40.2 C
Hyderabad
April 29, 2024 16: 03 PM
Slider నెల్లూరు

ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారను: ఎంపీ ఆదాల

#MP Adala

నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వైసిపి నుంచి వెళ్లబోనని నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికలు సమీపించే తరుణంలో తాను పార్టీ మారుతానని సమావేశంలో చెప్పడాన్ని ఆయన ఖండించారు.

ఇటువంటి అభూత కల్పనలు, అవాస్తవ విషయాలను ప్రచారం చేయడం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికే చెల్లిందన్నారు. లేనిపోనివి కల్పించి సమావేశంలో మాట్లాడటం దురుద్దేశ పూరితమైనదని పేర్కొన్నారు. వైసిపి అధినేత, ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి తనను నమ్మి ఎంపీ అభ్యర్థిగా గతంలో బరిలోకి దింపారని పేర్కొన్నారు. ప్రజలు ఆయన నిర్ణయాన్ని ఆమోదించి మంచి మెజారిటీతో ఎంపీగా గెలిపించారని గుర్తు చేశారు.

అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా అందరికంటే ముందుగా ప్రకటించి తనపై ఉన్న నమ్మకాన్ని వెల్లడించారని తెలిపారు. దానిని కాపాడుకుంటానని, ఎట్టి పరిస్థితుల్లోనైనా వైసీపీ అభ్యర్థిగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బరిలో ఉంటానని స్పష్టం చేశారు. తాను రూరల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని తెలిసిన వెంటనే ఒక పథకం ప్రకారం టిడిపి మోసపూరితమైన ఒక ప్రచారాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు.

గత నాలుగు నెలలుగా ఈ విధమైన గోబెల్స్ ప్రచారం మొదలైందని విమర్శించారు. ప్రజలను అయోమయానికి గురిచేసి తనకు, పార్టీకి నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే దీనిని ప్రారంభించారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ తన లబ్దికోసం ఒక మైండ్ గేమ్ ఆడుతోందని, దీనిని ఎవరు నమ్మబోరని విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర ప్రజలకు, దేశంలో ఎక్కడా లేనంత సంక్షేమాన్ని అమలు పరుస్తున్నారని తెలిపారు.

దీనికి ప్రజల నుంచి కూడా అద్భుతమైన స్పందన లభిస్తోందని, దీనికి గత నాలుగేళ్లలో ఎన్నికల్లో లభించిన ఆదరణే మంచి ఉదాహరణ అని తెలిపారు. కేవలం సంక్షేమానికే పరిమితం కాకుండా, అభివృద్ధికి కూడా సముచిత స్థానాన్ని కల్పించి ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం తధ్యమని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ కుయుక్తులతో లబ్ధి పొందాలని భావించడం పగటి కల మాత్రమేనని, దానివల్ల వారికి లభించే ప్రయోజనం ఏమీ లేదని పేర్కొన్నారు. ప్రజల చేత ఎన్నోసార్లు తిరస్కరణకు గురైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇంకా జ్ఞానోదయం కలగలేదని, అందుకే ఇటువంటి తెలివిలేని మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా వీరి మాటలను నమ్మబోరని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Related posts

టిడ్కో ఇళ్ళల్లో 16న గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలి

Satyam NEWS

ఎలక్టోరల్ సర్వే త్వరగా పూర్తి చేయాలి

Bhavani

ఆవిర్భావ సభ వేదికను పరిశీలించిన మెగా బ్రదర్

Sub Editor 2

Leave a Comment