38.2 C
Hyderabad
May 1, 2024 21: 38 PM
Slider ప్రత్యేకం

నిన్న ఆనం…నేడు వసంత: రౌడీలను వెంటేసుకుతిరగాలా?

#YCP leaders

అధికార వైసీపీలో ధిక్కార స్వరాలు అదుపు కావడం లేదు. వైసీపీ అగ్ర నాయకులు ఎంత ప్రయత్నించినా నేతల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై వసంత కృష్ణప్రసాద్ అసంతృప్తిని వెళ్లగక్కారు. మంగళవారం మైలవరం మండలం చంద్రాల సొసైటీ శంకుస్థాపన సభలో కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసుల విషయంలో తమ పార్టీలో ఉన్న కొందరు నాయకులపై అసంతృప్తి ఉందన్నారు. పది మంది రౌడీలను వెంటేసుకుని తిరగడం చేతగాక పాత తరం నాయకుడిలా మిగిలిపోయానంటూ వ్యాఖలు చేశారు. 55 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని, అప్పటి రాజకీయాలతో పోలిస్తే ఇప్పటి రాజకీయాలు గణనీయంగా మార్పు చెందాయని అన్నారు.

రౌడీలను వెంటేసుకుని తిరిగితేనే ముందుకెళ్లే పరిస్థితులున్నాయన్నారు. ఒక్కోసారి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని బాధపడుతున్నాని కీలక వ్యాఖ్యలు చేశారు. సగటు వ్యక్తులకు సహాయం కూడా చేయలేపోతున్నానని కృష్ణ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. వసంత కృష్ణ ప్రసాద్ కు మంత్రి జోగి రమేష్ కు తీవ్ర విభేదాలు ఉన్న విషయం తెలిసిందే.

వచ్చే ఎన్నికల్లో మైలవరం స్థానం నుంచి జోగి రమేష్ పోటీ చేస్తారని ఇప్పటికే అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జోగి రమేష్ కు వసంత కృష్ణ ప్రసాద్ కు వైసీపీ అధిష్టానవర్గం రాజీ కుదిర్చినా కూడా ఇరు వర్గాలూ తగ్గదే లే అంటున్నాయి. జోగి రమేష్ ను ఉద్దేశించే ‘రౌడీలను వెంటేసుకుని తిరిగితేనే’ అనే వ్యాఖ్యలు చేసినట్లు అందరూ భావిస్తున్నారు. ఇటీవలె వెంకట గిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ధిక్కార స్వయం వినిపించిన విషయం తెలిసిందే. నాలుగేళ్లలో ఏం చేశామని మళ్లీ ఓట్లు అడగాలి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

తాజాగా ‘సగటు వ్యక్తులకు సహాయం కూడా చేయలేకపోతున్నానని’ వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు. వసంత కృష్ణ ప్రసాద్ ఇటీవలె గుంటూరు తొక్కిసలాట జరిగిన కార్యక్రమ నిర్వాహకుడిని వైసీపీ పెద్దల మనోభీష్టానికి వ్యతిరేకంగా సపోర్టు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ పెద్దలు ఆ కార్యక్రమ నిర్వాహకుడు, ప్రవాస భారతీయుడు అయిన ఉయ్యూరు శ్రీనివాస్ పై కేసులు పెట్టి వేధిస్తుంటే వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం అతడిని సపోర్టు చేశారు.

గతంలో జగన్ ప్రభుత్వం ఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ తండి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు పూర్తిగా వ్యతిరేకించారు. ఎన్టీఆర్ పేరు తీసేసి రాజశేఖరరెడ్డి పేరు పెట్టడం అన్యాయమని ఆయన జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టారు. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వైసీపీపై తిరుగుబాటు గళాల సంఖ్య పెరిగిపోతున్నదని పరిశీలకులు భావిస్తున్నారు.

Related posts

బిజెపి నుంచి జెంప్: ప్రజా సంక్షేమంకై తెరాస లో చేరిక

Satyam NEWS

వైయస్ షర్మిలకు 2+2 భద్రత పెంపు

Satyam NEWS

వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం

Satyam NEWS

Leave a Comment