకుంటున్న సమయంలో కరోనా కారణంగా మృత్యువు  పాలయ్యారు. మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన కటారి హేమలత పేరు కూడా చిత్తూరు నియోజకవర్గ ఇంచార్జ్ పదవికి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణ అధ్యక్షురాలిగా ఆమె పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా ఉన్నారు. ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు.

తెలుగు దేశం పార్టీకి రాష్ట్రంలో అనుకూల వాతావరణం కనిపించడంతో ఇప్పుడు కమ్మ సామాజిక వర్గ నేతలు ఇన్ ఛార్జ్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. చిత్తూరు MPPగా, మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా పనిచేసిన చంద్రప్రకాష్ టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఆయన సతీమణి గీర్వాణి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. బంగారు పాళ్యం మండలానికి చెందిన భాస్కర హోటల్ అధినేత NPS జయప్రకాష్ రేసులో ఉన్నారు. ఆయన బంగారు పాళ్యం మండల పార్టీ అధ్యక్షుడుగా, MPPగా, ZPTCగా పనిచేశారు. చిత్తూరు MPPగా పనిచేసిన మరో చేసిన మరోనేత  జయచంద్ర నాయుడు కూడా టిక్కెట్టు ఆశిస్తున్నారు. గుడిపాల మండలానికి చెందిన గురజాల జగన్మోహన్ నాయుడు కూడా తెర ముందుకు వచ్చారు. బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆయన చిట్టిరులో ఇల్లు కొని గృహ ప్రవేశం చేశారు.

ఈ నేపథ్యంలో అధిష్టానవర్గం ఎవరి వైపు మొగ్గు చూపుతుందోనని నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కమ్మ సామజిక వర్గం నుండి చంద్రప్రకాష్, జయప్రకాష్, జగన్మోహన్ నాయుడు, జయచంద్ర నాయుడు, రెడ్డి సామాజిక వర్గం నుంచి CK బాబు, బలిజ సామాజిక వర్గం నుంచి కాజూరు బాలాజీ, కటారి హేమలతల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో అధిష్ఠానవర్గం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది వేచి చూడాల్సిందే. ఎన్నికల పొత్తులో భాగంగా చిత్తూరు జనసేన లేక BJP లకు కేటాయించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కావున చంద్రబాబు చిత్తూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ నియమించలేదని అంటున్నారు. ఏ విషయం తొందరగా తేల్చాలని స్థానిక నాయకులు కోరుతున్నారు. చివరి నిమిషంలో  ప్రకటిస్తే ఆశావహులు సహాయ నిరాకరణ చేసి, పార్టీకి నష్టం జరుగుతుందని భావిస్తున్నారు.

సాటి గంగాధర్, సీనియర్ జర్నలిస్టు, చిత్తూరు

Related posts

జాతీయ స్థాయిలో ఐసీఏఆర్ 14వ ర్యాంకు గ‌ర్వ‌కార‌ణం

Sub Editor

చంద్రబాబునాయుడి మళ్లీ యూ టర్న్

Satyam NEWS

ప్రజాసమస్యలు పరిష్కారం అయ్యే వరకూ పీపుల్స్ మార్చ్

Sub Editor 2

Leave a Comment