40.2 C
Hyderabad
April 29, 2024 16: 50 PM
Slider సంపాదకీయం

Top Secret: గజ్వేల్ లో పోటీ చేస్తానని ఈటల ఎందుకు అంటున్నారు?

#trsparty

హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ కోట్లు ఖర్చు పెట్టినా సరే బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ సారి తన నియోజకవర్గ మార్పు గురించి పదే పదే ఎందుకు చెబుతున్నారు? వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నియోజకవర్గం అయిన గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఈటల రాజేందర్ ఇప్పటికి పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.

దీనిపై బిజెపి కార్యకర్తలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బిజెపి తెలంగాణ లో పశ్చిమ బెంగాల్ టైపు రాజకీయాన్ని అనుసరించబోతున్నదని ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పశ్చిమ బెంగాల్ లో నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి సువేందు అధికారిని నిలబెట్టి మమతా బెనర్జీని ఓడించింది. 1956 ఓట్ల తేడాతో బిజెపి అభ్యర్ధి అక్కడ గెలిచారు.

పశ్చిమబెంగాల్ లో మెజారిటీ సీట్లు సాధించినా మమతా బెనర్జీ ఓడిపోవడంతో ఆమె పరువు జాతీయ స్థాయిలో పోయింది. ఆ తర్వాత భవానీపూర్ లో ఉప ఎన్నిక వచ్చేలా చేసుకోని అక్కడ గెలిచే వరకూ మమతా బెనర్జీకి బిజెపి టెన్షన్ పెట్టింది. అదే వ్యూహం తెలంగాణలో కూడా అనుసరించేందుకు బిజెపి సమాయత్తం అవుతున్నదనే ప్రచారం విస్తృతంగా ఉంది. అక్కడ మమతా బెనర్జీ ఒక్కరే కానీ తెలంగాణ లో ‘‘టాప్ 4’’ ఉన్నారు.

కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులు ఈ టాప్ 4 తెలంగాణ లో ఉన్నందున అక్కడ సువేందు అధికారి ఒక్కరే సరిపోయారు కానీ ఇక్కడ బిజెపికి నలుగురు కావాల్సి ఉంది. ఆ నలుగురిలో ఒక్కడు ఈటల రాజేందర్ గా బిజెపి ప్రచారం చేసుకుంటున్నది.

ఇది పైకి జరుగుతున్న ప్రచారం కాగా….. లోపల కథ వేరుగా ఉంది…

తెలంగాణ లో ఉన్న టాప్ 4లో ఒక్క హరీష్ రావు తప్ప మిగిలిన వారు కొత్త నియోజకవర్గాలలో పోటీ చేయాలని ప్రస్తుతానికి అనుకుంటున్నారు. అంటే ఈ సారి కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేసే అవకాశం లేదని టీఆర్ఎస్ పార్టీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గజ్వేల్ నుంచి కాకుండా ఆయన సిద్దిపేటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

ఇదే జరిగితే సిద్దిపేట కు ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావును కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించే అవకాశం ఉంటుంది. అదే విధంగా కేటీఆర్ కూడా నియోజకవర్గం మారుస్తారనే ప్రచారం జరుగుతున్నది. అది నిజమైతుందో కాదో తెలియదు కానీ గజ్వేల్ పై మాత్రం ప్రస్తుతం గేమ్ నడుస్తున్నది.

ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నట్లు పదే పదే ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ నియోజకవర్గం మార్చుకుంటే ఈటల రాజేందర్ పోటీ చేస్తానన్నాడు కాబట్టి కేసీఆర్ పారిపోయాడు అనే మాట వస్తుంది.

లేదూ గజ్వేల్ నుంచే ఆయన పోటీ చేస్తే తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా నందిగ్రామ్ నుంచి మమతా బెనర్జీని కదలకుండా చేసినట్లు కేసీఆర్ ను గజ్వేల్ పైనే దృష్టి నిలిపేలా చేస్తే మిగిలిన సీట్లపై బిజెపి తన పూర్తి దృష్టిని కేంద్రీకరించే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే కేంద్ర మంత్రులు ఒక్కొక్కరూ ఒక్కో నియోజకవర్గంపై దృష్టిపెట్టి ఉన్నారు. కేసీఆర్ ను గజ్వేల్ వదిలేలా చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా బిజెపికి గెలుపు అవకాశాలు మెరుగుపడతాయి. కేసీఆర్ గజ్వేల్ నుంచే పోటీ చేసే పరిస్థితి కల్పిస్తే కేటీఆర్ సిరిసిల్ల నుంచే పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.

అదే విధంగా హరీష్ రావు సిద్దిపేట నుంచే పోటీ చేయాల్సి వస్తుంది. ఇప్పటికే ఎంఎల్ సి గా ఉన్న కవిత అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే అవకాశాలు సన్నగిల్లుతాయి. టీఆర్ఎస్ టాప్ 4 ‘సేఫ్’ నియోజకవర్గాలకు వలస వెళ్లే పరిస్థితిని అడ్డుకోవడం ద్వారా ఫలితాలను తారుమారు చేయవచ్చుననేది వ్యూహం.

ఇలా జరిగితే హరీష్ రావు సిద్దిపేట నుంచే పోటీ చేయాల్సి వస్తుంది. సిద్దిపేటలో హరీష్ రావు సేఫ్. హరీష్ రావు పై బిజెపిలో కొందరికి ‘సాఫ్ట్ కార్నర్’ ఉన్నందున ఆయన గెలవడం వారికి ఆనందమే కలిగిస్తుంది. ఈ లాజిక్ తోనే ఈటల టీఆర్ఎస్ నాయకులతో ‘మైండ్ గేమ్’ ఆడుతున్నారు.  

Related posts

పిడుగు పాటుకు కళ్ల ముందే మరణించిన యువతి

Satyam NEWS

భయమా?…..: నోరువిప్పని ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు

Satyam NEWS

కానిస్టేబుల్ వ్రాత పరీక్షా కేంద్రాల పరిశీలించిన విశాఖ రేంజ్ డీఐజీ

Satyam NEWS

Leave a Comment